సమాజాన్ని మేలుకొల్పేవే నాటికలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:22 AM
‘నాటికలు సజీవమని, మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలను భావితరాలకు చేర వేసే శక్తి నాటకానికి ఉందని, సమాజాన్ని మేలుకొల్పేవే నాటికలు’ అని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ సూపరిం టెండెంట్ జి.పాండు రంగారావు అన్నారు.
ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ పాండురంగారావు
‘అల్లూరి’ స్మారక జాతీయస్థాయి నాటికల పోటీలు ప్రారంభం
ఏలూరు రూరల్, జూలై 4(ఆంధ్రజ్యోతి):‘నాటికలు సజీవమని, మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలను భావితరాలకు చేర వేసే శక్తి నాటకానికి ఉందని, సమాజాన్ని మేలుకొల్పేవే నాటికలు’ అని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ సూపరిం టెండెంట్ జి.పాండు రంగారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటికల పోటీలను శనివారం ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలులో ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాలుగు రోజుల పాటు జరిగే నాటక పోటీలలో భాగంగా శనివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగి ఆలోచింపజేశాయన్నారు.
సహన నాటిక..
అభినయ ఆర్ట్స్ (గుంటూరు) ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘సహన నాటిక’ సందేశాత్మకంగా సాగింది. ఈ ప్రపంచంలో బతకాలంటే పోరాడాల్సిందే. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సంఘటనలను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. న్యాయం కోసం నిజాయతీ కోసం అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన ఓ తండ్రి – కూతుళ్ల జీవిత పోరాటమే ‘సహన నాటిక’. అంతులేని పోరాటంతో వారు ఎదుర్కొన్న కష్టాలు, సమాజం విసిరిన ప్రశ్నలు, వాటికి సహనంతో సమాధానాలు వెతుకుతూ ఆత్మవిశ్వాసంతో ప్రతి అడ్డంకిని అధిగమించి న్యాయం కోసం సాగించిన ప్రయాణాన్ని ఈ నాటిక ఆవిష్కరించింది. ఈ నాటికలో నటీనటులు తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయి అద్భుతమైన నటన కనబరిచారు. దర్శకుడు ఎన్. రవీంద్రరెడ్డి రూపకల్పనలో నాటిక ఆద్యంతం ఆసక్తిగా సాగి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సహనం, ధైర్యం, నిజాయతీ, న్యాయం కోసం చేసే పోరాటమే ’సహన నాటిక’ ప్రధాన సందేశం.
ఆకట్టుకున్న ‘దేవుణ్ణి చూసా !’
దైవం దేవాలయాల్లో కనిపించని లోకాలలో మాత్రమే కాదు.. ప్రేమ, జాలి, దయ, క్షమ, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే సద్గుణం, పరోపకారం, పశ్ఛాతాపం వంటి ఉన్నత విలువలతో నిండిన మనుషుల హృదాయాల్లో కూడా కొలువై ఉంటాడు. అలాంటి వ్యక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ, సరైన మార్గాన్ని చూపించే దైవత్యావన్ని ఈనాటిక ఆవిష్కరిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు ద్వారా మానవత్వం, ఆత్మపరిశీలన, దైవత్యం మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా ప్రతిబింబించే కథే ‘దేవుణ్ణి చూసా!’ నాటిక. ఈ నాటికలో నటీనటులు తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయి సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పెదపాటి రామకృష్ణ, ఎం.డి. ఖాజవలి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యర్రా సోమలింగేశ్వరరావు, మజ్జి కాంతారావు, గరికిపాటి కాళిదాసు, పుల్లాబొట్ల పురుషోత్తమరావు, తదితరులు పాల్గొన్నారు.