అంతరిక్షం వైపు అడుగులేద్దాం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:57 PM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట మన రాష్ట్రంలో ఉండడం ఎంతో గర్వకారణం. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాలలో మనరాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోంది.
భావి శాస్త్రవేత్తలకు ఇస్రో ప్రోత్సాహం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సువర్ణవకాశం
ప్రతిభావంతులైన తొమ్మిదో తరగతి విద్యార్థులు దరఖాస్తుకు ఆహ్వానం
జంగారెడ్డిగూడెం రూరల్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట మన రాష్ట్రంలో ఉండడం ఎంతో గర్వకారణం. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాలలో మనరాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్రో యువికా–2026 కార్యక్రమం రాష్ట్ర విద్యార్థులకు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి బలమైన పునాదికి అడుగులు వేసే దిశగా పయనిస్తుంది. రాష్ట్ర విద్యార్థులకు ఇస్రో యువికా–2026 ఒక సువర్ణావకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఆర్‌వో) ప్రతిష్ఠాత్మక యువికా–2026 (యంగ్ సైన్స్ ప్రోగ్రామ్– యువ విజ్ఞాని కార్యక్రమం) కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 9వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రంలో ప్రత్యక్ష అనుభవం పొందే అరుదైన అవకాశం ఇది. ఇస్రో పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుంది. ఇస్రో సాధించిన విజయాలు, జరుగుతున్న పరిశోధనలు పాఠాలుగా వింటుంటాము, పుస్తకాలు, దినపత్రికల్లో చదువుతుంటాం. కానీ ఇస్రోతో ప్రత్యక్ష అనుభవం పొందేందుకు ఒక్క అవకాశం వస్తే ఎవరైనా గంతేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలోని 9వ తరగతి చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులకు ఆ అరుదైన అవకాశం దక్కనుంది.
మన రాష్ట్రానికి అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీహరికోటలో ఉన్న (సతీష్ దావన్ స్పేస్ సెంటర్) భారతదేశపు ప్రధాన రాకెట్ ప్రయోగ కేంద్రం. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ వంటి కీలక ప్రయోగాలు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కేంద్రం రాష్ట్రంలోనే ఉండడం వల్ల విద్యార్థులకు అంతరిక్ష రంగంపై సహజమైన ఆసక్తి ఉంటుంది. యువికా కార్యక్రమం ద్వారా ఆ ఆసక్తిని శాస్త్రీయ దిశగా మలిచే అవకాశం లభిస్తుంది.
అర్హతలు ..
2026 జనవరి ఒకటో తేదీ నాటికి గుర్తింపు పొందిన పాఠశా లలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఫిబ్రవరి 20వ తేదీన యువికా నోటిఫికేషన్ విడుదల కాగా ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 2026 మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో ఎంపిక జరగ్గా మే 11 నుంచి 22వ తేదీల్లో శిక్షణ ఉంటుంది.
ఎంపిక విధానం ఇలా..
ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 8వ తరగతి మార్కులకు 50 శాతం వెయిటేజ్, ఆన్‌లైన్ క్విజ్–10శాతం, సైన్స్ ప్రదర్శనలు, ఒలింపియాడ్లు, ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్, గైడ్స్ వంటి కార్యకలాపాలకు అదనపు మార్కులు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి సముచిత ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. అంటే మన రాష్ట్రానికి ప్రత్యేక కోటా ఉంటుంది.
శిక్షణ–సౌకర్యాలు..
ఎంపికైన విద్యార్థులు ఇస్రో ప్రధాన కేంద్రాల్లో రెండు వారాల రెసిడెన్షియల్ శిక్షణ పొందుతారు. రాకెట్ టెక్నాలజీ, ఉపగ్రహ వ్యవస్థలపై తరగతులు, ల్యాబ్ డెమోన్స్‌స్టేషన్‌లు, స్పేస్ అప్లికేషన్లపై ప్రాక్టికల్ సెషన్‌లు, ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష పరస్పర చర్య, శ్రీహరికోటలోని ఎస్‌డీఎస్‌సీ–ఎస్‌హెచ్‌ఎఆర్ కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది.
అంతా ఉచితమే..
యువికా–2026 కార్యక్రమం పూర్తిగా ఉచితం. వసతి, భోజనం, శిక్షణ సామగ్రి ఇస్రో భరిస్తోంది. ఏసీ రైలు చార్జి, బస్సు ప్రయాణ ఖర్చులు, తిరిగి చార్జీల ఖర్చుల చెల్లింపు ఉంటుంది.
ఇస్రో యువికా ముఖ్య ఉద్దేశ్యం
ఇస్రో యువికా కార్యక్రమం ద్వారా చిన్న వయసులోనే విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహ సాంకేతికత, రాకెట్ వ్యవస్థలపై ప్రాథమిక అవగాహన, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆలోచన విధానం, ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష పరస్పర చర్యల్లాంటివి అందించబడతాయి. అంతరిక్ష రంగాల్లో రాణించడం, సైన్స్ వైపు యువతను ఆలోచింపచేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.