వాన జాడేదీ!
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:10 AM
బంగాళాఖాతంతో తీవ్ర అల్పపీడనం ఏర్పడినా జిల్లాలో ఎక్కడా చినుకు రాలలేదు.. పంట చేలకు నీటి తడులు లేవు.. ఇదీ జిల్లాలో దయనీయ పరిస్థితి.
అల్పపీడనం ఏర్పడినా వేసవి తీవ్రతే..
ఎక్కడ చూసినా ఎల్‌నినో ప్రభావం
పంటలకు అందని నీటి తడులు
జూన్‌లో 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు
జూలైలో సాధారణ వర్షాలే కరువు
సార్వాకు ఆరంభంలోనే కష్టాలు
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
బంగాళాఖాతంతో తీవ్ర అల్పపీడనం ఏర్పడినా జిల్లాలో ఎక్కడా చినుకు రాలలేదు.. పంట చేలకు నీటి తడులు లేవు.. ఇదీ జిల్లాలో దయనీయ పరిస్థితి. ఎల్‌నినో ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తో మబ్బుల వాతావరణం ఏర్పడినా జిల్లాలో స్వల్పంగానే వర్షాలు కురుస్తుండటంతో మెట్ట ప్రాంతాల్లో పంట చేలకు నీటి తడులు సక్రమంగా అందని పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు కనిపించలేదని రైతులు చెబుతున్నారు.
వేసవి ఎండలు జూలై నెలలోనూ కొనసాగుతున్నాయి. ఆశించినంతగా వర్షపాతం ఎక్కడా లేదు. వాతావరణ శాఖ రాబోయే 15 రోజుల్లో వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉందని చెబుతున్నా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఏ మేరకు కురుస్తారన్నది సందేహాస్పదమే. 1901 తర్వాత దేశ వ్యాప్తంగా జూన్‌లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైందని, ఈకారణంగానే ఈ నెలలో ఉక్కబోత విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోర్ల సాగులోను రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
జూన్‌లో మైనస్ వర్షపాతం..
ఇక ఈ ఏడాది జూన్‌లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ఈ ఏడాది సార్వా లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.ఈనెలలో జిల్లాలోని 12 మండలాల్లో మైనస్ వర్షపాతం నమోదు అయింది. జూలైలోను ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోదవుతు న్నాయి. గత 15 రోజుల్లో వర్షం పడిన రోజులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సార్వా సాగులో కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగు జరుగుతోంది. సార్వా సాగులో ఇతర పంటల సాగు ప్రారంభమైంది. వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తుండటంతో వరి నారుమళ్లు వేసిన పంట పొలాలకు నీరు సక్రమంగా అందక ఎండిపోతున్నాయి.
మంచినీటికీ కష్టాలే ..
ఎల్‌నినో ప్రభావం మంచినీటి సరఫరా పైనా పడింది. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పఽథకాల ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతోంది. కొద్ది రోజులుగా వర్షాలు అంతంత మాత్రంగా కురియడం, భానుడు ఉగ్రరూపం దాలుస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ కారణంగా రక్షిత మంచినీటి పథకాలకు చెందిన బోర్లులో నీరు దిగువకు వెళ్ళి పోవటంతో రెండు గంటలలో నిండే ట్యాంకు 4నుంచి 5గంటలకు నిండుతోంది. దీంతో మంచినీటి పైప్‌లైన్ల ద్వారా నీరు సక్రమంగా సరఫరా కాని పరిస్థితి గ్రామాల్లో ఏర్పడింది. మంచినీటి పథకాలకు సంబందించిన బోర్లు పలు ప్రాంతాల్లో మొరాయిస్తున్నాయి. ఈ కారణంగా గ్రామాల్లో మంచినీటి సరఫరాలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే తాగునీటి, సాగునీటి కష్టాలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంజన్లతో మురుగు నీరు తోడకం..
ముదినేపల్లి, జూలై 19(ఆంధ్రజ్యోతి): కష్టాలు పెరిగి పోయాయి. పంట క్వాలకు అరకొరగా వస్తున్న నీటిని మురు గు కాల్వల్లో నీటిని ఆయిల్ ఇంజన్లతో తోడుకుని ఎండిపోతు న్న వెదజల్లిన వరిపైరును, వరి నారుమళ్లను కాపాడుకునేం దుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, కైకలూరు మండలాల్లో సుమారు 36 వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగు జరుగుతుండగా 70 శాతం ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. పెదపాల పర్రు, చినపాలపర్రు, కోడూరు, ముదినేపల్లి, అత్తివాని చెరు వు, ములకలపల్లి, పెదగొన్నూరు, ఉప్పరగూడెం తదితర గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల ఆయకట్టులో దుక్కు లు చేసుకునేందుకు సాగునీరందడం లేదు. కొన్ని గ్రామాల్లో తొలుత దుక్కులు పూర్తయిన పొలాలకు నీరు లేక ఎండి పోయాయి. ఎండిపోయిన వెదజల్లిన వరి పైరు ఆయకట్టులో తిరిగి వెదజల్లాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు తీవ్ర నష్టం
వర్షాలు లేక కాల్వల ద్వారా నీరందక సార్వా వరిసాగు తీవ్రంగా దెబ్బతింది. నేను రెండు ఎకరాల్లో వెదజల్లిన వరిపైరు నీరందక ఎండిపోయింది. రూ.20 వేల పెట్టుబడి నష్టం వాటిల్లింది. వర్షాలు కురవకపోతే సార్వా సాగు ఈ ఏడాది కష్టమే. మళ్లీ విత్తనాల కొనుగోలుకు పెట్టబడి పెట్టాల్సిందే.
– వారా ఇజ్రాయేలు, రైతు, అత్తివానిచెరువు, ముదినేపల్లి మండలం