Share News

అంచనాలు తారుమారు !

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:23 AM

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్‌లు ప్రకటించిన తర్వాత రాజకీయ వేడి మొదలైంది. ముందస్తు అంచనాలు వేసుకుంటూ ప్రయత్నాలు చేసు కున్న నాయకులు డీలా పడిపోయారు. రిజర్వేషన్ల ఆధారంగా కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి.

అంచనాలు తారుమారు !

నేతలు అనుకున్నదొకటి..అయ్యిందొక్కటి..

తెరపైకి కొత్త ముఖాలు

ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్న తెలుగుదేశం, జనసేన నాయకులు

భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం ఆశావాహుల్లో డీలా

ఎన్నికలకు సిద్ధపడుతున్న పార్టీలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి) :మున్సిపాలిటీల్లో రిజర్వేషన్‌లు ప్రకటించిన తర్వాత రాజకీయ వేడి మొదలైంది. ముందస్తు అంచనాలు వేసుకుంటూ ప్రయత్నాలు చేసు కున్న నాయకులు డీలా పడిపోయారు. రిజర్వేషన్ల ఆధారంగా కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. అభ్యర్థులను సిద్ధం చేసుకునే పనిలో కూటమి పార్టీలు పెద్ద కసరత్తే చేసుకుం టున్నాయి. కూటమి అధిష్ఠానం ఏ పార్టీకి కేటాయించినా సరే ఆశావహుల మధ్య పెద్ద పోటీ ఉన్నట్టు కనపడుతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో మాత్రం రిజర్వేషన్‌లు వచ్చిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చంటూ జిల్లాలో పెద్దగా ప్రయత్నాలు జరగలేదు.

భీమవరంలో ఏమవుతుందో

భీమవరం మున్సిపాలిటీని జనరల్‌ కేటాయి స్తారంటూ తొలినుంచి ప్రచారం జరిగింది. అందులో భాగంగానే తెలుగుదేశం నుంచి మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు ప్రయత్నాలు చేశారు. భీమవరంలో ఎంపీగా బీజేపీ, ఎమ్మె ల్యేగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మున్సిపల్‌ చైర్మన్‌ పదవి టీడీపీ దక్కించు కోవా లన్న తలంపుతో ఉంది. ఆ మేరకే తెలుగుదేశం జిల్లా సమన్వయ భేటీలో ఇన్‌ఛార్జ్‌ తోట సీతా రామలక్ష్మి వినతిపత్రం కూడా సమర్పించారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉన్న నియోజ కవర్గాల్లో మున్సిపల్‌ చైర్మన్‌లను తెలుగుదేశానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే జనసేన నుంచి వబిలిశెట్టి రామకృష్ణ ఆశిస్తూ వచ్చారు. తీరా అక్కడ జనరల్‌ మహిళ అయ్యింది. తెలుగు దేశం తమ పార్టీ నుంచి అభ్యర్థులను సిద్ధం చేసిపెట్టుకుంది. ఇన్‌ఛార్జ్‌ తోట సీతా రామలక్ష్మి ఇంటినుంచే తోట శిరీష పేరు కూడా వినిపి స్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయిస్తే పొత్తూరి బాపిరాజు సతీమణి, ఆర్య వైశ్యుల నుంచి అయితే తటవర్తి కుటుంబం నుంచి మహిళా అభ్యర్థులను ఖరారు చేసుకు న్నారు. ఇక జనసేన నుంచి కూడా మహిళా అభ్యర్థులు తమ మనోభావాలను ప్రజా ప్రతిని ధులు, ఆ పార్టీ నేతల వద్ద వెల్లడిస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో గుంభనం

తాడేపల్లిగూడెంలో బీసీ జనరల్‌ కేటాయి స్తారని ఆశించారు. తెలుగుదేశం నుంచి గొర్రెల శ్రీధర్‌ ఆశించారు. రాష్ట్ర స్థాయి వరకు ప్రయ త్నించారు. జనసేన నుంచి కూడా బీసీ అభ్యర్థుల జాబితాలో వర్తనపల్లి కాశీ తదితరల పేర్లు వినిపించాయి. జనరల్‌ మహిళ అయితే బీజేపీ తరపున మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావు కుమార్తె సింధు ఆశించారు. కూటమి నేతలు, తమ పార్టీ అధిష్ఠానం వద్ద ఆమె ఆశీస్సులు పొందేందుకు యత్నించారు. అందరి అంచనాలకు భిన్నంగా చివరి నిమిషంలో అన్‌ రిజర్వ్‌డ్‌కు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీని కేటాయించారు. దాంతో కూటమిలోనూ ఒకింత గుంభన వాతావరణం నెల కొంది. అంతా లోపాయికారిగానే తమ ప్రయ త్నాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తులను రంగంలోకి దింపాలన్న ప్రయత్నంలో ఎమ్మెల్యే బొలిశెట్టి ఉన్నారు. జనసేనలోనూ ఆశావహులు అధికంగానే ఉన్నారు. బీసీ జనరల్‌ అంటూ తెలుగుదేశంలో తొలినుంచీ ప్రయత్నాలు జరిగాయి. జనరల్‌కు వెళ్లడంతో తెలుగుదేశం ఏమి చేస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.ఇన్‌ఛార్జ్‌ బరిలో ఉండా లంటూ కేడర్‌ నుంచి ప్రతిపాదన వస్తున్నట్టు చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి ఈతకోట తాతాజీ తమ మనోభావాలను వెల్లడించినట్టు సమాచారం.

తణుకులో మరోలా

తణుకు మున్సిపాలిటీ జనరల్‌కు వెళ్లడంతో ఓసి,బీసీ వర్గాల నుంచి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశీస్సులు పొందేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు విలీన సమస్యతో ఎన్నిక జరగదన్న అభిప్రాయంతో నాయకులున్నారు. విలీన గ్రామాల సమస్య పరిష్కారమైంది. తణుకు జనరల్‌కు కేటాయించడంతో ఇప్పుడి ప్పుడే నాయకులు తెరపైకి వస్తున్నారు. పార్టీ పరంగా అవకాశం లభిస్తే బీసీల నుంచి కూడా నాయకులు అక్కడ పోటీ చేయాలన్న తలం పుతో ఉన్నారు. ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ అభిమతం మేరకే అక్కడ కూటమి తరపున మున్సిపల్‌ అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది.

పాలకొల్లులో వేచి చూసే ధోరణి

మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు మున్సిపాలిటీ బీసీ మహిళకు వెళ్లడంతో ఆ వర్గానికి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి నిమ్మల వద్ద తమ అంతరంగాన్ని ఉంచుతున్నారు. మలి విడతలో ఎన్నికలు జరుగుతుండడంతో వేచి చూద్దామంటూ మంత్రి తమ పార్టీ నేతలకు సర్ది చెపుతున్నారు. తణుకు, పాలకొల్లు మున్సిపా లిటీలు పక్కాగా తెలుగుదేశం పార్టీకే ఉంటా యన్న వాదన బలంగా వినిపిస్తోంది. దాంతో ఆపార్టీ తరపునే ప్రయత్నాలు జోరందు కుంటున్నాయి.

నరసాపురంలో షాక్‌

నర్సాపురంలో గత ఎన్నికల్లోనూ జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇప్పుడు స్పెషల్‌ గ్రేడ్‌ కావడంతో జనరల్‌కు అవుతుందని ఆశించారు. ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌తో సహా, కూటమి పార్టీ నేతలు ఆ దిశగానే తమ కేడర్‌ను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. తాము బరిలో ఉంటామంటూ ఆశావహులు తమ అంత రంగికుల వద్ద లేదంటే వార్డుల్లో ప్రచారం చేసు కున్నారు. తీరా మళ్లీ నర్సాపురంలో జనరల్‌ మహిళకు వెళ్లడంతో ఆశావహులతో పాటు, కూటమి నాయకులకుడా ఒకింత షాక్‌ తగిలి నట్టయ్యింది. ఇప్పుడు జనరల్‌ మహిళ కేటాయిం చినా సరే తెలుగుదేశం, జనసేనలో పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది. జనరల్‌ మహిళ కావడంతో అభ్యర్థి ఎంపికపై వెతుకులాట మొదలుపెట్టారు. ఉదయం నుంచి పలువురి పేర్లను పరిశీలనకు తీసుకున్నారు. గతంలో వీరి కుటుంబం పార్టీతో ఉన్న అనుబంధం, ఆర్థిక పరిస్థితి వంటి లెక్కలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ కోటిపల్లి పద్మ, మాజీ కౌన్సిలర్‌ కొత్తపల్లి శైలజ, మాజీ మునిసిపల్‌ వీసీ భూపతి నరేష్‌ సతీమణి పేర్లు తెరమీదకు వచ్చాయి. వీటితో పాటు టీడీపీకి చెందిన జక్కం శ్రీమన్నారాయణ, పాలూరి బాబ్జీల సతీమణులు, కొవ్వలి నాయుడు సోదరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా పరిశీ లిస్తున్నారు. మరోవైపు వైసీపీలో కూడా ఆభ్యర్ధి ఎంపికపై మల్లగులాలు పడుతున్నారు. మాజీ కౌన్సిలర్‌ కావలి సీత, మాజీ పట్టణ ఆధ్యక్షులు సతీమణి పేర్లు వినిపిస్తున్నాయి.

ఆకివీడులో ఏదైనా సై

నగర పంచాయతీకి జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించడంతో ఆశావహులు ఆత్రు తగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీకి అయినా ఇబ్బంది లేదంటూ ఆ నియోజకవర్గ నేతలు ధీమాతో ఉన్నారు.కూటమి నుంచి ఒకరిని బరిలో దింపేందుకు డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణ రాజు సిద్ధపడుతున్నారు. అక్కడ కూడా తెలుగు దేశం పార్టీకే మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జనేసనకు కేటాయించినా సరే అభ్యర్థులకు అక్కడ కొరత లేదు. కూటమి , వైసీపీల నుంచి రెండు, మూడు పేర్లు వినబడుతున్నాయి.గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది పోటీ చేయగా నలుగురు గెలుపొందారు. ఈ నలుగురులో ఇప్పుడు ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Oct 13 , 2026 | 12:23 AM