Share News

మచిలీపట్నానికి గ్రీన్‌సిగ్నల్‌ పడేనా ?

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:17 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్‌కాలం నాటి మచిలీపట్నం రైల్వేలైన్‌ కూడా తెర మీదకు తీసుకొచ్చింది. తీర ప్రాంత వెంబడి ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల జిల్లాలో మొగల్తూరు, కృష్ణా జిల్లాలో పెడన వంటి తీర ప్రాంతాల్లో రైలు కూత వినిపించనుంది.

మచిలీపట్నానికి గ్రీన్‌సిగ్నల్‌ పడేనా ?

కొత్త లైన్‌కు క్లియరెన్స్‌ వచ్చేనా?

గత ఏడాది సర్వేతో సరి

ఈ ఏడాది బడ్జెట్‌ నిధులపై కోటి ఆశలు

నేటికి వీడని ఉత్కంఠ

పూర్తయితే తీరానికి మహర్దశ

నరసాపురం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తరువాత తీర ప్రాంతానికి మహర్దశ పట్టింది. బ్రిటిష్‌ కాలంలో ప్రతిపాదించిన 216 జాతీయ రహదారితో పాటు నరసాపురం– కోటిపల్లి రైల్వేలైన్‌కు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 216 పూర్తికాగా కోటిపల్లి 60 శాతం పనులు పూర్తి చేసుకుంది. మచిలీపట్నం రైల్వే లైన్‌ తెరమీదకు తెచ్చారు.. మరి ఈ బడ్జెట్‌లో దీనిపై క్లియరెన్స్‌ వస్తుందా అని తీర ప్రాంత వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్‌కాలం నాటి మచిలీపట్నం రైల్వేలైన్‌ కూడా తెర మీదకు తీసుకొచ్చింది. తీర ప్రాంత వెంబడి ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల జిల్లాలో మొగల్తూరు, కృష్ణా జిల్లాలో పెడన వంటి తీర ప్రాంతాల్లో రైలు కూత వినిపించనుంది. వీటితో పాటు మెయిన్‌లైన్‌ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పడతుంది. 69 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ కొత్తలైన్‌కు గత ఏడాది బడ్జెట్‌లోనే క్లియరెన్స్‌ వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే సర్వేతో సరిపెట్టారు. కనీసం ఈ ఏడాదైనా పనులకు నిధులిస్తారని ఆశతో ఎదురు చూశారు. కానీ బడ్జెట్‌ ప్రవేశపెట్టి పది రోజులు గడిచినా నేటికి ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ఎటువంటి స్పందన లేదు. దీంతో ఈ బడ్జెట్‌లో కూడా ఈ కొత్త రైల్వేలైన్‌కు రెడ్‌ సిగ్నలే అన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

మెయిన్‌ లైన్‌లో తగ్గనున్న ట్రాఫిక్‌

ప్రస్తుతం జిల్లా నుంచి రైల్లో మచిలీపట్నం వెళ్లాలంటే భీమవరం, గుడివాడ మీదుగా ఒకటే మార్గం. అయితే 216 జాతీయ రహదారి పూర్తికావడంతో మచిలీపట్నంకు దగ్గర మార్గం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ, కృష్ణాల మధ్య దూరం తగ్గింది. ఇదే ప్రణాళికతో కోటిపల్లి రైల్వేలైన్‌ పనులు పూర్తిచేసి మచిలీపట్నానికి రైల్వే మార్గం ద్వారా అనుసంధానం చేయాలని రైల్వే నిర్ణయించింది. దానికి అనుగుణంగా గత బడ్జెట్‌లో తొలిసారిగా సర్వేకు పచ్చ జెండా ఊపారు. 69 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ కొత్త రైలు మార్గం వల్ల మెయిన్‌ లైన్‌లో ట్రాఫిక్‌ తగ్గనుంది. కోల్‌కతా, ఒడిశా నుంచి వచ్చే రైళ్లు రాజమండ్రి నుంచి కాకుండా కోటిపల్లి, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల మీదుగా మెయిన్‌లైన్‌లో కలవనున్నాయి. దీనివల్ల విజయవాడ– రాజమండ్రిల మధ్య రైల్వే ట్రాఫిక్‌ తగ్గనుంది. ఇప్పటికే బాపట్ల మచిలీపట్నంల మధ్య రైల్వే లైన్‌కు క్లియరెన్స్‌ లభించింది.

ఎన్నో ప్రయోజనాలు

ఈ కొత్త రైల్వేలైన్‌ వల్ల తీర ప్రాంతంలో రైలు మార్గంతో పాటు ఆక్వా ఎగుమతులు సులభతరం కానున్నాయి. ఒడిశా, విశాఖల నుంచి ఒంగోలు వరకు వెళ్లే దూరం దగ్గనుంది. ఇటు మెయిన్‌లైన్‌లో కూడా ట్రాఫిక్‌ సమస్య తీరుంది. దీని వల్ల కొత్త రైళ్లను పట్టాలెక్కించే అవకాశం ఉంది. నరసాపురం జిల్లాలో పెద్ద జంక్షన్‌గా మారనుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ గతంలో పలు మార్లు ప్రకటనలు చేశారు. దీంతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కోటిపల్లి రైల్వేలైన్‌తో పాటు ఇటు మచిలీపట్నం కూడా పూర్తయితే తీర ప్రాంతానికి మహర్దశ పడుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో కూడా ఈ ప్రాజెక్టుపై కేంద్రం నిధులు కేటాయింపుపై సస్పెన్స్‌ పెట్టడంతో జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Feb 11 , 2026 | 12:17 AM