Share News

చెదిరిన ‘ముస్తాబు’

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:39 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల పరిశుభ్రత పాటించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

చెదిరిన ‘ముస్తాబు’

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమం

విద్యార్థులు పరిశుభ్రత పాటించేలా కార్యాచరణ

నిర్వహణ నిధులున్నా క్షేత్రస్థాయిలో అమలు శూన్యం

అత్తిలి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల పరిశుభ్రత పాటించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలున్నా పర్యవేక్షణ కొరవడింది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల్లో ముస్తాబు ఊసే లేదు. ఎవరూ పట్టించుకోవట్లేదు..!

మంచి అలవాట్లు లక్ష్యంగా..

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ లక్ష్యంగా వారిలో అవగాహన పెంపొందించి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌ 22 నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమం అమల్లోకి తెచ్చింది. మొదట కొన్ని రోజులు సజావుగా సాగినా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పర్యవేక్షణ కొరవడంతో అమలు కావడంలేదు. ముస్తాబులో భాగంగా తల దువ్వుకోవడం, ముఖం శుభ్రం గా ఉంచుకోవడం, గోళ్తు కత్తిరించుకోవడం, ఏకరూప దుస్తులు ధరించడం, చేతుల పరిశుభ్రత పిల్లలకు నేర్పించాల్సి ఉంది.

పాఠశాల నిధులు వెచ్చించవచ్చు

దువ్వెన, పౌడర్‌, నెయిల్‌ కట్టర్‌, తువ్వాలతో బడుల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేయాలి. పాఠశాల నిర్వహణ నిధులు వెచ్చించి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు, బిల్లులు డ్రా చేస్తున్నారు గాని పాఠశాలల్లో వస్తువులు కనిపించడం లేదు. విద్యార్థులకు ముస్తాబు కార్నర్‌ కనిపించక నిట్టూర్చుతున్నారు. ప్రతివారం ముస్తాబు మాస్టర్‌ను ఎంపిక చేసి ఆ విద్యార్థి పేరు ప్రదర్శించాలి. ఇద్దరు ముస్తాబు లీడర్లను ఎంపిక చేయాల్సి ఉన్నా ఎక్కడా జరగడంలేదు. అధికారులు స్పందించి కార్యక్ర మాలు సమర్ధంగా అమలు చేయడంపై దృష్టిసారించాల్సి ఉంది.

Updated Date - Aug 04 , 2026 | 12:39 AM