Share News

కళలు.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:36 AM

కళలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, కళాపరిషత్‌ల ద్వారా ప్రదర్శించే నాటికలకు సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.

కళలు.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి
స్త్రీ మాత్రే నమః నాటికలో సన్నివేశం

మూడో రోజు కొనసాగిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు

ఏలూరు రూరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి) : కళలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, కళాపరిషత్‌ల ద్వారా ప్రదర్శించే నాటికలకు సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ, హేలాపురి కళాపరిషత్‌ (లి.), ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో భాగంగా సోమవారం ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాలుగోరోజు మంగళవారం వరకు పోటీలు జరుగుతా యని నిర్వాహకులు ఎం.డి. ఖాజావలీ, పెదపాటి రామకృష్ణ తెలిపారు.

కన్నీరు పెట్టించిన ‘స్త్రీ మాత్రే నమః’ నాటిక

అందమైన కలల లోకంలో విహరిస్తున్న ఒక సామాన్య యువతి జీవితంలో జరిగిన ఓ అనూహ్య ప్రమాదంతో ఊహించిన మలుపే స్త్రీ మాత్రే నమః నాటిక ఇతివృత్తం. ప్రేమించిన వాడితో పెళిల్ల, అమెరికాలో స్థిరపడాలనే ఓ యువతి కథ ఇది. కానీ ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని అంతా తలకిందులు చేసి, ఊహించని భారమైన బాధ్యతను ఆమె భూజాలపై ఉంచుతుంది. ఒకవైపు కెరీర్‌, మరోవైపు మోయలేని బాధ్యత. రెండింటి మధ్య నలిగిపోతున్న ఆమెకు దిక్కుతోచని స్థితి ఎదురవుతుంది. సరిగ్గా అప్పుడే ఆమె జీవితంలోకి ఒక పెద్దాయన ప్రవేశించి, కష్టాల్లో ఉన్న ఆమెకు ఆమె ఆలోచనలను ధైర్యాన్ని ఇచ్చి, తిరిగి ఆమె జీవితాన్నే ఒక పెద్ద మలుపు తిప్పుతాడు. కన్నతల్లి కాకపోయినా తల్లి స్థానంలో ఉన్న స్త్రీఎప్పుడూ తన వ్యక్తిగత ప్రేమ కంటే బాధ్యతకే అగ్రతాంబూలం ఇస్తుందని, సొంత సుఖాలను త్యాగం చేసి బాధ్యతను నెత్తిన పెట్టుకునే ప్రతీ స్త్రీ మూర్తి వెనుక ఇలాంటి గొప్ప త్యాగం దాగి ఉంటుందని తెలియజేసింది ఈ నాటిక.

వినోదాన్ని పంచిన ‘సరిగమ పాప’

గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్‌ అకాడమీ సమర్పించిన ‘సరిగమ పాప’ హాస్య నాటిక ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. సుబ్బారావు – సుందరి దంపతుల ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తి ఓ చిన్నారిని బుట్టలో ఉంచి వెళ్లిపోవడంతో వారి జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ పాప కారణంగా భర్తపై, తండ్రిపై అనుమా నాలు పెరిగి కుటుంబంలో గందరగోళం నెలకొంటుంది. చివరకు టీవీ చానల్‌ నిర్వహించిన ‘సంసారంలో సరిగమ పాప’ కార్యక్రమంలో భాగంగానే ఇందంతా జరిగిందని తెలిసి అసలు నిజం బయట పడుతుంది. అదే సమయంలో పెళ్లైయిన 20ఏళ్ల తర్వాత నిజంగానే తమకు సంతానం కలగబోతుందన్న శుభవార్తతో దంపతులు ఆనం దంలో మునిగిపోతారు. అపార్థాలు, హస్యభరిత సంభాషణలు, చివరి ట్విస్ట్‌ ఈ నాటికకు ప్రత్యేక ఆకర్షణ.

Updated Date - Jul 07 , 2026 | 12:36 AM