Share News

నో.. బీపీ ఎస్‌

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:02 AM

పట్టణాల్లో భవన క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్మాణదారులు చెల్లించాల్సిన ఫీజులను ఖరారు చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది.

నో.. బీపీ ఎస్‌

నేడు క్రమబద్ధీకరణకు ఫీజులా..?

ఇప్పటికే వసూళ్లకు పాల్పడుతున్న మునిసిపల్‌ అధికారులు

మళ్లీ దరఖాస్తు చేయాలంటే భారమని యజమానుల వెనుకంజ

అందుకే నత్తనడకన దరఖాస్తులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పట్టణాల్లో భవన క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్మాణదారులు చెల్లించాల్సిన ఫీజులను ఖరారు చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గడువు అధికంగా ఉండడం వల్లే దరఖాస్తులు రావడం లేదంటూ అధికారులు సమర్థించుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. నిర్మాణాల్లో అతిక్రమణలకు పాల్పడిన వారంతా గత ప్రభుత్వ హయాం నుంచే ముడుపులు చెల్లించుకున్నారు. అది ఇప్పటికీ ఆగలేదు. నేతల పేరు చెబుతూ కొందరు అధికారులు అడ్డంగా వసూలు చేస్తున్నారు. మళ్లీ బీపీఎస్‌కు లక్షలు వెచ్చించాల్సి వస్తోందంటూ మదన పడుతున్నారు. ఫలితంగా దరఖాస్తులకు వెనుకంజ వేస్తున్నారు.

పాలకొల్లులోనే కాస్త ఆశలు

పాలకొల్లు పురపాలక సంఘంలోనే కాస్త ఆశాజనకంగా ఉంది. మొత్తం 182 భవనాలను గుర్తించగా ఇప్పటి వరకు 102 దరఖాస్తులు అందాయి. మిగిలినవి గడువులోగా వచ్చేస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల్లో ఆ పరిస్థితి లేదు. భీమవరంలో ఇప్పటి వరకు 300 మంది నిర్మాణదారులకు నోటీసులు జారీచేశారు. గతంలో ముడుపులు చెల్లించిన వారు అందులో ఉన్నారు. వారంతా మళ్లీ ఇప్పుడు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు. వాణిజ్య కేంద్రమైన మున్సిపాలిటీలోనూ దరఖాస్తు చేయడానికి వెనుకంజ వేయడానికి వసూళ్ల దందానే కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీపీఎస్‌కు స్పందన ఎక్కువగా ఉంటుందని ఆశించారు. ఇప్పటికే మున్సిపల్‌ పరిపాలన శాఖ పలుమార్లు సమీక్ష నిర్వహించింది. కాని, దరఖాస్తులు రాకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల వ్యవహారశైలి కారణంగా దరఖాస్తులు చేయడానికి సాహసించడం లేదు.

వ్యక్తిగత నిర్మాణాల జోరు

కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత నిర్మాణాలు పెరిగాయి. గత ప్రభుత్వంలో నిర్మాణాలు వాయిదా వేసుకున్న వారంతా ఇప్పుడు ప్రారంభించారు. నిర్మాణాలు పూర్తిచేశారు. అటువంటి వారు బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనిపైనే రాష్ట్రస్థాయిలో మున్సిపల్‌ పరిపాలన శాఖ అధికారులు కలవరపడుతు న్నారు. ఇప్పటి వరకు భీమవరంలో 158, పాలకొల్లులో 103, తాడేపల్లిగూడెంలో 90, తణుకులో 90, ఆకివీడులో 11 దరఖాస్తులు అందాయి. మార్చి 13తో గడువు ముగుస్తుంది. అప్పటిలోగా దరఖాస్తులు పెరుగుతాయన్న ధీమాతో అధికారులున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 01:02 AM