అప్సడాపై ఆసక్తి లేదా..?
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:45 AM
ఆక్వా సాగులో రాయితీలు రావాలన్నా, మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అప్సడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
రకరకాల కారణాలతో ముందుకు రాని రైతులు
ఏలూరులో జిల్లాలో కైకలూరులోనే అత్యధికం
నమోదు చేయకుంటే ఎకరానికి వెయ్యి జరిమానా
ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేసిన అధికారులు
కైకలూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగులో రాయితీలు రావాలన్నా, మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అప్సడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్సడా అనుమతులు పొందితేనే ఆక్వా చెరువులకు విద్యుత్, ఇతర ప్రభుత్వ రాయితీలు వస్తాయని అధికారులు, ప్రజాప్రతినిధులు ఏడు నెలలుగా చెబుతున్నప్పటికీ పలు కారణాలతో రైతులు అనుమతులు పొందలేకపోతున్నారు. దీనికి ప్రధానం గా రైతుల చెరువులకు ఆధార్ లింకు కాకపోవడం, వెబ్ ల్యాండ్ చేయకపో వడం, లీజుకు ఇవ్వడం, పట్టాదారు పాసుబుక్ ఆధార్‌కు అనుసంధానం కాకపోవడం, ఒక చెరువులో నలుగురై దుగురు రైతులు వుంటే ఇద్దరు లేదా ముగ్గురు రైతులు మాత్రమే ఆధార్ అనుసంధానం అయినప్పటికీ మరో రైతుకు కాకపోవడం వంటి కారణాలతో అనుమతులు మంజూరు కావడం లేదు. ఇలాంటి సమస్యలతో కొంత మంది రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఏలూరు జిల్లాలో 1.49 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగు తోంది. మిగిలినవి డీ ఫారమ్ పట్టాలు. ఇప్పటి వరకు 80 వేల ఎకరాలకు అనుమతులు పొందగా, మరో 54,945 ఎకరాలకు మంజూరు కావాలి. ఇందులో ఒక్క కలిదిండి మండలంలో ఎనిమిది వేల ఎకరాల పైచిలుకు డీ ఫారమ్ పట్టాలు ఉండడం, నాన్ ఆక్వా జోన్‌లో చూపించడంతోపాటు ఈ చెరువులన్నీ 22ఏలో ఉండడం వల్ల అనుమతుల మంజూరుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 22 ఏలో నుంచి తొలగించేందుకు ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఉన్నతాధికారులతో సమీక్షించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుం టున్నారు. కైకలూరు నియోజకవర్గంలో 84 వేల ఎకరాలకు గాను 44 వేల ఎకరాలకు అనుమతులు తీసుకోవాలి. ఇప్పటికే గ్రామాల వారీగా మత్స్యశాఖ అధికారులు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సమాచారాన్ని అందించారు. అయితే రైతులు దరఖాస్తులకు ముందుకు రాలేదు. అప్సడా అనుమతులు వుంటేనే విద్యుత్ యూనిట్ రూ.1.50కే సబ్సిడీపై పొంద వచ్చు. లేని రైతులకు యూనిట్‌కు రూ.9 నుండి రూ.10లు చార్జీ పడుతుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కావాలన్నా అనుమతి తప్పనిసరి. ఇది లేని రైతులు డీజిల్ ఇంజన్లపై, జనరేటర్లపై ఆధారపడి సాగు చేయడం వల్ల ఎకరానికి రూ.30 నుంచి రూ.50 వేల వరకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సిందే.
ఎకరానికి వెయ్యి జరిమానా
జిల్లాలో 54,945 ఎకరాల్లోని ఆక్వా రైతులు అప్సడా అనుమతులు తీసుకోవాలి. ఇందులో ఒక్క కైకలూరు నియోజకవర్గంలో 44 వేల ఎకరాలు వుంది. ఇప్పటికే గ్రామాల్లో మత్స్యశాఖ అధికారుల ద్వారా రైతులకు నోటీసులు జారీ చేశాం. అప్సడా అనుమతికి ఎకరానికి రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. అదే అనుమతులు లేకుంటే ఏపీ అప్సడా యాక్ట్ ప్రకారం ఎకరానికి రూ.వెయ్యి జరిమానా విధిస్తాం.
– బి.రాజ్‌కుమార్, ఏలూరు జిల్లా మత్స్యశాఖాధికారి