జోష్ తగ్గింది!
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:12 AM
కాలచక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. ఏటా తెల్లవారుజాము వరకు రోడ్లపై కన్పించే హడావుడి ఈ సారి మచ్చుకైనా కానరాలేదు.
రోడ్లపై కానరాని యువత
అల్లరి మూకలపై పోలీసుల కన్ను
ఎక్కడికక్కడ సైలెంట్‌గా వేడుకలు
కాలచక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. ఏటా తెల్లవారుజాము వరకు రోడ్లపై కన్పించే హడావుడి ఈ సారి మచ్చుకైనా కానరాలేదు. పోలీసు హెచ్చరికల నేపథ్యంలో యువత ఎక్కడిక్కడ అంతా సైలెంట్‌గా వేడుకలు జరుపుకున్నారు. దీంతో నూతన సంవత్సర వేడుకల్లో కాస్తా జోష్ తగ్గిందనే చెప్పవచ్చు.
ఏలూరు రూరల్/ఏలూరు క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచే విందులు, సంబరాలు ప్రారంభమ య్యాయి. మద్యం, మాంసం, కేక్‌లు, కూల్ కేక్‌లు, రంగవల్లులు, కూల్‌డ్రింక్స్, రకరకాల రంగులు విక్రయాలు సాగాయి. ఆయా కూడళ్ల దగ్గర స్వీట్ హౌస్, ఇతర దుకాణాల వద్ద కేక్‌లు విక్రయించారు. అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలికారు. అయితే ఎక్కడా రోడ్లపై యువత సందడి అంతగా కానరాలేదు. గురువారం ఉదయం ఆలయాలను దర్శించు కున్నారు. సామాన్యుల నుంచి ప్రము ఖుల వరకు పరస్పరం న్యూ ఇయర్ శుభా కాంక్షలు తెలుపుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా మటన్ షాపులు, చికెన్ దుకాణాల్లో భారీగా అమ్మకాలు జరిగాయి.
అంతా గప్‌చిప్..
మరోవైపు జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా ఎస్పీ కేపీఎస్ కిశోర్ తీసుకున్న ప్రత్యేక చర్యలు సత్ఫలితా లిచ్చాయి. ముందస్తుగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు తమకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియా, పత్రికల ద్వారా నూతన సంవత్సర వేడుకల నిబంధనలను తెలిపి యువతను అప్రమత్తం చేశారు. గతంలో నూతన సంవత్సర వేడుకలంటే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు రోడ్లపై మోటారు సైకిళ్లకు సైలెన్సర్లు తీసి అరుపులు, కేకలతో, కొన్ని కూడళ్లల్లో టపాసులు పేల్చుతూ హడావుడి చేసేవారు. అయితే ఈ ఏడాది అల్లరి చిల్లరగా తిరిగే యువత తగ్గిపోయారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదు. ఏలూరు నగరంలో ఎన్నడూలేని విధంగా రోడ్లపై యువత కన్పించకపోవడం గమన్హారం. వివిధ దేవాలయాలు, చర్చిలకు వెళ్లే వారు మాత్రమే కనిపించారు. నగరంలో జాతర నేపథ్యంలో కొంతమేర వేడుకలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్లపై జనసంచారం తగ్గింది. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అల్లర్లు లేకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. గతంలో అల్లర్లకు పాల్పడిన వారిని ముందస్తుగా గుర్తించి పోలీసులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఎస్పీ పర్యవేక్షణలో డ్రోన్లతో నిఘా పెంచడంతో ఆకతాయిలు ఇళ్లకే పరిమితమైనట్టు స్పష్టమవుతోంది. జిల్లావ్యాప్తంగా అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.