కూటమి హవా
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:56 AM
పురపోరులో కూటమి పార్టీ హవా నడిచింది. ఏలూరు నగర పాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీల్లో జనసేన, టీడీపీ జెండాలు రెపరెపలాడాయి.
ఏలూరులో జనసేన.. జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో టీడీపీ
అధికార పార్టీలకు జైకొట్టిన పట్టణ ఓటర్లు
వైసీపీ నామమాత్రపు పోటీకి పరిమితం
వార్డులలో సైతం కూటమి ఆధిక్యం
కూటమి శ్రేణుల్లో సంబరాలు
ఓట్ల లెక్కింపులో పకడ్బందీ ఏర్పాట్లు
విజేతలకు ధ్రువీకరణ పత్రాలు
పురపోరులో కూటమి పార్టీ హవా నడిచింది. ఏలూరు నగర పాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీల్లో జనసేన, టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. ఏలూరు మేయర్ పదవి జనసేన కైవసమైంది. జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసిపాలిటీ చైర్మన్ పదవులు టీడీపీ ఖాతాలో పడ్డాయి. వార్డుల్లో సైతం టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. మూడు చోట్ల వైసీపీ నామమాత్రపు పోటీకి పరిమితమైంది.
(ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు–ఆంధ్రజ్యోతి)
హేలాపురిలో కూటమి పార్టీలు వైసీసీని ఊడ్చేశాయి. కేవలం మూడు డివిజన్లకు పరిమితం చేశాయి. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలు 51 డివిజన్లు కైవసం చేసుకొని తుఫాన్ సృష్టించాయి. మందకొడిగా పోలింగ్ సాగిందని, మాకే లాభిస్తుందన్న వైసీపీ ఆశలపై ఓటర్లు పూర్తిగా నీళ్లు చల్లారు. కూటమి పార్టీల ఐక్యంగా విజయ దుందుబి మోగించి కార్పొరేషన్ మేయర్ పీఠంతో సహా, నాలుగువంతులకు పైగా డివిజన్ల ఖాతాలో వేసుకుని తమకు ఎదురులేదని నిరూపించారు. కూటమి పొత్తుల్లో డివిజన్లలో అభ్యర్థిత్వం దొరకని కూటమి పార్టీల్లోని కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగి 8 చోట్ల హవా కొనసాగించడం విశేషం. టీడీపీ నుంచి బరిలో దిగిన స్వతంత్రులు ఐదుగురు ఉన్నట్టు సమాచారం.
నూజివీడులో టీడీపీ సంపూర్ణ ఆధిక్యం
నూజివీడు కోట టీడీపీ జెండా రెపరెపలాడింది. పురపాలక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి సంపూర్ణ ఆధిక్యత సాధించింది. మంత్రి కొలుసు సార్థసారథి తన కుటుంబ సభ్యుల సహకారంతో ప్రచార బాధ్యతలు, ఎన్నికల ప్రణాళికలతో సంపూర్ణ విజయం సాధించారు. కూటమి పార్టీలతో కలిసి వారికి అన్నివిధాల సహకరిస్తూ ఎన్నికలు నిర్వహించారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు. గత పురపాలక ఎన్నికలలో 33 వార్డులకు కేవలం ఎనిమిది వార్డులలో మాత్రమే టీడీపీ గెలిచింది. తాజా ఎన్నికలలో కూటమి అభ్యర్థులు 23 వార్డుల్లో గెలిచారు. 36వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఆమె టీడీపీ మాజీ కౌన్సిలర్ కావడంతో తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు సమాచారం. వైసీపీ 12 వార్డులకు పరిమితమైంది. గతంలో నూజివీడు పట్టణంలో టీడీపీ, వైసీపీ కంటే వెనకబడి ఉండేది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు, జనసేన, బీజేపీతో కలిసి బలం నిలుపుకోవడానికి పురపాలక ఎన్నిక ఉపయోగపడింది. కూటమి శ్రేణుల సహకారంతో అభ్యర్థులకు మంచి మెజార్టీలే వచ్చాయి.
జంగారెడ్డిగూడెం టీడీపీ వశం
జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది.స్ధానిక వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్ధితో పాటు 32 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు కూటమి అభ్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి గాలితో పట్టణంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్ధి రొంగల అనూషతో పాటు ఇరవైస్ధానాల్లో టీడీపీ అభ్యర్ధులు,ఆరు స్ధానాల్లో జనసేన అభ్యర్ధులు,ఒక స్ధానంలో బీజేపీ అభ్యర్థితో మొత్తం 27 స్ధానాలు గెలుపొందారు.అలాగే రెండు వార్డుల్లో టీడీపీ రెబల్ అభ్యర్ధులుగా పోటీ చేసిన రెండు స్ధానాలు కూడా గెలుపొందాయి.వైసీపీ కేవలం మూడు స్ధానాలకే పరిమితమయ్యాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి,సంక్షేమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సీ,జాబ్ క్యాలెండర్ తీయడం,ప్రతీ ఏటా డిఎస్సీ తీస్తానని ప్రభుత్వం హామీ ఇవ్వడం వంటి ఎన్నో విషయాలు కూటమి అభ్యర్ధుల గెలుపుకు ప్రధాన కారణమయ్యాయి.పట్టణంలో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణం,రూ.101 కోట్లతో ఎర్రకాలువ జలాశయం నుంచి పట్టణంలోని ప్రతీ ఇంటికి మంచినీటి పధకం,హామ్ ద్వారా మంజూరైన రూ.19కోట్లతో చేయనున్న అభివృద్ధి పనులు వంటి పనులు కూడా కూటమి గెలుపుకు కారణం అయ్యాయి.
అప్పలనాయుడు మెజారిటీ 44,661
ఏలూరు నగర మేయర్‌గా కూటమి బలపర్చిన జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు, గంటా మోహన్ రావు(వైసీపీ)పై 44,661 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. ఏలూరు మండలం వెంకటా పురం ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్‌గా పనిచేసిన అప్పలనాయుడు తాజాగా మేయర్ పీఠం ఎక్కనున్నారు. సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కలెక్టర్ వెట్రి సెల్వి పర్యవేక్షణలో మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. రాత్రి 8.45 గంటలకు లెక్కింపు అనంతరం విజేతలను ప్రకటించారు.
రొంగల అనూష మెజారిటీ 7,572
జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థి రొంగల అనూష 7572 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్ధి మేకా సత్యవతికి 10,516 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి కణితి నీలిమకు 65 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునకాల రేణుకకు 170 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. ఆర్డీవో ఎంవి.రమణ ఓట్ల లెక్కింపు పర్యవేక్షించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు శేఖర్‌బాబు కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఇళయరాజా మెజారిటీ 4015
నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి బర్రె ఇళయరాజా 4015 ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి కంచర్ల లవకుమార్‌పై విజయం సాధించారు. పట్టణం లో 42,952 ఓట్లు ఉండగా 31,251 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి ఇళయరాజాకు 16701 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కంచర్ల లవకుమార్‌కు 12,686 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల బాలకోటేశ్వరికి 1018 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఇందుపల్లి సత్యప్రకాష్‌కు 421, సారధికి 166, చెలికాని వెంకటేష్‌కు 21 ఓట్లు, నోటాకు 201, చెల్లని ఓట్లు 37 పోల్ అయ్యాయి.