నర్సాపురం–అరుణాచలం ఇక రెగ్యులర్
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:42 AM
స్పెషల్ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్‌ప్రెస్ ఇక రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నడవనున్నది.
భీమవరం క్రైం, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్‌ప్రెస్ ఇక రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నడవనున్నది. తొలి రెగ్యులర్ సర్వీస్‌ను భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. గత ఏడాది జూలై 9న తిరువణ్ణామలై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని ఆక్యుపెన్సీ 110 శాతానికి చేరుకోవడంతో విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిని రెగ్యులర్ సర్వీస్‌గా మార్చాలని కోరామన్నారు. ఇప్పుడు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ఇబ్బందులు ఉండవన్నారు. జూలై 10 నుంచి నరసాపురం–బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రానున్నరోజుల్లో నరసాపురం నుంచి విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీస్, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌కు హాల్ట్, నరసాపురం నుంచి వారాణసికి రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కోరా రామ్మూర్తి, జక్కంపూడి కుమార్, వినోద్ వర్మ, పొత్తూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.