దశాబ్దాల నిరీక్షణకు తెర
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:21 AM
కూటమి పాలనలో నరసాపురంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఒక్కక్కటి పరిష్క రిస్తున్నది.
తీరంలో పెండింగ్ ప్రాజెక్టుల కదలిక
పూర్తయిన నల్లిక్రీక్ పనులు
బియ్యపుతిప్ప హార్బర్‌కు రూ.20 కోట్లు
పరిష్కార దిశగా కాళీపట్నం భూములు
వశిష్ఠ వారధి టెండర్లు ఓకే
(నరసాపురం –ఆంధ్రజ్యోతి)
కూటమి పాలనలో నరసాపురంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఒక్కక్కటి పరిష్క రిస్తున్నది. రెండేళ్ల పాలనలో ఇప్పటికే నల్లిక్రీక్ పనుల్ని పూర్తిచేసింది. దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. మొగల్తూరు మండలం కాళీపట్నంలో సుమారు 40 ఏళ్ల నుంచి పరిష్కారం కాని భూముల సమస్యకు పరిష్కారం చూపింది. ఇటు వారధి టెండర్లు ఓకే అయ్యాయి. దీంతో తీర ప్రాంత వాసుల్లో అనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనులన్ని రానున్న మూడేళ్లలో ప్రభుత్వం పూర్తి చేస్తుందన్న ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే నరసాపురం నియోజకవర్గ రూపురేఖలే మారనున్నాయి.
నల్లిక్రీక్‌తో మత్స్యకారులకు జీవనోపాధి
ప్రతి ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తే నల్లిక్రీక్ పనుల్ని పూర్తి చేస్తామని ప్రధాన పార్టీలు హామీలు ఇస్తూ వచ్చాయి. అయితే శంకుస్థాపనలు మినహా ఈ పనులు మాత్రం పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన తరువాత ఆప్పటి మంత్రి లోకేశ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు.సుమారు నాలుగు కిలోమీటర్లు క్రీక్ తవ్వక పనులు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో పనులు పెండింగ్ పడ్డాయి. సముద్రంలో పోటు పాటులకు వచ్చే నీటి పాయే నల్లిక్రీక్. ఇది పూర్తిగా పూడుకు పోయింది. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురైంది. బియ్యపుతిప్ప నుంచి మొదలయ్యే ఈక్రీక్ మొగల్తూరు మండలం కేపీ పాలెం వరకు పారుతుంది. అక్కడ సముద్రంలో కలుస్తోంది. ఇది పూడుకుపోవడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది. వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.12 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం తవ్వక పనులు పూర్తయ్యాయి.
కదిలిన కాళీపట్నం భూ సమస్య
నియోజకవర్గంలో దశాబ్ధలుగా పెండింగ్ ఉంటూ వస్తున్న సమస్యల్లో కాళీపట్నం భూముల సమస్యలు ఒకటి. సుమారు 5 వేల ఏకరాలను 7 వేల మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూమి క్రయ విక్రయాలకు నోచుకోవడం లేదు. దీనివల్ల రైతులు అత్యవసర సమయాల్లో అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి సారించింది. ఇటీవల సర్వే నిర్వహించి సాగు చేసే రైతులకు పట్టాలి చ్చేందుకు రెడీ అవుతుంది.
బైపాస్‌తో వారధికి మోక్షం
తీర ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలో వారధి ఒకటి. దీనికి రెండురోజుల క్రితం మోక్షం లభించింది. కూటమి అధికారంలోకి రాగానే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మళ్లీ టెండర్లను ఆహ్వానించింది. రెండు రోజుల క్రితం ఈ ప్రక్రియ పూర్తయింది. సుమారు రూ.400 కోట్ల అంచనాలతో పిలిచిన టెండర్లలో రాజస్తాన్‌కు చెందిన బీఅర్‌ఎన్ సంస్ధ దక్కిం చుకుంది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే పనుల్ని ప్రారంభించేందుకు అధికారులు, నేతలు రెఢీ అవుతున్నారు.
హార్బర్‌కు రూ.20 కోట్లు
తీర ప్రాంతంలో హార్బర్ నిర్మించాలన్నది నాలుగు దశాబ్దాలుగా వినిపిస్తున్న నినాదం. ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మత్స్యకారులకు హామీతో సరి పెడు తున్నారు. ఇప్పటికి మూడు సార్లు శంకుస్థాపన జరిగింది. అయితే ఏదో ఒక కారణంతో పనులు పెండింగ్ పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రూ.20 కోట్లు కేటాయించింది. తాత్కాలికంగా బియ్యపుతిప్ప వద్ద బోట్లు నిలిచేందుకు ఈ నిధులతో ప్లాట్‌ఫారం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల నరసాపురం తీర ప్రాంతంలో వేటకు వచ్చిన బోట్లు అత్యవసర సమయంలో పట్టణంలోని లాకుల వద్దకు వచ్చే సమస్య తీరనుంది. నిర్మాణం పూర్తయితే తీర గ్రామాలు మరింత అభివృద్ధికి నోచుకోంటాయి. హార్బర్‌కు ప్రత్యామ్నయంగా పెట్రోల్ బంకులు, ఐస్ ఫ్యాక్టరీ, ఎగుమతి కంపెనీలు రానున్నాయి. దీనివల్ల స్థానికులకు ఉపాధి లభించనుంది.
ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నేరవేర్చే దిశగా ఆడుగులు వేస్తున్నది. దానిలో భాగంగానే దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న ఒక్కో ప్రాజెక్టును క్లియర్ చేస్తున్నాం. ఇప్పటికే నల్లిక్రీక్ పనులు పూర్తి చేశాం.దీనివల్ల 13గ్రామాల్లోని మత్స్యకారులకు జీవనోపాధి మెరుగుపడనుంది. కాళీపట్నం భూ సమస్యల్లో కూడా కదలిక వచ్చింది. త్వరలో పరిష్కారం కానుంది. బియ్యపుతిప్ప వద్ద హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారధి టెండర్లు ఆమోదించగానే పనుల్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. సుమారు నాలుగు దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న ఈ సమస్యలకు రెండేళ్లలో కదలిక రావడం చాలా ఆనందంగా ఉంది.
–బొమ్మిడి నాయకర్, విప్, నరసాపురం ఎమ్మెల్యే