ఆశాజనకంగా ఎంటీయూ 1426 రకం
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:26 AM
సన్నగింజ రకాల అభివృద్ధిలో భాగంగా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గత సంవత్సరం ఎంటీయూ 1426 అనే వరి రకాన్ని రూపకల్పన చేశారని ఏడీ ఆర్ డాక్టర్ టి. శ్రీనివాస్ తెలిపారు.
పెనుమంట్ర, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి):సన్నగింజ రకాల అభివృద్ధిలో భాగంగా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గత సంవత్సరం ఎంటీయూ 1426 అనే వరి రకాన్ని రూపకల్పన చేశారని ఏడీ ఆర్ డాక్టర్ టి. శ్రీనివాస్ తెలిపారు. ఈ రకం ప్రస్తుతం మొదటి సంవత్స రం పూర్తిచేసుకుని రెండవ సంవత్సరం క్షేత్ర స్థాయి పరిశీనలో ఉన్నదన్నారు. పోడూరు మండలం పండితవిల్లూరు గ్రామానికి చెందిన అభ్యుద య రైతు శ్రీ నెక్కంటి అచ్యుతరామయ్య ఈ దాళ్వాలో మార్టేరు పరిశోధన స్థానం నుంచి విత్తనం తీసుకువచ్చి తన ఎకరం విస్తీర్ణంలో ఈ రకాన్ని సాగు చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ జె. దయాళ్ ప్రసాద్‌బాబు, డాక్టర్ ఎంవీ కృష్ణాజీలు ఈ రకాన్ని పరిశీలించి మంచి దిగుబడి రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.
గింజ పొట్టిగా.. సన్నగా.. తినటానికి బాగుంటుంది!
నూతన రకాన్ని సాగు చేసిన రైతు మాట్లాడుతూ ఈ రకం సుమారుగా 125 రోజులు పంట కాలం వస్తుందని, గింజ ఆర్‌ఎన్‌ఆర్ 15048, బీపీటీ 5204 కన్నా పొట్టిగా సన్నగా ఉన్నది కనుక తినడానికి బాగుంటుందని తెలిపారు. సగటున దుబ్బుకు 20 నుంచి 25 వరకు పిలకలు వేసి చక్కటి కంకి కలిగి ఉందని తెలిపారు. మెడవిరుపు తెగుళ్ళను తట్టుకోవడం వల్ల సస్య రక్షణ మందులు పై పెట్టే ఖర్చు ఎకరాకు సుమారు రూ.3 వేలు వరకు ఆదా అయ్యిందన్నారు. మొక్క కొంచెం పొడవుగా ఎదిగినప్పటికి ఎక్కడా పడిపోలేదని తెలిపారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థా నం సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంటీయు 1121, ఎన్‌ఎల్‌ఆర్34449 రకాలను సంకర పరిచి ఎంటీయూ 1426 రకాన్ని రూపొందించామన్నారు. పొట్టి మరియు సన్న గింజ కలిగి ఉండటం వల్ల వినియోగదారులు ఈ రకాన్ని ఇష్టపడటానికి అవకాశం ఉంద న్నారు. వెయ్యి గింజల బరువు కేవలం 13.2 గ్రాములు మాత్రమే అన్నారు.