Share News

స్థానిక ఎన్నికల్లో కొత్త ఒరవడికి శ్రీకారం

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:42 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లాస్థాయి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం.

స్థానిక ఎన్నికల్లో కొత్త ఒరవడికి శ్రీకారం

లాబీయింగ్‌కు చెక్‌

ఓటర్ల ప్రాతిపదికనే కేటాయింపులు

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో వివరాలు

పారదర్శక ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లాస్థాయి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచి, వాటి ప్రాతిపదికనే రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో గతంలో మాదిరిగా రిజర్వేషన్ల మార్పు కోసం ఆశావహులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి లాబీయింగ్‌ చేసే పరిస్థితికి తెరపడనుంది. ఇప్పటికే ప్రభుత్వ సేవలు, ఆర్థిక లావాదేవీలు, సంక్షేమ పథకాలు, వివిధ పరిపాలన కార్యక్రమాల్లో ఆన్‌లైన్‌ విధానానికి ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలోను సాంకేతికతను వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల కేటాయింపునకు అవసరమైన గణాంకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, నిబంధనల ప్రకారం కేటాయింపులు చేయాలని నిర్ణయించనుంది.

గతంలో లాబీయింగ్‌..

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర స్థానాల రిజర్వేషన్లపై ఆశావ హులు తీవ్రంగా దృష్టి సారించేవారు. తమ గ్రామం లేదా వార్డు తమకు అనుకూలమైన రిజర్వేషన్‌ పరిధిలోకి రావాల ని కోరుతూ మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు సంప్రదింపులు జరి పేవారు. కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ల మార్పుపై రాజకీయ ఒత్తిళ్లు, లాబీయింగ్‌ జరిగేదన్న విమర్శలు వినిపించేవి. ఈసారి రిజర్వేషన్ల కేటాయింపును ఆన్‌లైన్‌ విధానంలో, నిర్దిష్ట గణాంకాలు, నిబంధనల ప్రాతిపదికన చేపట్టడం ద్వారా ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రఓటర్ల జాబితా, జనాభా గణాంకా లు, రిజర్వేషన్‌ నిబంధనలు, గత ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుని కేటాయించనున్నారు.

రిజర్వేషన్లు ఇలా..

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కేటాయిం చగా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలులో ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా ప్రాంతాల్లో వారి జనాభా లేదా నిర్దేశిత గణాంకాల నిష్పత్తి ఆధారంగా ఖరారు చేస్తారు. ఒక మండల పరిధిలోని గ్రామాల్లో ఎస్సీ లేదా ఎస్టీ జనాభా శాతాన్ని పరిగణనలోకి తీసుకుని, అధిక నిష్పత్తి వున్న గ్రామాలకు నిబంధనల ప్రకారం సంబంధిత రిజర్వేషన్లు కేటాయిస్తారు. గత స్థానిక ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్ల ను పరిగణనలోకి తీసుకుని ఈసారి కేటాయించనున్నారు. ఒకే గ్రామానికి లేదా స్థానానికి పదే పదే ఒకే రకమైన రిజ ర్వేషన్‌ రాకుండా రొటేషన్‌ విధానాన్ని పరిగణనలోకి తీసు కుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత మిగిలిన స్థానాలను జనరల్‌ కేటగిరీ కింద కేటాయిస్తారు.

ఎన్నికలు జరిగితే అలా.. లేకుంటే ఇలా..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయపరమైన అంశాలు, పరిపాలనా నిర్ణయాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. విలీన గ్రామాలు, కొన్ని మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే తుది రిజర్వేషన్లు తేలతాయి. విలీన గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఒక విధంగా, ఎన్నికలు జరగని పక్షంలో మరో విధంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌, ఎన్నికలు జరిగే ప్రాంతాలపై స్పష్టత వచ్చిన తర్వాతే రిజర్వేషన్ల తుది జాబితా వెలువడే అవకాశం ఉంది.

అంతా పారదర్శకంగానే..

రిజర్వేషన్ల కేటాయింపుతోనే ఎన్నికల ప్రక్రియను పరిమి తం చేయకుండా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గుర్తుల కేటాయింపు తదితర ప్రక్రియల్లోనూ పారదర్శకతకు ప్రాధా న్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాంకేతికతను వినియోగించి ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేయడంతోపాటు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Aug 23 , 2026 | 12:42 AM