మందుల్లేవ్..!
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:08 AM
పశువైద్యశాలల్లో మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ పాడిపశు రైతులు, పెంపుడు జంతువుల యజమానులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న మూగ జీవాలను పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తే జేబులు ఖాళీ అవు తున్నాయని వాపోతున్నారు.
పశువుల ఆసుపత్రుల్లో.. మందుల కృత్రిమ కొరత..!?
ప్రైవేటు మందుల షాపుల్లో కొనమంటూ చీటీలు
వేలాది రూపాయల ఖర్చు..
పశు రైతులు.. పెంపుడు జంతువుల యజమానుల గగ్గోలు
కమిషన్ల కోసమే బయటకు రాస్తున్నారంటూ ఆరోపణలు
ఏలూరు టూటౌన్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పశువైద్యశాలల్లో మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ పాడిపశు రైతులు, పెంపుడు జంతువుల యజమానులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న మూగ జీవాలను పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తే జేబులు ఖాళీ అవు తున్నాయని వాపోతున్నారు. చిన్నపాటి అనారోగ్యాల బారిన పడ్డ పశువులు, పెంపుడు కుక్కలకు వైద్యం పేరిట వేలాది రూపాయల మందులను ఆసుపత్రి పక్కనే ఉన్న ప్రైవేటు మందుల షాపుల్లో డాక్టర్లు కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇవ్వరా.. అని అడిగితే ‘మీకు కావాల్సిన మందులు అయిపోయాయని, బయట కొనుక్కొండి’ అని వైద్యులు సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు ప్రాంతీయ పశువుల ఆసపత్రికి రోజుకు వంద నుంచి 150 పెంపుడు కుక్కలు, ఆవులు, గేదెలు, 10–20, మేకలు, గొర్రెలు 20–30 వరకు చికిత్స నిమిత్తం తీసుకొస్తుంటారు. జిల్లాలో అత్యధికంగా చికిత్సకు వచ్చే పశువుల ఆసుపత్రి ఇదే. ఇక్కడ మందులు ఉచితంగా ఇవ్వరనే విమర్శలున్నాయి. ప్రతి పెంపుడు కుక్కకు, పశువులకు ఒక్కొదానికి రూ.వెయ్యి నుంచి 2, 3 వేల వరకు మందులు, ఇంజక్షన్లు బయటకు రాస్తున్నారని, రక్త పరీక్షలు చేయడానికి జిల్లా ఆసుపత్రిలో లేబరేటరీ ఉన్నా బయట ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకు రావాలని చెబుతున్నారని పశు రైతులు వాపోతున్నారు. దీంతో రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి రూ.ఐదు వేలక పైగా చెల్లించి రక్తపరీక్షలు చేయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. జిల్లాలో ప్రతి పశువుల ఆసుపత్రిలోను ఇదే విధంగా ప్రైవేటు లేబరేటరీలు, మందుల షాపులకు రాసి సిబ్బంది కమిషన్లు పొందుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి జిల్లాలోని పశువుల ఆసుపత్రులకు కోటి 50 లక్షల విలువైన మందులు అందజేస్తుంది. వీటిని ఆయా ఆసుపత్రులకు అవసరం ఉన్న మందులను జిల్లా కేంద్రం నుంచి సరఫరా చేస్తారు. కాని ఏ ఆసుపత్రిలోనూ ఉచితంగా ప్రభుత్వం ఇచ్చిన మందులు ఇవ్వడం లేదని, ప్రభుత్వం నుంచి వచ్చిన మందులు ఏమైపోతున్నాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో వెటర్నరీ ఆసుపత్రులు 11, వెటర్నరీ డిస్పెన్సరీస్ 66, రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు 57 ఉన్నాయి. జిల్లాలో అఽధికారిక గణాంకాల ప్రకారం ఆవులు లక్షా 21వేల 574, గేదెలు 4లక్షల 80వేలు, గొర్రెలు 5,71,231, మేకలు 2,34,793 ఉన్నాయి. జిల్లాలో పశువుల ఆసుపత్రుల్లో జరుగుతున్న మందుల అవినీతిపై విచారణ చేసి మందులు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉచితంగా మందులు ఇవ్వాలి
వారం రోజుల నుంచి మా పెంపుడు కుక్కకు నలతగా ఉంది. నాలుగు రోజుల నుంచి ఆసుపత్రికి తీసుకొస్తున్నాం. ఏవో ఇంజన్లు రాశారు. బయట మెడికల్ షాపులో కొంటే రూ.600 అయ్యాయి. మళ్లీ రక్త పరీక్షలు చేయాలని బయట లేబరేటరీకి రాశారు. అక్కడ రూ.500 చెల్లించాం. రిపోర్టు చూసి బయటకు మందులు రాయడంతో వాటిని కొనేందుకు వేలాది రూపాయలు ఖర్చయ్యాయి. మా లాంటి సామాన్యులకు ఇది భరించలేని వ్యయం. ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలి.
– సీహెచ్.లక్ష్మణరావు, శ్రీరామవరం
మందుల కొరత లేదు
పశువుల ఆసుపత్రిలో మందుల కొరత లేదు. పెంపుడు కుక్కలకు, పశువులకు అవసరమైన మందులు ఇస్తున్నాం. ఏమైనా మందులు లేకపోతేనే బయట షాపులకు రాస్తున్నాం. జిల్లా కేంద్ర కార్యాలయంలో అత్యాధునిక లేబరేటరీ ఉంది. రక్త పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నాం. బయట లేబరేటరీలకు రక్త పరీక్షలకు సిపార్సు చేయడం లేదు.
– డాక్టర్ సుబ్రహ్మణ్యం,అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ