Share News

జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ రద్దేనా?

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:17 AM

పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ రహ దారిపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శి స్తోంది.

జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ రద్దేనా?
ఉండి–ఆకివీడు మధ్యలో ఫేజ్‌–1లో జరుగుతున్న నాలుగు లేన్ల రోడ్డు పనులు

డీపీఆర్‌కు అనుమతి లేకపోవడంతో జరిగేది అదే

నాలుగు లేన్‌ల అలైన్‌మెంట్‌కు ఏడాది పూర్తి

అంతలోగా కేంద్రం అనుమతి ఇవ్వాల్సిందే

165 ఫేజ్‌–2 హైవేని పట్టించుకోని కేంద్రం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ రహ దారిపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శి స్తోంది. పామర్రు నుంచి దిగమర్రు వరకు విస్త రించి ఉన్న 165 జాతీయ రహదారి ఫేజ్‌–2కు స్పందించ లేదు. ఈ ఏడాది జిల్లా ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు దాదాపు 42 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల జాతీయ రహదారికి ప్రణాళిక చేశారు. అలైన్‌మెంట్‌ సిద్ధం చేశారు. ఆకివీడు, కాళ్ల, భీమవరం రూరల్‌, వీరవాసరం మండల గ్రామాల మీదుగా పాలకొల్లు నియోజకవర్గం దిగమర్రు వరకు భూములను గుర్తించారు. భూమి కోసం నోటిఫికేషన్‌ కూడా జారీచేశారు. సదరు అలైన్‌మెంట్‌కు జాతీయ రహదారి శాఖ ఆమోదముద్ర వేసింది. దాని ఆధారంగానే డీపీ ఆర్‌ సిద్ధం చేసి పంపారు. అంచనాలు మారుతూ వచ్చాయి. సుమారు రూ.2100 కోట్లతో తుది నివేదిక వెళ్లింది. మార్చిలోగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అంతా ఆశిం చారు. విజయవాడ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం నాలుగు లేన్‌ల రహదారి ఏర్పాటు విషయంలో స్పష్టత ఇచ్చారు. అప్పట్లో రూ.3000 కోట్లతో నివేదిక వెళ్లింది. కేంద్ర మంత్రి ప్రకటనతో జాతీయ రహదారి రెండో ఫేజ్‌ ఇక ఢోకా ఉండ దని అంతా ఆశించారు. తీరా రోజులు గడచిపోయాయి. కేంద్రం నుంచి స్పందన కానరాలేదు. జిల్లా ప్రజలు ఆకాంక్ష నెరవేరలేదు.

మొదటికొస్తే ముప్పే ..

తొలినుంచి ఆకివీడు–దిగమర్రు ఫేజ్‌–2 జాతీయ రహదారి విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో నిర్ణయించిన అలినేషన్‌పై కోర్టు వివాదాలున్నాయి. అప్పట్లో రెండు లేన్‌ల రహదారికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 1200 కోట్లు నిధులు కేటాయించారు. కానీ అలినేషన్‌ సమస్యతో ముందుకు వెళ్లలేదు. తదు పరి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీఎ ప్రభుత్వం కొలువు తీరింది. ఆకివీడు–దిగమర్రు వరకు ఫేజ్‌–2 జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ మారింది, నాలుగు లేన్‌ల రహదారి నిర్మించేలా నివేదిక సిద్ధమైంది. కొత్త అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. తొలుత నిర్ధారించిన అలైన్‌మెంట్‌ భీమవరం బైపాస్‌ మీదుగా వెళ్లింది. తదుపరి భీమవరం రూరల్‌ మండల గ్రామాల మీదుగా మార్చారు. తీరా కొత్త అలైన్‌మెంట్‌కు మే నెలతో ఏడాది గడువు పూర్తయ్యింది. ఏడాదిలోగా ప్రభుత్వం డీపీఆర్‌కు అనుమతి ఇవ్వకపోతే అలైన్‌మెంట్‌ రద్దు కానుందని అధికారులు చెపు తున్నారు. జాతీయ రహదారిపై జిల్లా అధికారులకు ఇప్పటిదాకా ఎటువంటి సమచారం రాలేదు. దాంతో ప్రస్తుత అలైన్‌మెంట్‌ కథ మళ్లీ మొదటి కొచ్చింది. మరోసార కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. లేదంటే డీపీఆర్‌కు అనుమతి లభించదు. ఇప్పుడిదే జిల్లా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ మాత్రం జాతీయ రహ దారిపై ఎటువంటి అపోహలు వద్దంటూ చెపుతూ వస్తున్నారు. కేంద్రం నుంచి అను మతులు రాకపోవడం వల్లే జిల్లా ప్రజల్లో నిరాశ అలము కుంది. పశ్చిమగోదావరి అభివృద్ధిలో కీలకమైన జాతీయ రహదారి డీపీఆర్‌పై ఈ ఏడాది కేంద్రం స్పందించక పోవడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర నిరాశకు లోనయ్యారు. రహదారి ఏర్పాటుతో భీమవరం ప్రాంత రూపు రేఖలు మారిపోతాయని అంతా అను కున్నారు. కానీ మరో ఏడాది కాలగర్భంలో కలసిపోయింది.

Updated Date - Jun 05 , 2026 | 12:17 AM