పురాల్లో ముగిసిన తొలి ఘట్టం!
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:13 AM
ఏలూరు జిల్లాలో పుర ఎన్నికల తొలిఘట్టం నామినేషన్ల పర్వానికి ఆదివారంతో తెర పడింది. కోలాహలంగా వివిధ పార్టీల అభ్య ర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు
130 డివిజన్లు, వార్డులకు 589, మేయర్,
రెండు చైర్మన్ పదవులకు 30 నామినేషన్లు
నేడు పరిశీలన, 21 వరకు ఉపసంహరణకు గడువు
ఏలూరు సీట్ల పంపకం ఓకే.. నూజివీడు, జంగారెడ్డిగూడెంలో కొలిక్కిరాని సర్దుబాట్లు
ఏలూరు/ టూటౌన్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో పుర ఎన్నికల తొలిఘట్టం నామినేషన్ల పర్వానికి ఆదివారంతో తెర పడింది. కోలాహలంగా వివిధ పార్టీల అభ్య ర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏలూరు కార్పొ రేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురాల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది. జిల్లాల్లో 130 డివిజన్లు, వార్డులకు 589 నామినేషన్లు, మేయర్, రెండు చైర్మన్ పదవులకు 30 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏలూరులో నామినేషన్ల ప్రక్రియలో కొన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థుల మధ్య తడబాటు చోటుచేసుకుంది. సీట్లు సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, జనసేన అభ్యర్థులు అటు, ఇటుగా నామినేషన్ల దాఖలు చేశారు. వీరందర్ని ఉపసంహరించుకు నే దిశగా ఆయా పార్టీలు పావు లు కదుపుతున్నాయి. ఆదివారం రాత్రికి ఏలూ రులో సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఇక నూజి వీడు, జంగా రెడ్డిగూ డెంల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. కాగా ఈ నెల 19 నామినేషన్ల పరిశీలనను రిటర్నింగ్ అఽధికారులు చేపట్టి, అనంతరం అర్హులైన వారి జాబితాలను ప్రదర్శించనున్నారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తదనంతరం ప్రచార సరళిలపై పార్టీల అభ్యర్థులు వేగంగా పావులు కదపనున్నారు.
మేయర్ సీటుకు 12 నామినేషన్లు
నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికలకు చివరి రోజు భారీగా నామినేషన్లు వేశారు. ఆదివారం కార్పొరేటర్ అభ్యర్థులు 215 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నాటికి 128 మంది దాఖలు చేయగా మొత్తం 343 మంది కార్పొరేటర్ అభ్య ర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మేయర్ పదవికి శని వారం వరకు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా ఆదివారం మరో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 12కు చేరింది. నగరంలో 62 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి మొత్తం 110, వైసీపీ 117, జనసేన 46, ఇండిపెండెంట్లు 44, కాంగ్రెస్ 4, సీపీఐ 8, సీపీఎం 3, బీజేపీ 10, రిఫార్మర్ పార్టీ ఆఫ్ ఇండియా 1 మొత్తం 343 మంది కార్పొరేటర్లుగా నామినేషన్లు వేశారు. మేయర్ పదవికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా రెడ్డి నాగరాజు నామినేషన్ దాఖలు చేయడం విశేషం. అధిష్ఠానం తప్పుకోమంటే దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మేయర్ పదవికి ఇండిపెండెంట్లు ముగ్గురు, భారత చైతన్య యువజన పార్టీ తరపున 1, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో భాగంగా 62 డివిజన్లను పంచుకున్నారు. టీడీపీ 40, జనసేనకు 18, బీజేపీకి 4 స్థానాలు తీసుకునేటట్లు అధినాయకత్త్వాలు అంగీకారానికి వచ్చాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎక్కువ స్థానాల్లో ఒకరిపై ఒకరు రెబల్అభ్యర్థులుగా పోటీకి దిగారు. సోమవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ నామినేషన్ల విత్డ్రా కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ఎన్నికల బరిలో ఎవరుంటారనేది స్పష్టమవుతుంది.
నూజివీడులో చైర్మన్ పదవికి ఎనిమిది..
నూజివీడు/నూజివీడు టౌన్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): నూజివీడు మున్సిపల్ చైర్మన్ స్థానానికి చివరి రోజు ఆదివారం ఎనిమిది నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీడీపీ చైర్మన్ అభ్యర్థులుగా బర్రె ఇళయ రాజా, ఇందుపల్లి లక్ష్మీప్రభలు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ తరపున చైర్మన్ అభ్యర్థులుగా కంచర్ల లవకుమార్, మాజీ కౌన్సిలర్ కాలి సురేష్ బాబు, ఇండియా కూటమి తరపున ఇన్కమ్ టాక్స్ మాజీ అసిస్టెంట్ కమిషనర్ బత్తుల లక్ష్మీ బాల కోటేశ్వరి, బహుజన సమాజ్వాది పార్టీ తరపున డాక్టర్ చలిగంటి వెంకటేష్, స్వతంత్ర అభ్యర్థులుగా న్యాయవాది ఇందుపల్లి సత్యప్రకాశ్, తొమ్మండ్రు విజయ్సారథి నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మూడవ రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం మూడు రోజుల్లో 160 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో టీడీపీ నుంచి 61 వైసీపీ 69, జనసేన 17, స్వతంత్ర అభ్యర్థులుగా 9, సీపీఐ ఒకటి, సీపీఎం నుంచి ఇద్దరు, బీజేపీ మరొకరు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజు ఆదివారం మొత్తం 110 నామి నేషన్లు దాఖలు అయ్యాయి.
అభివృద్ధి బాటలో నడిపిస్తాం: మంత్రి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూజివీడు పట్టణంలో రూ.70కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని.. పనులు వివిధ దశల్లో ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పార్థసారథి అన్నారు. ఆదివారం టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా బర్రె ఇళయరాజా నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మరో రూ.150 కోట్లతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు చెప్పారు.
ఈసారీ విజయం మాదే : మాజీ ఎమ్మెల్యే
గత స్థానిక పురపాలక ఎన్నికల్లో తాము ప్రతిపక్షంలో ఉన్నా విజయం సాధించామని ఇప్పుడు కూడా విజయం సాధించి జగన్ ఖాతాలో వేస్తామని మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవకుమార్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందచేస్తున్న అనూష
జంగారెడ్డిగూడెంలో చైర్పర్సన్కు పది..
జంగారెడ్డిగూడెం,అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా మొదటి రోజు జంగారెడ్డిగూడెంలో ఒక్క నామినేషన్ పడలేదు.రెండవ రోజు చైర్పర్సన్కు ఒకటి, వార్డు కౌన్సిలర్ స్థానాలకు 31 నామినేషన్లు పడ్డాయి. చివరిరోజు ఆదివారం చైర్పర్సన్కు తొమ్మిది నామి నేషన్లు దాఖలు కాగా 32 వార్డుల్లో కౌన్సిలర్ స్థానాలకు 121 నామినేషన్లు పడ్డాయి. ఆదివారం నాటికి మొత్తం చైర్పర్సన్కు పది, కౌన్సిలర్ స్థానాలకు 152 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అథారిటీ, మున్సిపల్ కమిషనర్ కెవి.రమణ తెలిపారు. వీటిలో చైర్పర్సన్కు బీఎస్పీ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 3, వైసీపీ నుంచి 5 నామినేషన్లు వచ్చాయి. కౌన్సిలర్ స్థానాలకు బీజేపీ 2,సీపీఐ 1, సీపీఎం 2,టీడీపీ 55, వైసీపీ 60, జనసేన 20 , ఇండి పెండెంట్ల నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి.
కూటమి ఛైర్పర్సన్ అభ్యర్ధి అనూష నామినేషన్ దాఖలు
చైర్పర్సన్ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరచిన రొంగల అనూష ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ముందుగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్చంద్రశేషు, జనసేన ఏలూరు పార్టమెంట్ కో ఆర్డినేటర్ పోల్నాటి బాబ్జీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్, టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, దాకారపు కృష్ణ, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, పెను మర్తి రామకుమార్, రాజాన పండు తదితరులు పాల్గొన్నారు.
కాగా జంగారెడ్డిగూడెం మునిసిపల్ చైర్పర్సన్ టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నాయకురాలు మారిశెట్టి బాలచిట్టెమ్మ టీడీపీ రెబల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో కూటమి అభ్యర్థి రొంగల అనూషతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు.