Share News

కరుణించవా..వరుణదేవా!

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:43 AM

వర్షాలు దోబూచులాడుతున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వరినారుమడులు, నాట్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.

కరుణించవా..వరుణదేవా!
ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో కప్పలను ఊరేగిస్తున్న గ్రామస్థులు

దోబూచులాడుతున్న వర్షాలు

జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు

ఎండిపోతున్న వరి నారుమళ్లు, నాట్లు

అల్పపీడనం ఏర్పడినా వర్షం జాడలేదు

వానలు కురవాలంటూ పూజలు

పెదపాడులో ఘనంగా వరుణ యాగం

కొవ్వలిలో కప్పల పెళ్లి

కైకలూరులో జలాభిషేకం

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

వర్షాలు దోబూచులాడుతున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వరినారుమడులు, నాట్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావం తీవ్రం కావడం, వర్షాలు జాడలేకపోవడంతో ప్రజలు వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. గ్రామదేవతలైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినా వర్షాలు కురియడం లేదు. జూన్‌లో అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు జూలైలో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ కనిపించలేదు. ఎల్‌నినో ప్రభావంతోనే వర్షాలు మంద గించాయని వాతావరణ శాఖ చెబుతోంది.ఈ ప్రభా వం ప్రధానంగా సార్వా సాగుపై పడింది. వర్షాలు లేక వరి నారుమళ్ళు, నాట్లు ఎండిపోతున్నాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల కింద సాగులోను సాగునీటి కష్టాలు ఎదురవుతు న్నాయి. ఇక రోజువారీ ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సార్వా సాగు లో 2లక్షల 11వేల ఎకరాల్లో వరి సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటికి 60 వేల ఎకరాల్లో (28.43 శాతం) మాత్ర మే నాట్లు పూర్తి కావడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ దృష్టిసారించింది.

ముదినేపల్లి : కృష్ణా తూర్పు డెల్టాకు శివారున ఉన్న కైక లూరు నియోజవకర్గంలో వేలాది ఎకరాల ఆయకట్టులో వెదజల్లిన వరిపైరు, వరి నారుమళ్లు ఎండిపోగా మురుగు డ్రెయిన్లలోని కొద్దిపాటి నీటిని ఇంజన్లతో తోడుకుని ఇప్పటివరకు బతికించుకున్న వరిపైరును కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో 14 వేలు, కలిదిండి మండలంలో 3 వేలు, కైకలూరు మండలంలో 3 వేలు, మండవల్లి మండలంలో 7 వేల ఎకరాల్లో సార్వా వరి సాగు చేస్తుండగా 70 శాతం భూముల్లో వరి వెదజల్లడం, 5 శాతం భూముల్లో నాట్లు పూర్తయ్యాయి. నీరందక దుక్కులు జరగక, దుక్కులు పూర్తయినా నాట్లుపడని భూములు 25 శాతం మిగిలిపోయాయి. వెదజల్లిన భూముల్లో 60 శాతం పైగా భూముల్లో నీరందక వరి పైరు ఎండిపోయింది. కాల్వల ద్వారా సాగునీరు సర ఫరా కష్టమేనని అధికారులు తేల్చిచెప్పడంతో పంట ను ఎలా బతికించుకోవాలన్నది రైతులకు సమస్యగా పరిణమించింది.

ఆగిరిపల్లి :మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఇప్పటి వరకు పడకపోవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. మరోవైపు వేసవిని తలపిం చేలా ఎండలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా గ్రామాల్లో నారుమళ్ళు, వెదజల్లిన వరి పొలాలు ఎండిపోతున్నా యి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడు తున్నారు. ఎండిపోతున్న వరి నారుమడిని రక్షించుకు నేందుకు ఎక్కడో దూరంగా ఉన్న చెరువు, వాగుల నుంచి ఇంజన్ల ద్వారా నీటిని అందించేందుకు శ్రమి స్తున్నారు.

పెదపాడు : సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ అభివృద్ధి చెందాలని కోరుతూ పెదపాడు విఘ్నేశ్వరస్వామి దేవాలయంలో ఆదివా రం ప్రత్యేక పూజలు, వరుణ యాగం నిర్వహించారు. విఘ్నేశ్వరస్వామిని గరిక మాల, గజమాలలతో విశేషాలంకరణ చేసి 108 బిందెల నీళ్లు అభిషేకం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ వరుణ యాగాన్ని నిర్వహించారు. గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.

కైకలూరు : కైకలూరు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున 108 బిందెలతో ధ్వజస్తంభానికి వర్షాలు కుర వాలని జలాభిషేకం చేసి పూజలు చేశారు. వీర బ్రహ్మేంద్రస్వామికి, గోవిందమాంబకు విశేష పూజ లను నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ టేకి వేంకట సత్యనారాయణ, కోశాధికారి అనుపోజు నాగేశ్వరరావు, తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు నిర్వహించారు.

దెందులూరు : సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, వరుణుడి కటాక్షం కోసం కొవ్వలిలో గ్రామస్థులు ఆదివారం కప్పల పెండ్లీ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రెండు కప్పలను వధూవరులుగా అలంకరించి పుంతలో ముసలమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి బాజాభజంత్రీల నడుమ గ్రామంలోని ఆల యాలను సందర్శిస్తూ ఊరేగించారు. అనంతరం కప్పలను చెరువు వద్దకు తీసుకుని వెళ్లి రైతులు, మహిళలు, గ్రామస్థుల సమక్షంలో పెండ్లితంతు నిర్వహించారు. తమ ఇంట ముందుకు వచ్చిన కప్పలకు మహిళలు జలాభిషేకం చేశారు. రామారావుగూడెం గ్రామంలోని యాదవులపేటలో సకాలంలో వర్షాలు పడాలని గంగానమ్మకు ఆషాడం సారే సమర్పించారు.

Updated Date - Jul 27 , 2026 | 12:43 AM