ఉత్సాహంగా ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:26 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, హేలాపురి కళాపరిషత్, ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నాలుగోరోజు మంగళవారం ఉత్సాహపరిచే వాతావరణంలో ముగిశాయి.
ఏలూరు రూరల్, జూలై 7(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, హేలాపురి కళాపరిషత్, ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నాలుగోరోజు మంగళవారం ఉత్సాహపరిచే వాతావరణంలో ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆలోచింపజేసిన ‘అందరూ మంచి వారే కానీ’ నాటిక
సుమిత్ర ఓ పేద రైతు కుటుంబానికి కోడలు, భర్త వర్ధన్‌తో కలిసి పట్టణంలో నివసిస్తూ, మామయ్య కృష్ణమూర్తిని గౌరవంగా, మరదలు సౌజన్యను సొంత చెల్లెలిగా ప్రేమగా చూసుకుంటుంది. సౌజన్య పెళ్లి కోసం బంగారు గొలుసు కొనిపెట్టడం, మామయ్య స్నేహితుడి కంటి ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేసి కుటుంబ సభ్యుల అభిమానాన్ని ఆమె చూరగొంటుంది. అన్యూహ్యంగా సౌజన్య తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. రక్తమార్పిడి చేసినా కొంతకాలం జీవించే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో పరిస్థితి విషమిస్తుంది. అందరికీ సహాయం చేసిన సుమిత్ర మాత్రం సౌజన్య చికిత్స కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దని అలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని భర్తను హెచ్చరిస్తుంది. ఎంతో మంచి మనసున్న సుమిత్ర ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది ? సౌజన్య మరణం తరువాత కుటుంబంలో ఏం జరిగింది ? అందరూ మంచివారే అయినా ఆ కుటుంబం ఎందుకు విషాదాన్ని ఎదు ర్కొంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నాటిక. ఉత్కంఠభరితమైన కథనం, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో సాగుతూ, ప్రేక్షకులకు ఆలోచింపజేసింది.
సందేశాత్మకంగా సాగిన ‘బావ ఎప్పుడు వచ్చితీవు’..
కొత్తగా పెళ్లైన సుబ్బారావు–సుబ్బలక్ష్మి నగరంలో కొత్త కాపురం ప్రారంభిస్తారు. ఇంటికి వచ్చే తన అన్నను ‘అన్నయ్య’ అని పిలవాలని సుబ్బారావు భార్యకు చెబుతాడు. భర్త చెప్పిన మాటను అక్షరాలా పాటించిన ఆమె ఇంటికి వచ్చిన ఎలక్ట్రిషియన్‌ను కూడా ‘అన్నయ్య’ అని పిలుస్తుంది. దీంతో ఇబ్బంది పడిన సుబ్బారావు ‘ఎవరినీ అన్నయ్య’ అని పిలవకు.. ‘బావ అని పిలువు’ అని చెబుతాడు. భర్త చెప్పినట్టే మళ్లీ ఆమె ఇంటికి వచ్చిన ఓ అధికారిని ‘బావ’ అని సంబోధిస్తుంది. కోపోద్రిక్తుడైన సుబ్బారావు ‘నువ్వు నా మాట సరిగ్గా అర్ధం చేసుకోలేవు, నాకు తగిన భార్యవు కాదు, నీకు విడాకులు ఇస్తాను’ అని అంటాడు. అప్పుడు ఆమె.. భర్త చెప్పిన మాటలనే తాను పాటించానని తెలివిగా వివరిస్తూ భార్యను గౌరవించకుండా మాటలతో గందరగోళం సృష్టించిన భర్తకు తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. హాస్యభరితమైన సంఘటనలతో సాగుతూ, భార్యభర్తల మధ్య పరస్పర అవగాహన, స్పష్టమైన సంభాషణ, గౌరవం ఎంత అవసరమో ఈ నాటిక సాగింది. నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరింపజేశారు. పెదపాటి రామకృష్ణ, ఎండి ఖాజావలి, కొత్త కౌసలేందరావు పర్యవేక్షించారు.