ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు.. జీతాలెప్పుడు?
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:51 AM
అత్యవసర సేవలనందించే ప్రభుత్వ శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు ఈనెల 12 రోజులు పూర్తయినప్పటికీ డిసెంబరు జీత భత్యాలు కోసం ఎదురు చూస్తున్నారు.
స్టాఫ్ నర్సులకు సాధారణ సెలవుల తగ్గింపుపై వ్యతిరేకత
ఏలూరు అర్బన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అత్యవసర సేవలనందించే ప్రభుత్వ శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు ఈనెల 12 రోజులు పూర్తయినప్పటికీ డిసెంబరు జీత భత్యాలు కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు కొద్దిరోజుల క్రితం విధుల నిర్వహణ, పనిగంటలను, వివిధ విభాగాలను సాకుగా చూపుతూ సాధారణ సెలవులను కుదించడం కొత్త సమస్యలకు ఎన్‌హెచ్‌ఎం కేంద్రమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎంలో 22 వేల మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖ అనుబంధ విభా గాలైన 186 కేడర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 10 వేల మంది ఎంఎల్‌హెచ్‌పీలు, మిగ తా 12 వేల మంది వివిధ కేడర్ల ఉద్యోగులు. గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవల నిమిత్తం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌లో రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఎన్‌హెచ్ ఎం ఉద్యోగులుగా నియమించింది. వీరిలో అర్బన్ హెల్త్ సెంటర్ల (యూహెచ్‌సీ)లో పని చేస్తున్న స్టాఫ్ నర్సుల సాధారణ సెలవులను తగ్గిస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఏడాదికి 35 రోజుల సాధారణ సెలవులు మిగతా ఉద్యోగుల మాదిరిగానే స్టాఫ్ నర్సులకుండగా వీటిని 15 రోజులకు కుదించారు. మొత్తం 556 యూహెచ్‌సీ లుండగా, ఒక్కో పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఇద్దరేసి చొప్పున స్టాఫ్ నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. యూహెచ్‌సీలో మిగతా కేడర్ల ఉద్యోగుల మాదిరిగానే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీ షియన్లు, ఫార్మసిస్టులు, ఎల్‌జీఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆదివారాలు, పండుగ రోజుల్లో సెలవులు తీసుకునే వెసులు బాటు కల్పించి స్టాఫ్ నర్సులకు మాత్రమే సాధా రణ సెలవులను 35 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 62 యూహెచ్‌సీలున్నాయి.
మూడు నెలలుగా జీతాలు ఆలస్యం
ఎన్‌హెచ్‌ఎంలో జాతీ య క్షయ నియంత్రణ విభాగం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమం (ఆర్బీఎస్కే), మానసిక ఆరోగ్యవిద్య విభాగాల ఉద్యోగులకు డిసెంబరు జీతభత్యాలు ఇంత వరకు చెల్లించలేదు. మూడునెలలుగా సకాలంలో జీతాలు అందడం లేదు. ఉన్నతా ధికారులను సంప్రదిస్తే బిల్లును ఆమోదించా మని, ట్రెజరీలోనే పెండింగ్ ఉన్నాయంటున్నా రు. యూహెచ్‌సీల స్టాఫ్ నర్సులకు నైట్ డ్యూటీలు లేనందునే సాధారణ సెలవులను ఏడాదికి 35 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించామని అధికారులు చెప్పడం సమంజసం కాదు. సమస్యలను ఉన్నతాధికా రులకు నివేదించడానికి టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటుచేయాలి.
– జి.దయామణి, రాష్ట్ర చైర్మన్, ఏపీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ