Share News

ఏలూరుకు ఇరుకు దారి

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:10 AM

జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి చేరడానికి ఇరుకుదారిలో వెళ్లాల్సిందే.

ఏలూరుకు ఇరుకు దారి
ఆశ్రం జంక్షన్‌ నుంచి పాత బస్టాండ్‌ రోడ్డు

పెరిగిన ట్రాఫిక్‌.. అయినా సింగిల్‌ లైన్‌ రహదారి

విస్తరణ దిశగా అడుగేయని యంత్రాంగం

జాతీయ రహదారి జంక్షన్లలో ప్రమాదాలు

జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి చేరడానికి ఇరుకుదారిలో వెళ్లాల్సిందే. ఆశ్రం జంక్షన్‌ నుంచి పాత బస్టాండ్‌ వైపు, వట్లూరు నుంచి నగరంలో వెళ్లడానికి అప్రమత్తంగా ప్రయాణించాలి. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి. నగరం విస్తరించినా దశాబ్దాల కాలంగా సింగిల్‌ లైన్‌ రహదారిపై తరచకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తున్నాయి. నగర ప్రవేశం, నగరం నుంచి వెళ్లే వాహనాలు సింగిల్‌ రోడ్డులో ప్రయాణించాల్సిందే. దీనికితోడు జాతీయ రహదారి జంక్షన్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

విజయవాడ వైపు, ఇటు తాడేపల్లిగూడెం వైపు నుంచి వాహనాలు ఏలూరు నగరంలో అడుగుపెట్టాలంటే జాతీయ రహదారి జంక్షన్‌ నుంచి ఇరుకు దారిలో ప్రయాణించాల్సిందే. వీఐపీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధు లు, ఉన్నతాధికారులు సైతం సింగిల్‌ లైన్‌ రోడ్డులో వెళ్లాల్సిందే. 3 నుంచి 5 కిలో మీటర్ల దూరంలో నగరానికి చేరడానికి దాదాపు అర్ధగంట సమయం పడుతుంది. నగరం నుంచి ఈ రెండువైపులా జాతీయ రహదారికి చేరడా నికి కూడా ట్రాఫిక్‌ రద్దీలో అదే సమయం పడుతోంది.

డబుల్‌లైన్‌ విస్తరణ ఎప్పుడో?

ప్రధానంగా మినీ బైపాస్‌ ఏర్పడిన 25 ఏళ్ల తర్వాత డబుల్‌ లైన్‌ రోడ్లు విస్తరణ జరగలేదు. ఇటువైపు లారీలు, ఇతర భారీ వాహనాలు బైపాస్‌ మీదుగా కలపర్రుకు వెళుతుంటాయి. వట్లూరు రైల్వేస్టేషన్‌ మొదలుకుని బైపాస్‌ వరకు సింగిల్‌లైన్‌ రోడ్డు వల్ల బస్సులు లేదా లారీలు ఎదురుపడితే తప్పించడం చాలా కష్టం. రాత్రివేళ్లలో ఇటుదాటి వెళ్లాలంటే అరగంట పైనే సమయం పడుతోంది. మరోవైపు పాతబస్టాండ్‌ నుంచి ఆశ్రం వైపు పరిస్థితి మరింత దయనీయం. రాకపోకలకు అనుగుణంగా డబుల్‌ లైన్ల రోడ్డు విస్తరణ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణం నుంచి నగర స్థాయి హోదా పెరిగినా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరడం లేదు. ఏళ్ల తరబడి సింగిల్‌ లైన్‌ రహదారులపై జిల్లా ప్రజలు, నిత్యం వందలాది బస్సులు, కార్లు, ఆటోలు నగర శివార్ల నుంచి దాటడానికి రోజూ ప్రయాసగా మారుతోంది. భారీగా పెరిగిన ఆటోలు, టెంపోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలతో సింగిల్‌ లైన్‌రోడ్డుపై అరగంట ప్రయాణం నరకప్రాయంగా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఆక్రమణలు.. మార్జిన్లలో వ్యర్థాలు

సింగిల్‌ లైన్‌ రోడ్డుకిరువైపులా మార్జిన్‌ ఆక్రమణల పాలయ్యాయి. ఆశ్రం వైపు పండ్లు, ఇతర దుకాణాలు రోడ్లపై మార్జిన్లపై ఏర్పాటు చేయడంతో రోడ్డు మరి కాస్త బక్కచిక్కింది. మరోవైపు కృష్ణాకాల్వ పరిసరాలు అండలు జారిపోయి ఉండడంతో అటు మార్జిన్‌ తక్కువైంది. ఇటువైపు రాత్రివేళల్లో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు పక్కన పెరిగిన భారీ వృక్షాల కొమ్మలు తొలగించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు న్నాయి. తూర్పులాకుల సమీపంలోని మార్కెట్‌ యార్డు నుంచి ఆటోనగర్‌ దగ్గర వరకు రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. రోడ్డు మార్జిన్లు విస్తరించలేదు. ఇటీవల ఇక్కడ రూ.రెండు కోట్ల వ్యయంతో రహదారిని అభివృద్ధి చేసినా.. దానికి తగ్గట్టుగా రాకపోకలు వేగంగా సాగే పరిస్థితులు లేవు. అవుట్‌ కట్స్‌ ప్రయాణంలో ఇక్కట్లపై అటు యంత్రాంగం.. ఇటు ప్రజాప్రతినిధుల దృష్టి సారించి భవిష్యత్‌లోనైనా రోడ్లు విస్తరణకు నడుం కట్టాల్సిన పరిస్థితులున్నాయి.

Updated Date - Jun 15 , 2026 | 12:10 AM