ప్రతీకారంతో దారుణ హత్య
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:40 AM
అన్నదమ్ముల మధ్య భూవివాదం రక్తపాతానికి దారితీసింది. కుటుం బాల మధ్య కక్షను పెంచి గొడవలు, కేసులు చివరికి ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది.
భూవివాదంలో చిన్నాన్నను నరికి చంపిన అన్నకొడుకు
ప్రాణహాని వుందంటూ పోలీసులకు అరగంట ముందే ఫోన్
లా అండ్ ఆర్డర్ వైఫల్యం : ఎమ్మెల్యే రోషన్‌కుమార్
పోలీసుల వైఫల్యం లేదు : ఎస్పీ కిశోర్
జంగారెడ్డిగూడెం రూరల్/ఏలూరు క్రైం, జూలై 7(ఆంధ్రజ్యోతి): అన్నదమ్ముల మధ్య భూవివాదం రక్తపాతానికి దారితీసింది. కుటుం బాల మధ్య కక్షను పెంచి గొడవలు, కేసులు చివరికి ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి వెంకటరెడ్డి, దుర్గారెడ్డి(55) అన్నదమ్ములు. మరో ఇద్దరు సోదరులు గతంలోనే మృతి చెందారు. వెంకటరెడ్డికి శ్రీనివాసరెడ్డి, దుర్గారెడ్డికి నాగార్జున కుమారులు. వీరికి గ్రామంలో 1.70 ఎకరాల వ్యవసాయ భూమి విషయమై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు ప్రాణహాని ఉందంటూ దుర్గారెడ్డి, నాగార్జునరెడ్డి ఇటీవల కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆది వారం దుర్గారెడ్డి, వేరే వ్యక్తితో పొలంలో పని చేస్తుండగా వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి మరి కొందరు వచ్చి అతనిపై దౌర్జన్యానికి దిగారు. భయపడిన దుర్గారెడ్డి 112కు ఫిర్యాదు చేశాడు. జంగారెడ్డిగూడెం పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి బైండోవర్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం రైతు భరోసా కేంద్రం వద్ద కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న దుర్గారెడ్డిని శ్రీనివాసరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణహాని ఉందంటూ దుర్గారెడ్డి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చివరకు హత్య జరగడంపై గ్రామస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నాయ కులు, కుటుంబసభ్యులు పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ట్టు ఏఎస్పీ సుస్మిత తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇది పోలీసుల వైఫల్యమే : ఎమ్మెల్యే
‘టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డికి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి అని హత్యకు అర గంట ముందు మా కార్యాలయం నుంచి పోలీసులకు ఫోన్ చేశాం. ఈలోపే దారుణ హత్య జరిగినట్లు సమాచారం వచ్చింది. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ వైఫల్యమే. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతోనే హత్య జరిగింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీని వెనక ఎవరున్నా ఉపేక్షించేది లేదు. పోలీసులు పేకాట, కోడి పందేలపై దాడులు కాదు. లా అండ్ ఆర్డర్‌ను సక్రమంగా చూసు కోవాలి. బాధ్యులను శిక్షించాలి’ అని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. పేరంపేట వచ్చి దుర్గారెడ్డి కుటుంబ సభ్యులను పరా మర్శించి ధైర్యం చెప్పారు.
పోలీసుల వైఫల్యం లేదు : ఎస్పీ కిశోర్
పేరంపేట హత్య ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని ఎస్పీ కేపీ ఎస్ కిశోర్ స్పష్టం చేశారు. ఏలూరు ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆ కుటుంబానికి పూర్వీకుల నుంచి ఐదు ఎకరాలు పొలం వచ్చింది. నలు గురు వారసులు పంచుకోగా ఎకరం 70 సెంట్ల భూవివాదంలో ఉంది. దుర్గారెడ్డి 2017లో తన పేరుపై మ్యూటేషన్ చేయించుకో వడంతో దీనిపై మిగిలిన ముగ్గురు రెవెన్యూ అధికా రులకు ఫిర్యాదు చేయగా అది రద్దు చేశారు. 2024లో దుర్గారెడ్డి తన పేరుపై భూమిని నమోదు చేయించుకోవ డంతో వెంకటరెడ్డి కుటుంబంతో గొడవలు జరుగుతున్నా యి. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాల కు చెందిన నలుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేయడానికి జంగారెడ్డిగూడెం పోలీసులు కబురు పంపగా మిగిలిన ముగ్గురు
స్టేషన్‌కు రాగా తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయించాం. దుర్గారెడ్డి రాలేదు. మంగళవారం పొగాకు రైతుల ధర్నా నేపథ్యంలో పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దుర్గారెడ్డి తన పొలాన్ని కౌలుకు చేస్తున్న పండు అనే వ్యక్తితో కలిసి వివాదాస్పదమైన భూమిలోని చెట్లను తొలగిస్తున్న నేపథ్యంలో ప్రతికార కక్షలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దుర్గారెడ్డి హత్యకు గురయ్యాడు. ఏఎస్పీ సుస్మితను విచారణకు ఆదేశించాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. దుర్గారెడ్డి హత్య కేసులో హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్, ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.