4న ఏపీ నిట్‌లో స్నాతకోత్సవ వేడుక
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:42 AM
తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ప్రాంగణం రవీంద్ర కళాభారతి ఆడిటోరియం ఈనెల నాలు గో తేదీన ఎనిమిదో స్నాతకోత్సవ వేడుకలకు ముస్తాబైంది.
విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్న అధికారులు
కోర్సులలో ప్రతిభ గల విద్యార్థులకు బంగారు పతకాలు
తాడేపల్లిగూడెం అర్బన్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ప్రాంగణం రవీంద్ర కళాభారతి ఆడిటోరియం ఈనెల నాలు గో తేదీన ఎనిమిదో స్నాతకోత్సవ వేడుకలకు ముస్తాబైంది. అవస రమైన అన్ని ఏర్పాట్లను డీన్ అకడమిక్ డాక్టర్ ఎన్.జయరాం పర్య వేక్షణలో అధికారులు సిద్ధం చేశారు. ఈ విద్యాసంస్థను 2015లో ఏర్పాటు చేయగా ఇప్పటివరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ బీటెక్ కోర్సును ఎనిమిది బ్యాచ్‌ల విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 2022–26 బ్యాచ్‌కు చెందిన 664 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు. వీరిలో బాలురు 492 మంది ఉండగా బాలికలు 152 మంది ఉన్నారు. వీరితోపాటు 53 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అందించనున్నారు. సంస్థలో మొత్తం 8 కోర్సులు నిర్వహిస్తుండంగా ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధిం చిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం 8 మంది విద్యార్థులకు, బ్యాచ్‌ల వారీగా మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థికి సంస్థ తరఫున బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు.
ముఖ్య అతిథులు వీరే..
ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐ లాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు, గౌరవ అతిథిగా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ డాక్టర్ కలిదిండి సత్యనారాయణ హాజరు కానున్నారు. వేడుకలో రిజి స్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి తదితరులు సహకారం అంద జేయనున్నారు
బంగారు పతకాలు అందుకునేది వీరే..
కోర్సుల వారీగా అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులు బంగారు పతకాలను అందుకోనున్నారు. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్ నుంచి ఊర్వశి పాల్ (8.78 పాయింట్లు), కెమికల్ ఇంజనీరింగ్ నుంచి ఖండాల చంద్రశేఖర్ (9.20 పాయింట్లు), సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఉజ్వల పాండే (9.65పాయింట్లు), కంప్యూటర్ సైన్ అండ్ ఇంజనీరింగ్ నుంచి విపుల్‌యాదవ్(9.53 పాయింట్లు), ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూ నికేషన్ ఇంజనీరింగ్ నుంచి కొత్తూరు సమయంతుల అవ్యక్త(9.73 పాయింట్లు), మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కొత్తూరు సుభాష్(9.41 పాయింట్లు), మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ నుంచి తంగుడి తేజామణిదీప్ (9.38 పాయింట్లు) సాధించారు. వీరందరూ బంగారు పతకాలను అందుకోనున్నారు. బ్యాచ్‌లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థి సమయంతుల అవ్యక్త సంస్థ తరఫున, కోర్సుల వారీగా కూడా రెండు బంగారు పతకాలను సొంతం చేసుకోనున్నారు.