నరసాపురంలో హత్య
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:27 AM
నరసా పురం–పాలకొల్లు జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద అదివారం ఉదయం మహిళను ఓ ఉన్మాది దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీరంలో కలకలం రేపింది.
కారులో వెళ్తుండగా మహిళను కత్తితో పొడిచి చంపిన ఉన్మాది
నరసాపురం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): నరసా పురం–పాలకొల్లు జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద అదివారం ఉదయం మహిళను ఓ ఉన్మాది దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీరంలో కలకలం రేపింది. సీఐ యాదగిరి తెలిపిన వివరాలివి.. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి గ్రామానికి చెందిన టీనా రోజా(31) ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసుకుని సూళ్లూరు పేటలో శిక్షణ పొందుతుంది. శిక్షణ పూర్తయిన తరువాత ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లాలన్న ఆలోచనలో ఉంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి పమ్మి దయామణి.. విశ్రాంతి ఉపాధ్యాయురాలు, పెళ్లి చేసుకోకుండా కుమార్తెగా టీనారోజాను దత్తత తీసుకుని చదివించి, మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెసిన జాలెం నవీన్ కుమార్‌తో సుమారు 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసింది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలతో గత కొన్నేళ్లుగా ఎవరి ఇంటి దగ్గర వారు ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లి, పిల్లలను చూసేందుకు ప్రతీ ఆదివారం ఇంటికి వస్తుంటుంది. ఆదివారం రైలులో నరసాపురం వచ్చిన ఆమెను సఖినేటిపల్లి తీసుకువెళ్లేందుకు గ్రామానికి చెందిన అంగర సురేష్ కారు తీసుకువచ్చాడు. ఇంటికి వెళుతుండగా అదే గామ్రానికి చెందిన మార్గాని రమేష్ కనిపించడంతో కారు ఆపి ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత రోజా వాటర్ బాటిల్ కోసం కారు దిగింది. తిరిగి కారు ఎక్కుతుండగా వెనుక కూర్చున్న రమేశ్ ఒక్కసారిగా కత్తితో రోజా మెడ, పొట్ట, గుండెల్లో పొడిచాడు. సురేష్ కారు ఆపి రమేష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గాయాలతోనే సురేశ్ కారు నడుపు కుంటూ రోజాను ప్రభుత్వ ఆస్పత్రికి తీసు కెళ్లగా ఆమెను పరీక్షిం చిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. గాయపడిన సురేశ్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తు న్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
అన్ని కోణాల్లో విచారణ..
సమాచారం తెలుసుకున్న డీఎస్పీ సుధాకర్‌బాబు.. పాలకొ ల్లు, నరసాపురం సీఐ, ఎస్‌ఐ లతో కలిసి ఘటనా ప్రదేశాన్ని, అనంతరం ఆస్పత్రికి వచ్చి టీనా రోజా శరీరంపై ఉన్న కత్తిగాట్లను పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గాయ పడిన సురేశ్‌తో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునేందుకు కోనసీమ, ఇతర ప్రాంతాలకు పంపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. రమేశ్‌కు రోజాతో ఉన్న సంబంధం ఏమిటి ? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.