ఆశా..నిరాశేనా ?
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:55 PM
ఇటీవల ప్రభుత్వం పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన వార్డులు పెంచింది. కానీ జిల్లాలో నర్సాపురం, ఆకివీడులోనే పెంపు ప్రక్రియ చేపడుతున్నారు. విలీన గ్రామాల సమస్యతో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాల్లో వార్డుల పెంపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా పదవులు పొందుతామని ఆశతో ఉన్నవారికి ఇది నిరాశ కలిగిస్తోంది..
ఆకివీడు, నరసాపురంలోనే వార్డుల పెంపు
నాలుగు మునిసిపాలిటీలపై మీమాంస
విలీన సమస్యతో ఆగిన ప్రక్రియ ?
మరో ఐదేళ్లు ఆగితే తిరోగమనమే
పదవుల కోసం కొత్తవారి ఎదురుచూపులు
ఆశావహుల్లో గుబులు ...
కూటమిలోనూ నిరుత్సాహం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇటీవల ప్రభుత్వం పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన వార్డులు పెంచింది. కానీ జిల్లాలో నర్సాపురం, ఆకివీడులోనే పెంపు ప్రక్రియ చేపడుతున్నారు. విలీన గ్రామాల సమస్యతో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పురపాలక సంఘాల్లో వార్డుల పెంపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో దీనిపై స్పష్టత ఇవ్వలేదు. వార్డులు పెరుగుతాయి.. కొత్తగా పదవులు పొందుతామని ఆశతో ఉన్నవారికి ఇది నిరాశ కలిగిస్తోంది.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసు కుంటుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పట్టణ కేంద్రాలుగా నియోజకవర్గాలు అధికం. ఆచంట మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ మున్సిపాలిటీ లున్నాయి. అక్కడ కొత్తగా వార్డులు పెరిగితో పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్న వారిలో దిగాలు నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పదవికోసం కలలు గంటున్న వారూ ఉన్నారు. ఏదో ఒకరోజు తమకు అవకాశం వచ్చి తీరు తుందంటూ ఎదురు చూస్తున్న నాయకుల్లో ఇప్పుడు వార్డుల పెంపు ప్రతిబంధకంగా మారింది. గత ఐదేళ్లు పాలకవర్గాలు లేకుండా గడచిపోయింది. విలీన గ్రామాల సమస్యపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనట్టయితే మరో ఐదేళ్లు పాలకవర్గాలు లేకుండానే జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పాలన సాగతుంది. అదే జరిగితే మున్సిపాలిటీల అభివృద్ధి కుంటుపడనుంది.
ఇబ్బందులు పడుతున్న జనం
పాలకవర్గాలు లేకపోవడంతో పట్టణాల్లో పౌర సమస్యలపై జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారం కోసం ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. కౌన్సిలర్లు ఉంటే వారికి తమ గోడును వినిపించుకునేవారు. పాలకవర్గాలుంటే అధికారులు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాస్త జాగ్రత్తలు పడేవారు. ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయిలో జిల్లాలో కొందరు మున్సిపల్ అధికారులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. సమస్య కోసం వెళితే పరిష్కారం మాట అటుంచితే పరుష పదజాలం వాడుతున్నారు. కనీస గౌరవం కూడా లేకుండా పోయిందంటూ ప్రజలు ఈసడించుకునే పరిస్థితులున్నాయి. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు పాలకవర్గాలు లేకపోవ డంతో అధికారులు ఆడిందే ఆటగా సాగింది. అప్పటి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ముద్ర మున్సిపాలిటీలపై పడింది. ఒకవైపు నాటి నియోజకవర్గ నేతలు. మరోవైపు అధికారుల దందాతో జనం విసిగెత్తిపోయారు. పాలక వర్గాలు లేకపోవడం వల్ల మున్సిపల్ అధికారులపై అజమాయిషీ కూడా ఉండడం లేదు. ఇప్పటికీ అదే పంథాలో జిల్లాలోని కొందరు మున్సిపల్ అధికారులు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళు తున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ప్రభుత్వం వివరణ కోరుతూ మెమోలు జారీచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఐదేళ్లపాటు పాలకవర్గాలు లేకపోతే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ జనంలోనూ చర్చ నడుస్తోంది.
నిధులకూ ఇబ్బందులే ..
పాలకవర్గాలు ఉంటేనే మున్సిపల్ నిధులపై అజమాయిషీ ఉంటుంది. అధికారులు తమకు తోచిన రీతిలో నిఽధులు ఖర్చు పెడుతున్నారు.ఆర్డీవో స్థాయిలో ప్రత్యేక అధికారులున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. కౌన్సిల్ ఉన్నట్టయితే వార్డుల వారీగా కౌన్సిలర్లే నిఘా పెడతారు. గతంలో పనులు చేపట్టకుండానే బిల్లులు చేసుకుంటున్నట్టు పాలకవర్గాలు గుర్తించాయి. వాటికి బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుతగిలాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టాణల్లో ఇటువంటి దందా సాగింది. ఐదేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఇష్టారీతిన బిల్లులు పెట్టేసుకున్నారు. దీనిపై ఇప్పటికీ భీమవరం మున్సిపాలి టీలో విచారణ సాగుతోంది. విజిలెన్స్ తనిఖీల్లో నిధులు దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. పాలకవర్గాలు లేకపోతే ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. ఆర్థికంగా మున్సిపాలి టీలకు నష్టం వాటిల్లనుంది. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు కూడా ఇది నష్టమే. కౌన్సిల్‌లో స్థానం కోసం ఎదురు చూస్తున్న వారంతా ప్రభుత్వ నిర్ణయంకోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.