కొత్త జోన్..కొత్త ఆశలు
ABN , Publish Date - May 07 , 2026 | 12:33 AM
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పడటంతో జిల్లాలోని రైల్వేస్టేషన్లు ఈ కొత్త జోన్ పరిధిలోకి వచ్చేశాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేవి. రాష్ట్ర విభజన హామీలో భాగంగా ఏర్పడిన ఈ కొత్తజోన్ జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజె క్టులను పరుగులు పెట్ట్టిస్తుందన్న ఆశ సర్వత్రా నెలకొంది.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్
పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం
కొత్త రైళ్లకు మోక్షం
ఉపాధి అవకాశాలకు ఛాన్స్
నరసాపురం, మే 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పడటంతో జిల్లాలోని రైల్వేస్టేషన్లు ఈ కొత్త జోన్ పరిధిలోకి వచ్చేశాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేవి. రాష్ట్ర విభజన హామీలో భాగంగా ఏర్పడిన ఈ కొత్తజోన్ జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజె క్టులను పరుగులు పెట్ట్టిస్తుందన్న ఆశ సర్వత్రా నెలకొంది. ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు కొత్త రైళ్లు పట్టాలెక్కేందుకు లైన్‌క్లియర్ అయింది. వీటితో పాటు పరిపాలనా సౌలభ్యం కూడా మరింత సులభతరం అవుతుంది.
ఆరు రైల్వే జోన్‌లతో దక్షిణ మధ్య రైల్వే అతి పెద్ద జోన్‌గా ఉండేది. పరిధి కూడా ఎక్కువుగా విస్తరించి ఉండటంతో పరిపాలనలో అనేక ఇబ్బందులు ఉండేవి. ఈ జోన్ పరిధిలో జిల్లాలోని రైల్వేస్టేషన్లు విజయవాడ డివిజన్ కేంద్రంగా సాగేవి. అత్యధిక ఆదాయం విజయవాడ డివిజన్ ఆర్జించినప్పటికీ కొత్త రైళ్ల కేటాయింపు పెండింగ్ పనులు అంత స్పీడ్‌గా సాగేవి కాదన్న వాదన ఉండేది. కొత్త జోన్ వస్తే గాని నరసాపురం–కోటిపల్లి ప్రతిపాదనలో ఉన్న నరసా పురం–మచిలీపట్నం రైల్వే లైన్ పనులు స్పీడ్ అందుకోవన్న భావన సర్వత్రా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రైల్వేకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు విశాఖపట్నం ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో ఉండేది. ఈ కారణంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త రైళ్లకు అనుమతి వచ్చేది కాదు. విశాఖ–నరసాపురం, నరసాపురం– వారణాశి వంటి పెండింగ్ పడటానికి రైల్వే జోన్ కారణమన్న వాదనలు లేకపోలేదు. నరసాపురం నుంచి నడిచే సింహాద్రిని పునరుద్ధరించాలని జిల్లా నేతలు ఎంత ప్రయత్నించినా ఈస్ట్‌కోస్ట్ జోన్ ఏదో కారణంతో దానికి అనుమతించలేదు. ప్రస్తుతం కొత్త జోన్ ఏర్పడటంతో ఈ రెండు రైళ్లకు మోక్షం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం
జిల్లాలో నరసాపురం– కోటిపల్లి రైల్వే లైన్ పనులు పదేళ్లుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండటం వల్ల ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో ఉండటం నిధులు కేటాయింపులు నామ మాత్రంగా ఉండేది. ప్రస్తుతం కొత్తజోన్ ఏర్పడటం వల్ల ఈసారి బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు పెరుగడంతో పాటు పనులు వేగవంతం అవుతాయని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు నరసాపురం– మచిలీపట్నం రైల్వే లైన్ కూడా కొత్త జోన్‌లో మోక్షం లభిస్తుందని చెబుతున్నారు.
కొత్త రైళ్లకు ఛాన్స్
ఇప్పటి వరకు సికింద్రాబాద్ జోన్‌లో ఉండటం వల్ల ఎక్కువ రైల్వే డివిజన్‌లు ఉండేవి. అందులో విజయవాడ డివిజన్‌కు కేటాయించే రైళ్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటూ వచ్చింది. ప్రస్తుతం కొత్త రైల్వేజోన్‌లో జోన్‌ల సంఖ్య తక్కువుగా ఉండటం వల్ల పెండింగ్ రైళ్లు, కొత్త రైళ్లకు అవకాశాలు మొండుగా ఉన్నాయని చెప్పుతున్నారు. ఈ కారణంగా జిల్లాలోని నరసాపురానికి కొత్తగా రైళ్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న ఉదయం పూట నరసాపురం– సికింద్రాబాద్ రైలుతో పాటు బెంగళూరు రైలు కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
ఇప్పటివరకు సికింద్రాబాద్ జోన్ వల్ల ఉద్యోగ అవకాశాలకు పోటీ ఎక్కువుగా ఉండేది. ప్రస్తుతం కొత్త జోన్ రావడం, దాని పరిధిలో డివిజన్లు తక్కువుగా ఉండటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.