నరసాపురం రైల్వేస్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:23 AM
నరసాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టింది.
అభివృద్ధి పనులకు రూ.97 కోట్లు
ఫిట్‌లైన్ నిర్మాణానికి రూ.20 కోట్లు
రూ.20 కోట్లతో స్టేషన్‌లో వందేభారత్ రైళ్ల రిపేర్ల షెడ్
ఇతర నిర్మాణాలకు రూ.57 కోట్లు
నరసాపురం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): నరసాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సహకారంతో స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే రూ.30 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. ఇది కాకుండా స్టేషన్‌లో లిఫ్ట్, ఫుట్‌ఓవర్ వంతెన నిర్మాణానికి మరో రూ.40 కోట్లు మంజూరు చేశారు. ఇవి కాకుండా తాజాగా మరో రూ.97 కోట్లు నిధులు విడుదల చేశారు.
రైళ్ల నిర్వహణ పనులకు ఇబ్బంది
నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 28 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటిలో చెన్నై వెళ్లే వందేభారత్, లింగంపల్లి, నాగర్‌సోల్, ధర్మవరం, గుంటూరు, హుబ్లీ వంటి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా బెంగళూరు, అరుణాచలం, చర్లపల్లి తాజాగా తిరుపతికి వీక్లీ స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. మిగిలిన వన్ని డెమో రైళ్లు ఉన్నాయి. నిత్యం ఈ స్టేషన్ నుంచి ఐదు నుంచి పదివేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం మూడు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల నిర్వహణ పనులు చేసేందుకు రెండు ఫిట్‌లైన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి శిథిలావస్థకు చేరింది. దీనివల్ల ప్రధాన ఎక్స్‌ప్రెస్ లలో మెయింటినెన్స్ పనులు చేసేందుకు సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. ఒక రైలు నిర్వహణ పనులు చేయాలంటే ఫిట్‌లైన్ మీద కనీసం ఎనిమిది గంటలు ఉంచాలి. రైలు చక్రాల నిర్వహణ, బ్రేక్‌లు, విద్యుత్ బోగీల క్లీనింగ్ తదితర పనులన్నీ ఈ ఫిట్‌లైన్ మీదే చేపడుతున్నారు. ప్రస్తుతం రెండు ఫిట్‌లైన్‌లు ఉన్నప్పటికీ ఒకటి శిథిలావస్థకు చేరడం వల్ల రైళ్ల నిర్వహణ అంతా ఒకదాని మీదే చేపట్టాల్సి వస్తున్నది. దీనివల్ల కొత్త రైళ్లను పట్టాలెక్కించే అవకాశం లేకుండా పోతోంది.రెండో ఫిట్‌లైన్ పనులు పూర్తయితే రోజుకు ఆరు రైళ్ల నిర్వహణ పనులు చేపట్టవచ్చు.
ఇటీవల వందేభారత్ రైలు పట్టాలెక్కింది. దీనికోసం ప్లాట్ ఫారంలో నీళ్లు పట్టేందుకు ప్రత్యేక పైప్‌లైన్ వేశారు. అయితే రిపేర్లు చేసేందుకు షెడ్ లేదు. త్వరలో నరసాపురం నుంచి హైద్రాబాద్, బెంగళూరుకు వందేభారత్ అమృత్ భారత్ రైళ్లను నడపాలని ప్లానింగ్ చేస్తున్నారు. వీటితో పాటు విశాఖ నుంచి నడుస్తున్న వారణాసి ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించాలని ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ రైళ్లన్నీ పట్టాలెక్కాలంటే స్టేషన్‌లో ఫిట్‌లైన్‌తో పాటు బోగీల నిర్వహణ, షెడ్‌ను కూడా నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇంజనీర్ అధికారులు సిద్ధం చేసి రైల్వేకు నివేదించగా రూ.97 కోట్లు మంజూరయ్యాయి. వీటికి తోడు అమృత్ భారత్ నిధులు రూ.30 కోట్లతో చేపట్టిన స్టేషన్ పనులు చివరి దశకు చేరాయి. లిఫ్ట్ ఓవర్ బ్రిడ్జి పనులు కూడా శరవేగవంగా సాగుతున్నాయి. మంజూరైన రూ.97 కోట్లు నిధులతో పనులు పూర్తిచేస్తే విజయవాడ డివిజన్‌లోనే అతి పెద్ద స్టేషన్‌గా నరసాపురం మారనుంది.