Share News

టూరిజానికి కొత్త కళ..

ABN , Publish Date - May 25 , 2026 | 12:24 AM

జిల్లాలో టూరిజానికి కొత్త కళ సంతరించుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా టూరిజం పూర్తిగా నిర్వీర్యమైంది.

టూరిజానికి కొత్త కళ..

పేరుపాలెం బీచ్‌లో మూడు రిసార్ట్స్‌

ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కొత్తవి

ఏర్పాటుకు 116 ఎకరాలు గుర్తింపు

నరసాపురం తీరంలో రెస్టారెంట్‌ ప్రారంభం

చించినాడ వద్ద నిర్మాణంలో బోట్స్‌ క్లబ్‌

పెదమల్లం మాచేనమ్మ కట్ట రోడ్డు అభివృద్ధి

మొగల్తూరు ముత్యాలమ్మ గుడి వద్ద

అతిఽథి గృహం ఏర్పాటు

తణుకు, తాడేపల్లిగూడెం, ఉండిలో

ప్రభుత్వ స్థలాల్లో టూరిజం భవనాలు

ప్రతిపాదనలు పంపిన కలెక్టర్‌

జిల్లాలో టూరిజానికి కొత్త కళ సంతరించుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా టూరిజం పూర్తిగా నిర్వీర్యమైంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. కూటమి అధికారంలోకి రాగానే టూరిజానికి పెద్ద వేసింది. తీరప్రాంతంలోని బీచ్‌లు, గోదావరి పరివాహక ప్రాంతాలు, ప్రసిద్ధ ఆలయాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

నరసాపురం, మే 24 (ఆంధ్రజ్యోతి): మొగల్తూరు మండలం పేరు పాలెం బీచ్‌తో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలపై పర్యాటక శాఖ దృష్టి సారించింది. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఇప్పటికే మొగల్తూరులో ఒక రిసార్ట్స్‌ నిర్మాణం పూర్తి చేసుకుంది. మరో రెండు రిసార్ట్స్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. నరసాపురంలో బాపు ఘాట్‌ వద్ద మూత పడిన టూరిజం రెస్టారెంట్‌ తెరుచుకుంది. తాజాగా యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరి అందాలను వీక్షించేందుకు వీలుగా బోట్స్‌ క్లబ్‌ నిర్మిస్తున్నారు. ఆచంట మండలంలో మాచేనమ్మ కట్ట రోడ్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. ఉండి, తణుకు, తాడేపల్లి గూడెంలో ఖాళీగా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాలను గుర్తించారు. వాటిలో టూరిజం భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఇవి కాకుండా గోదావరి పుష్క రాలకు వచ్చే యాత్రీకుల్ని ఆకర్షించేందుకు వీలుగా టూరిజం శాఖ రూ.19 కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు పంపింది.

టూరిజంపై కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ

టూరిజంపై కలెక్టర్‌ నాగరాణి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రధానంగా పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనుమ తులకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న మూడు రిసార్ట్స్‌కు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే సీబే రిసార్ట్స్‌ పనులు పూర్తయ్యాయి. మరో రెండు రిసార్ట్స్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. వీటి వల్ల వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యం ఏర్పడింది. సీబే రిసార్ట్స్‌ కేపీ పాలెంకు కొత్త అందాలు తీసుకొచ్చింది. బీచ్‌ వాలీబాల్‌, బాక్స్‌ క్రికెట్‌, రోప్‌వే ఇసుకలో సముద్ర తీరం వెంబడి దూసుకెళ్లే కారు వంటివి ఏర్పాటు చేయడంతో పర్యాటకులు జోష్‌ అవుతున్నారు.

116 ఎకరాల గుర్తింపు

ఈ ప్రాంతానికి రానున్న రోజుల్లో పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉందని గుర్తించిన కలెక్టర్‌ నాగరాణి రిసార్ట్స్‌ నిర్మాణం కోసం 116 ఎకరాలను గుర్తించారు. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఇక్కడ రిసార్ట్స్‌ నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు ఈ బీచ్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేందుకు బ్లూప్లాగ్‌ కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటికే చాలామంది ప్రైవేట్‌ ఆపరేటర్లు రిసార్ట్స్‌ నిర్మాణానికి ముందుకొస్తున్నారు.

నరసాపురంలో తెరుచుకున్న రెస్టారెంట్‌

రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం గోదావరి ప్రాంతాల్లో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు నరసాపురంలోని బాపు ఘాట్‌ వద్ద రెస్టారెంట్‌తో పాటు బోట్‌ క్లబ్‌ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇది మూతపడింది. తాజాగా రెస్టారెంట్‌ను అందు బాటులోకి తీసుకొచ్చారు. త్వరలో గోదావరిలో విహరించేందుకు వీలుగా బోట్‌లను కూడా ఏర్పాటు చేయాలని టూరిజం నిర్ణయిం చింది. ఇది కాకుండా యలమంచిలి మండలం చించినాడ వద్ద ప్రత్యేకంగా బోట్‌క్లబ్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనుల్ని ప్రారంభించారు. ఆచంట మండలంలో మాచేనమ్మ కట్ట అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అక్కడికి వెళ్లే యాత్రికులకు వీలుగా రోడ్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

అతిథి గృహాలకు ప్రతిపాదనలు

మొగల్తూరు మండలం ముత్యాలమ్మ ఆలయం ఆధ్యాత్మికంగా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అతిథి గృహం నిర్మిం చాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. దీంతో పాటు ఉండి, తాడేపల్లిగూడెం, తణుకులో ఖాళీగా ఉన్న ఆర్‌ఆండ్‌బీ స్థలాలను గుర్తించారు. అక్కడ కూడా టూరిజం భవనాలు నిర్మించేందుకు కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మావుళ్లమ్మ, ముత్యాలమ్మ, పంచారామ క్షేత్రాలకు గతేడాది నుంచి ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రైవేట్‌ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చు కోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులు సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రభుత్వ సహకారంతోనే రిసార్ట్స్‌ నిర్మాణం

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పేరుపాలెం బీచ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. గతంలో పెండింగ్‌ పడిన పనులకు క్లియరెన్స్‌ ఇవ్వడంతో మూడు చోట్ల రిసార్ట్స్‌ నిర్మాణం నోచుకుంటున్నాయి. ఇప్పటికే మా సంస్థ సీబే చేపట్టిన నిర్మాణం పూర్తయింది. మూడు ఎకరాల స్థలంలో రిసార్ట్స్‌తో పాటు పర్యాటకుల వినోదం కోసం బీచ్‌ వాలీబాల్‌, బాక్స్‌ క్రికెట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇసుకలో కారు రైడింగ్‌ కోసం ప్రత్యేకంగా కారు తీసుకొచ్చాం. ప్రస్తుతం రిసార్ట్స్‌ అందుబాటులో ఉండటం వల్ల సెలవు రోజుల్లో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

– ఆచంట ఆనంద్‌, రిసార్ట్స్‌ నిర్వాహకుడు

Updated Date - May 25 , 2026 | 12:24 AM