Share News

అదే ప్లాన్‌ !

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:32 AM

నల్లిక్రీక్‌ తవ్వకం పనులు డిజైన్‌ ప్రకారమే పూర్తిచేయ నున్నారు.

అదే ప్లాన్‌ !

డిజైన్‌ ప్రకారమే నల్లిక్రీక్‌ పనులు

నష్టపోతున్న రైతులకు

ప్రత్యామ్నాయంగా భూమి

చినలంక వద్ద రూ.8 కోట్లతో వంతెన

పూర్తయిన భూ పరీక్షలు

మే నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యం

నరసాపురం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నల్లిక్రీక్‌ తవ్వకం పనులు డిజైన్‌ ప్రకారమే పూర్తిచేయ నున్నారు. రైతుల ఆందోళనతో కొద్ది రోజులపాటు నిలిచిన పనులు నేతల హామీతో ఊపందుకున్నాయి. 8.6 కిలోమీటర్ల మేర చేపట్టిన తవ్వకం పనులు మే నెలాఖరుకు పూర్తికానున్నాయి. మరోవైపు చిన లంకలో కొట్టుకుపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెనను ఆధునిక డిజైన్‌తో నిర్మిం చేందుకు 36 మీటర్ల లోతులో మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. దానికి అనుగుణంగా వంతెన పిల్లర్లను డిజైన్‌ చేయనున్నారు.

మత్స్యకారులకు ప్రయోజనం

నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు కేపీ పాలెం వరకు 12.6 కిలోమీటర్ల మేర నల్లిక్రీక్‌ విస్తరించింది. ఆక్రమణలు, సముద్ర పోటు పాటులకు క్రీక్‌ పూర్తిగా పూడుకుపోయింది. నేతలు 30 ఏళ్లుగా హామీలిస్తున్నారే తప్ప పనులు చేపట్టడం లేదు. ఈ కారణంగా నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సంప్రదాయ మత్స్యకారులకు ఉపాధి కరువైంది. వేట నిషేధ సమయంలోను ప్రత్యామ్నాయంగా వేటాడే మార్గం లేకపోయింది. పోటు పాటులకు వచ్చే సముద్ర నీరు ఈ ప్రాంతాలను ముంచేస్తోంది. ఈ ప్రభావం తుఫాన్‌ సమ యాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యలు పరిష్కరించాలంటే పూడుకు పోయిన క్రీక్‌ను తవ్వాలని తీర ప్రాంత మత్స్యకారులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

వైసీపీ హయాంలో పెండింగ్‌

రాష్ట్ర విభజన తర్వాత ఈ పనులకు మోక్షం లభించింది. అప్పటి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా వున్న నారా లోకేశ్‌ ఈ పనులకు శంకుస్థాపన చేసి రూ.16 కోట్లు విడుదల చేశారు. బియ్యపుతిప్ప నుంచి చినలంక వరకు నాలుగు కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పనులకు బ్రేక్‌ పడింది. పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప తట్ట మట్టి తీయలేదు. కూటమి అధికారంలోకి రాగానే 8.6 కిలోమీటర్ల మేర తవ్వకం పనులకు రూ.10.09 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది డిసెంబరులో ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే డిజైన్‌ ప్రకారం తవ్వడం వల్ల కొంత మంది రైతులు నష్టపోతున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు.పనులు నిలిచిపోతాయన్న భయం నెలకొంది. విప్‌ నాయకర్‌, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ రామరాజు రైతులతో పలు మార్లు చర్చించి సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. రైతులకు ఎక్కడ నష్టం జరుగుతుందో దానికి ప్రత్యామ్నాయంగా క్రీక్‌కు అవతల వైపున భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

80 మీటర్ల పొడవైన వంతెన

చినలంక నుంచి సముద్రానికి మత్స్యకారులు వెళ్లాలంటే క్రీక్‌ మీద నుంచే వెళ్లాలి. గతేడాది తుఫాన్‌కు వంతెన కొట్టుకుపోయింది. ప్రస్తుతం తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. క్రీక్‌ తవ్వక పనుల్లో భాగంగా వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆధునిక డిజైన్‌ను సిద్ధం చేశారు. రూ.8 కోట్లతో 80 మీటర్ల మేర క్రీక్‌పై వంతెన నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారు.

మే నాటికి పూర్తి చేస్తాం

ప్లాన్‌ ప్రకారమే క్రీక్‌ తవ్వక పనులు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తవ్వక పనులు పూర్తయ్యాయి. తవ్విన మట్టిని గట్లపై వేసి ఎత్తు చేస్తున్నాం. వాతావరణం ఆను కూలిస్తే మే నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వంతెన నిర్మాణానికి మట్టి పరీక్షలు నిర్వహించాం. దానికి ప్రకారం వంతెన నిర్మాణానికి ప్లాన్‌ చేస్తున్నాం.

మురళీకృష్ణ, ఇరిగేషన్‌ డీఈ

Updated Date - Mar 24 , 2026 | 12:32 AM