Share News

ప్రశాంతంగా నీట్‌

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:29 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నీట్‌–యూజీ పునఃపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

 ప్రశాంతంగా నీట్‌

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. తనిఖీలు

తణుకు సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన అమ్మాయికి నో ఎంట్రీ

ఏలూరు జిల్లాలో 1,457 మంది హాజరు

ఏలూరు అర్బన్‌/దెందులూరు/ఏలూరు క్రైం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నీట్‌–యూజీ పునఃపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు ఏలూరు జిల్లాలో ఏలూరు, గోపన్నపాలెంలో మొత్తం ఆరు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1,674 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,457 మంది హాజరయ్యారు. 217 మంది గైర్హాజరయ్యారు. మే 3న జరిగిన నీట్‌ పరీక్ష రద్దు కావడంతో దానిస్థానే తాజాగా నిర్వహించిన రీ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచి సీఆర్‌పీఎఫ్‌, పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, నోడల్‌ ఆఫీసర్‌ భూర్‌సింగ్‌ మీనా తెలిపారు. జిల్లా ఎస్పీ కిశోర్‌ పర్యవేక్షణలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహిం చారు. మరోవైపు డ్రోన్‌ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేశారు. పరీక్షార్థులను నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించడంతో ముఖ్యంగా విద్యార్థినులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు.

‘పశ్చిమ’లో 2,262 మంది హాజరు

తాడేపల్లిగూడెం రూరల్‌/తణుకు/భీమవరం టౌన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలలో మొత్తం ఐదు సెంటర్లలో నీట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్‌ ప్రాంగణం, భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల ప్రాంగణం, తణుకు బాలుర హైస్కూల్‌, గల్స్‌ హైస్కూళ్లలో పరీక్షలు నిర్వహించారు. భీమవరంలో 1,188 మందికి గాను 1,056 మంది పరీక్షలు రాయగా, తణుకులో 662మందికి 624 మంది, తాడేపల్లిగూడెంలో 625మందికి 582 మంది పరీక్షలు రాశారు. మొత్తం జిల్లాలో 2,475 మందికి 2,262 మంది పరీక్షలు రాయగా 213 మంది గైర్హాజరయ్యారు. అధికారులు పరీక్షల కేంద్రాల గేటు వద్ద తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. మెటల్‌ డిటెక్టర్‌తో పాటు వేలిముద్రలు, ఐరిస్‌ తీసుకుని లోనికి అనుమతించారు.

భీమవరంలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి పరిశీలించారు. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని పరీక్ష కేంద్రాలను ఆర్డీవో మన్నెం సూర్యారావు పరిశీలించారు.

నో ఎంట్రీ.. వెనుదిరిగిన విద్యార్థిని..

తణుకు సెంటర్‌లో తాళాలు వేసిన ఏడు నిమిషాలకు తేతలి గ్రామానికి చెందిన గూటం అనూష పరీక్ష కేంద్రానికి చేరుకుంది. అప్పటికే సమయం పూర్తి కావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. గతంలో భీమవరంలో పరీక్ష జరిగినప్పుడు ఆలస్యంగా వెళ్లడంతో అధికారులు అనుమతించలేదని.. ప్రస్తుతం మళ్లీ ఆలస్యంగా వచ్చానని బాధపడుతూ తిరిగి వెళ్లిపోయింది.

Updated Date - Jun 22 , 2026 | 12:29 AM