Share News

పరిషత్‌ కోలాహలం

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:43 AM

పరిషత్‌ ఎన్నికల నామినేషన్‌లు జోరందుకున్నాయి. నామినేషన్‌ కేంద్రాల వద్ద కార్యకర్తలు రద్తీతో కోలాహలంగా మారింది. ఎంపిటిసి అభ్యర్థులు తమ కేడర్‌తో కలసి వస్తున్నారు. మద్దతు దారులతో చేరుకుంటున్నారు. ఎంపిటిసి, జడ్‌పిటిసి నామినేషన్‌లకు ఒక్కరోజే గడువు మిగిలి ఉంది.

పరిషత్‌ కోలాహలం
భీమవరంలో నామినేషన్‌ కేంద్రం వద్ద పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

నామినేషన్‌ కేంద్రాల వద్ద సందడి

వందలాదిగా చేరుకోవడంతో రద్దీ

ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ

రెండు రోజుల్లో ఎంపీటీసీ

స్థానాలకు 1042 .. జడ్పీటీసీలకు 76

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పరిషత్‌ ఎన్నికల నామినేషన్‌లు జోరందుకున్నాయి. నామినేషన్‌ కేంద్రాల వద్ద కార్యకర్తలు రద్తీతో కోలాహలంగా మారింది. ఎంపిటిసి అభ్యర్థులు తమ కేడర్‌తో కలసి వస్తున్నారు. మద్దతు దారులతో చేరుకుంటున్నారు. ఎంపిటిసి, జడ్‌పిటిసి నామినేషన్‌లకు ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. శాంతి భధ్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా జిల్లాలో ప్రశాంతంగా నామినేషన్లు వేస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థులు భీమవరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు పార్టీ శ్రేణులు, మద్దతు దారులతో తరలిస్తున్నారు. రెండో రోజు నామినేషన్‌లు జోరందు కున్నాయి. మంచిరోజుగా భావించి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. ఎంపీపీ అభ్యర్థులు కూడా ఎంపీటీసీలుగా అత్యధిక మంది గురువారం దాఖలు చేశారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం కేంద్రాల వద్ద మంచి జోష్‌ నెలకొంది. ఆచంట నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థుల పెద్ద సందడే చేశారు. మంది మార్బలంతో కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థులు కూడా ఒకేరోజు నామినేషన్‌లు వేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక్కరోజు అయితే కేంద్రాల వద్ద తమ కార్యకర్తలతో సందడి ఉంటుందని నియోజకవర్గ నాయకత్వం ఆ దిశగా సూచనలు చేసింది. ఇతర పార్టీల నుంచి అంతగా పోటీ లేదు. సీపీఎం మాత్రమే అక్కడక్కడా తమ అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. అటువంటి చోట్ల వైసీపీ నుంచి సీపీఎం అభ్యర్థులకు మద్దతు లభిస్తోంది.

నామినేషన్ల హుషారు

జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలకు తొలిరోజు బుధవారం 10 నామినేషన్‌లు దాఖలయ్యాయి. రెండో రోజైన గురువారం ఏకంగా 66 నామినేషన్‌లు దాఖలు చేశారు. ప్రతి మండలం నుంచి జడ్పీటీసీలకు నామినేషన్‌లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో మొత్తం 76 నామినేషన్‌లు పడ్డాయి. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు అత్యధిక నామినేషన్‌లు వేశారు. కూటమి పొత్తులో భాగంగా కొన్ని మండలాల జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు దాఖలు చేశారు. జిల్లాలో 372 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రెండు రోజుల్లో 1042 నామినేషన్‌లు పడ్డాయి. తొలిరోజు 192, రెండో రోజు 850 నామినేషన్‌లు వేశారు. అందులో డమ్మీ అభ్యర్థులు కూడా ఉన్నారు. శుక్రవారంతో నామినేషన్‌ల గడువు ముగియనుంది. దాంతో అభ్యర్థులు ముందుగానే మేల్కొన్నారు. రెండో రోజు అత్యధికంగా నామినేషన్‌లు వేసేశారు. చివరి రోజు కూడా ఇదే తరహాలో రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు,

ప్రశాంతంగా నామినేషన్లు

పరిశీలించిన కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి

భీమవరంటౌన్‌/భీమవరం క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. రెండోరోజు నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌ కల్పశ్రీ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమణ, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం భీమవరం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు. భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, భీమవరం టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:43 AM