తెగ తాగేశారు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:14 AM
నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందుబాబులు మునుపెన్నడూ లేని విధంగా తెగతాగేశారు. గతేడాదితో పోల్చుకుంటే రూ.రెండు కోట్ల మేర జిల్లాలో అమ్మకాలు పెరిగాయి.
కొత్త సంవత్సరంలో మద్యం కిక్
జిల్లాలో రూ.10 కోట్ల పైబడి అమ్మకాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందుబాబులు మునుపెన్నడూ లేని విధంగా తెగతాగేశారు. గతేడాదితో పోల్చుకుంటే రూ.రెండు కోట్ల మేర జిల్లాలో అమ్మకాలు పెరిగాయి. కొత్త సంవత్సరం వేళ.. గత నెలాఖరున 30న ఐఎఎంల్ కేసులు 8,124, బీర్ కేసులు 4,291 ఐఎంఎల్ డిపోల నుంచి మద్యం లైసెన్సు పొందిన 155 దుకాణ దారులు, 13 బార్లకు సరుకు తరలించుకున్నారు. దీని విలువ రూ.6కోట్ల88 లక్షలకు పైనే ఉంటుంది. ఇక పాత స్టాకు అప్పటికే రూ.3 కోట్లకు పైబడి ఉన్నట్టు అంచనా. ఇలా రమారమి రూ.10 కోట్ల పైబడి అమ్మకాలు సాగాయి. పర్మిట్ రూమ్‌లకు ఈ ఏడాది ఎక్కువ మొత్తం స్థలాలు అందుబాటులోకి రావడం, స్నాక్స్, ఇతర తినుబండారాలు వండి వార్చారు. దీంతో గప్‌చుప్‌గా మద్యం బాబులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని 31న రాత్రి మద్యం విక్రయాలు, సరఫరాకు సంబంధించిన పనివేళలను ప్రభుత్వం పొడిగించడం అమ్మకాల పెరుగుదలకు కొంత దోహదపడింది. బార్లు, ఇతర లైసెన్సులు(2 బీ– బార్ ,సీ 1–ఇన్ హౌస్, ఈపీఐ ఈవెంట్ పర్మిట్‌లకు, టూరిజం)కు గతనెల 31, జనవరి 1 రాత్రి తెల్లవారుజాము ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హోటళ్లు, బార్ల వద్ద మద్యంబాబులతో సందడి నెలకొంది.