నామినేషన్ల కోలాహలం!
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:50 AM
ఏలూరు జిల్లా పురపాలక సంస్థల ఎన్నికల్లో రాజకీయం ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఘట్టానికి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలతో తెరపడనుండటంతో చివరిరోజు రాజకీయ పార్టీల సందడి నెలకొంది.
ఏలూరు మేయరు స్థానానికి ఐదు, కార్పొరేటర్లకు 123
జంగారెడ్డిగూడెంలో 31, నూజివీడులో 50 దాఖలు
కోలాహలంగా రెడ్డి అప్పలనాయుడు ర్యాలీ
నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర
ఏలూరు/ఏలూరు రూరల్/ఏలూరు టూటౌన్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లా పురపాలక సంస్థల ఎన్నికల్లో రాజకీయం ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఘట్టానికి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలతో తెరపడనుండటంతో చివరిరోజు రాజకీయ పార్టీల సందడి నెలకొంది. ఏలూరు కార్పొ రేషన్లో ప్రధాన పార్టీల అభ్య ర్థు లుగా జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు, వైసీపీ నుంచి గంటా మోహన్ రావు తమ నామినేష న్ల ఘట్టాన్ని శని వా రం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు రెండో రోజు ఏకంగా 204 నామి నేషన్లు దాఖలు కాగా, మేయర్, చైర్మన్ పదవులకు ఆరు నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్, ఇతర పార్టీలు అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
భారీ ర్యాలీతో అప్పలనాయుడి నామినేషన్
ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికలకు రెండో రోజు శనివారం భారీగా నామి నేషన్లు దాఖలయ్యాయి. నగరంలోని 62 డివిజ న్లకు శుక్ర, శనివారాల్లో కలిపి కార్పొరేటర్ అభ్య ర్థులుగా మొత్తం 128 మంది నామినేషన్లు వేశా రు. శనివారం ఒక్కరోజే మేయర్ స్థానానికి ఐదు, కార్పొరేటర్లకు 123 నామినేషన్లు దాఖల య్యాయి. కార్పొరేటర్ల స్థానాలకు టీడీపీ నుంచి 49 మంది, జనసేన 13, వైసీపీ 47 స్వతంత్రులు 16, బీజేపీ నుంచిఇద్దరు, రిఫార్మస్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఒకరు నామినేషన్ వేశారు. 18వ తేదీ ఆదివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం మూడు గంటలలోగా భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ, 28న పోలింగ్ జరగనుంది.
కూటమి, వైసీపీ అభ్యర్థుల సందడి
మేయర్ అభ్యర్థులుగా కూటమి నుంచి జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడితోపాటు ఆయన సతీమణి రెడ్డి అనురాధ నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ తరపున గంటా మోహన్రావు, గంటా సాయి నరేష్, రిఫార్మస్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున షేక్ హుస్సేన్ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు శనివారం భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. తొలుత అభయాంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ.. కూటమి ఐక్యతను కాపాడుతూ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన సీతారామాంజనేయ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్, రాష్ట్ర వక్ఫ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటశాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు కూటమి అభ్యర్థిగా ఇళయరాజా
నూజివీడు టౌన్: నూజివీడు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా బర్రె ఇళయరాజాను ఎంపిక చేస్తూ తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు రోజులపాటు ఐవీఆర్ సర్వేలు నిర్వహించిన చివరికి ఇళయరాజాకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇళయరాజా ఆదివారం ఛైర్మన్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కంచర్ల లవకుమార్ ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నూజివీడు మున్సిపల్ పరిధిలో 36 వార్డులకు రెండో రోజు 50 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు కూడా చైర్మన్ అభ్యర్థులుగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కౌన్సిలర్ స్థానాలకు టీడీపీ నుంచి 33, వైసీపీ నుంచి 12, జనసేన నుంచి నాలుగు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణకు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేయగా, మరో కౌంటర్ను ప్రత్యేకంగా చైర్మన్ నామినేషన్ల ప్రక్రియకు కేటాయించారు.
జంగారెడ్డిగూడెం కూటమి అభ్యర్థిగా అనూష
జంగారెడ్డిగూడెం: మున్సిపల్ చైర్పర్సన్ కూటమి అభ్యర్థిగా రొంగల అనూషను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం ప్రకటించారు. కూటమి నాయకు లంతా ఆమె గెలుపునకు సహకరించాలని కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకురాలు పంచమర్తి అనురాధ, ఎమ్మెల్యే రోషన్ కుమార్.. స్థానిక నాయకు లతో చర్చలు జరిపిన అనంతరం అధిష్ఠానం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద అనూషకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, షేక్ ముస్తఫా, బొబ్బర రాజ్పాల్ కుమార్,పెనుమర్తి రామకుమార్, రాజాన పండు, దాకారపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదే మున్సిపాలిటీలో వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా మేకా సత్యవతి శనివారం ఎన్నికల అధికారి బదరీ నారా యణకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. రెండో రోజు చైర్పర్సన్కు ఒక నామినేషన్ రాగా.. మొత్తం 32 వార్డులకు సంబంధించి 31 నామినేషన్లు దాఖలయ్యాయి. కౌన్సిలర్ స్థానాలకు టీడీపీ నుంచి 13 మంది, వైసీపీ నుంచి 14 మంది, జనసేన నుంచి నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు.