Share News

మురసు ముంచేసింది

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:04 AM

మురసు తుఫాన్‌ రైతులను ముంచేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది.

మురసు ముంచేసింది

తుఫాన్‌తో రైతుకు తీరని నష్టం

జిల్లాలో కుంభవృష్టి

పొంగిన వాగులు

రహదారులు జలమయం

స్తంభించిన జనజీవనం

మురసు తుఫాన్‌ రైతులను ముంచేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. నిన్న మొన్న వచ్చిన అర్నబ్‌ తుఫాన్‌ వల్ల గాలులు తీవ్రతతో ఇబ్బందులు పడినా ఇప్పుడు కుంభవృష్టితో ప్రజలు విలవిలలాడారు. ఏజెన్సీలో వాగులు పొంగాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై ఉధృతంగా నీరు ప్రవహించింది. ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు.

(ఏలూరు సిటీ–అంధ్రజ్యోతి)

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్‌ మురసు మంగళవారం ఒంగోలు సమీపంలో కొత్తపట్నం వద్ద తీరం దాటిందని అధికారులు చెబుతున్నారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ ఏలూరు జిల్లాకు సంబంధిం చి ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాబోయే 24 గంటల పాటు జిల్లాలో వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని చెబతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. మురసు తుఫాన్‌ ప్రభావం సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల ను ఆమె ఆదేశించారు. చెరువులు, కొవ్వాడ, జల్లేరు, త మ్మిలేరు, ఎర్రకాలువ జలాశాయాల వద్ద నీటి నిల్వ సా మర్ధ్యం, గట్ల పరిస్థితిని ఇరిగేషన్‌ అధికారులు ఎప్పటిక ప్పుడు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో 18002331077, 08812–224519, 9491041419 నంబర్లతో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు.

దెబ్బతిన్న పంటలు

భారీ వర్షాలతో జిల్లాలో 13,272 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు సమాచారం. అర్నబ్‌ నష్టాల నుంచి రైతులు కోలుకోకముందే మళ్లీ నష్టంతో రైతులు చితికిపో యారు. అర్నబ్‌తో దెబ్బతిన్న పంట చేలు 40వేల ఎకరాల్లో ఇంకా ముంపులోనే ఉన్నాయని జిల్లా వ్యవసా య శాఖ నివేదికలో పేర్కొన్నారు. మురసు తుపాన్‌ కారణంగా జిల్లాలో 484 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బ తిన్నాయని ఉద్యాన శాఖ నివేదిక సిద్ధం చేసింది. ముఖ్యంగా అరటి, బొప్పాయి తోటలతో పాటు కూరగా యలు, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

ఏలూరును ముంచేసింది..!

ఏలూరు నగరంలో పల్లపు ప్రాంతాల్లో నీట మునిగాయి. డ్రెయినేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం నీటితోపాటు మురుగు నీరు రహదారులపై చేరడంతో దుర్గంధం నెలకొంది. ఇళ్లలో సైతం నీరు చేరింది. జిల్లాలో 2 చెట్లు, ఒక విద్యుత్‌ స్థంభం నేలకూలింది. 3 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 99 మందికి ఆశ్రయం కల్పించారు.

ఉంగుటూరులో అత్యధికంగా 105.6 మి.మీ. వర్షపాతం

తుఫాన్‌ కారణంగా మంగళవారం ఉదయం 8..30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు జిల్లాలో అత్యధికంగా ఉంగుటూరు మండలంలో 105.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 64.3. మండలాల్లో వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. పెదపాడు, ముదినేపల్లి 102.8, ముసునూరు 87.6, నూజివీడు 85.4, ఏలూరు అర్బన్‌ 76.6, దెందులూరు 73.4, కొయ్యలగూడెం 73, జీలుగుమిల్లి 71.2, లింగపాలెం 70.8, ద్వారకాతిరుమల 68.8, జంగారెడ్డిగూడెం 68.2, ఆగిరిపల్లి 65.6, చింతలపూడి 65, మండవల్లి 62.6, భీమడోలు 62.4, టి.నరసాపురం 62, పెదవేగి 55.6, కామవరపుకోట 53.8, ఏలూరు రూరల్‌ 52.6, కైకలూరు 50.8, చాట్రాయి 49.2, నిడమర్రు 47.6, బుట్టాయిగూడెం 47.2, కలిదిండి 43.4, పోలవరం 39.6, వేలేరుపాడు 32, కుక్కునూరులో 23.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

Updated Date - Nov 04 , 2026 | 01:04 AM