Share News

కొత్త పింఛన్లు

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:13 AM

ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసాలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంది. మార్గదర్శ కాలు విడుదల చేసింది. కొంతకాలంగా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వైసీపీ హయాంలో కొత్త పింఛన్ల మంజూరును నిలిపి వేశారు. ఫలితంగా జిల్లాలో వేలాదిమంది ఎదురుచూస్తున్నారు.

కొత్త పింఛన్లు

అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చు

మార్గదర్శకాలు విడుదల

ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలగ్రీవె న్స్‌లో దరఖాస్తులు

అధికారుల వద్దకు పంపిన నేతలు

ఆన్‌లైన్‌ చేయడమే తరువాయి

వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది పరిశీలన

ఈకేవైసీ తప్పనిసరి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసాలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంది. మార్గదర్శ కాలు విడుదల చేసింది. కొంతకాలంగా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వైసీపీ హయాంలో కొత్త పింఛన్ల మంజూరును నిలిపి వేశారు. ఫలితంగా జిల్లాలో వేలాదిమంది ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లపై ఆశలు చిగురించాయి. ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్‌కూడా పెంచింది. వృద్ధులకు, ఒంటరి మహిళలకు రూ.4వేలు ఇస్తోంది. దివ్యాంగుల కు రూ.6వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10వేలు, మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితులకు రూ. 15వేలు వంతున ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నారు. జిల్లాలో 2.29 లక్షల మందికి ప్రతినెలా ప్రభుత్వం సుమారు రూ.94.50 కోట్లు పింఛన్‌ ఇస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దాదాపు మరో 23వేల మందికి కొత్తగా పెన్షన్‌లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారులు ధరఖాస్తు చేసుకోవాలి.

వీరికే పింఛన్లు..

ప్రభుత్వం కొత్తగా వృద్ధులు, ఒంటరి మహి ళలు, దివ్యాంగులు, వితంతువులు, దివ్యాంగుల తోపాటు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు, సంప్రదాయ చెప్పులు కుట్టేవారు తదితర కేటగిరీల్లో పెన్షన్‌లు పంపిణీ చేయనుంది. ఇప్పటికే అనేక మంది గ్రీవెన్స్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. అవన్నీ సంబంధిత అధికారుల వద్దకు చేరడం తో తాజాగా వాటిని ఆన్‌లైన్‌ చేయనున్నారు. అవసరమైతే వారితో కొత్తగా దరఖాస్తు చేయిం చనున్నారు. గ్రామ, వార్డు సచివాల యాల్లో దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేస్తారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులను పరిశీలించి ఈకేవైసీ పూర్తి చేయనున్నారు. అర్హులందరికీ విడతలవారీగా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుంది.

నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

అర్హులైన వారంతా సోమవారం నుంచి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇదివ రకే గ్రీవెన్స్‌సెల్‌లో విన్నవించుకున్న వారు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖా స్తుదారుల ఫోన్‌ నెంబర్‌తో సహా కూటమి నేతలు నమోదు చేసుకుని అధికారులకు జాబితా పంపారు. వారందిరకీ ఇప్పుడు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 16లోగా ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 21 వ రకు అంటే ఐదురోజుల పాటు దరఖాస్తు దారుల అర్హతను నిర్ధారిస్తారు. అనంతరం సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు తుది నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబరు 24తో అర్హత నిర్ణయం తేలిపోనుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో ప్రభుత్వం కొత్త పెన్షన్‌లకు ఆమోద ముద్ర వేయనుంది. జిల్లాలో ఇప్పటికే వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు, ఇతర కళాకారులు, వృత్తిదారులు కూడా పెన్షన్‌ కోసం ఆశిస్తున్నారు.

మూడేళ్లుగా పింఛన్లు మంజూరు చేయలేదు

భీమవరం రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పరిపాలన తదుపరి నుంచి కొత్త పెన్షన్ల మంజూరు నిలిపివేసింది. దీంతో 2023 ఆగస్టు నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు అందించలేదు. ఆ ప్రభుత్వ సమయం ముగిసే సరికి ఆరు వేల వరకు కొత్త పెన్షన్‌ల దరఖాస్తులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త పెన్షన్‌లు ఇవ్వనందున మూడేళ్ల నుంచి కొత్త పెన్షన్‌లు రాలేదు. అర్హులైనవారు సచివాలయాలకు కొత్త పెన్షన్‌ల దరఖాస్తులు ఎప్పుడు అని తిరుగుతున్నారు.

గడిచిన ఏడాదిలో కొత్త పెన్షన్‌ ఇవ్వడం ప్రారంభిస్తున్నారని రెండు, మూడు పర్యాయాలు ఫేక్‌ సమాచారాలు హల్‌చల్‌ చేశాయి. దీంతో వృద్ధులు, ఒంటరి మహిళలు అప్పట్లో సచివాలయాల బాటపట్టారు. అధికారులు వివరణ ఇవ్వ డంతో నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో అర్హులలో ఆనందం వ్యక్తమవుతోంది.

Updated Date - Sep 07 , 2026 | 12:13 AM