కూటమిలో టిక్కెట్ల టెన్షన్..
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:51 PM
జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీ లు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
వైసీపీలో అభ్యర్థుల కరువు!
ఆరేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో పెరిగిన ఆశావహులు
నాలుగు మున్సిపాలిటీల్లోనూ ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీ లు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత ఆరేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో తాజా ఎన్నికల్లో పోటీకి ఆశావహులు క్యూ కడుతు న్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కూటమిలో చైర్మన్, కౌన్సి లర్ టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఆశావహులను సంతృప్తి పరచడం నేతలకు సవాల్‌గా మారింది. మరోవైపు పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష వైసీపీలో మాత్రం చాలాచోట్ల నాయకత్వ లేమితో అభ్యర్థులు కరువై నైరాశ్యం అలుముకుంది.
భీమవరం: మహిళా పీఠం కోసం కుస్తీ
జనరల్ మహిళకు కేటాయించిన భీమవరం చైర్‌పర్సన్ స్థానం కోసం కూటమిలో నలుగురు పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరిని ఎంపిక చేసేందుకు జనసేన నేతలు కుస్తీ పడుతున్నారు. ఇక్కడ వార్డుల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. మొత్తం వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి 24, జనసేనకు 23, బీజేపీకి ఐదు చొప్పున కేటాయించారు. అయితే టీడీపీలో 32 మంది బలమైన ఆశావహులు ఉండటంతో ఎనిమిది మందికి టిక్కెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వైసీపీ పూర్తిగా డీలా పడి, కౌన్సిలర్ అభ్యర్థుల కోసం గాలిస్తోంది.
తాడేపల్లిగూడెం: చైర్మన్ ఖరారు.. కౌన్సిలర్లపై కన్‌ఫ్యూజన్
తాడేపల్లిగూడెం కూటమి చైర్మన్ అభ్యర్థిగా జనసేనకు చెందిన పాలూరి వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే బొలిశెట్టి అధికారికంగా ప్రకటిం చారు. అయితే కూటమిలో వార్డుల పంపకంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కౌన్సిలర్ టిక్కెట్ల కోసం మూడు పార్టీల ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పరిషత్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఇక్కడ కొంత ఆశతో ఉంది. మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని తమ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవడంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది.
తణుకు: ఎమ్మెల్యే ఆరిమిల్లి వ్యూహం
తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పక్షాలను కలుపుకుపోతూ ఏకపక్ష విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటించనుంది. కౌన్సిలర్ అభ్యర్థుల బలాబలాలపై టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహిస్తోంది. టీడీపీలోని అసంతృప్తులు తమకు కలిసొస్తాయని వైసీపీ ఆశ పడుతున్నా.. అభ్యర్థుల వేటలో ఆ పార్టీ వెనుకబడింది.
పాలకొల్లు: మంత్రి నిమ్మలదే తుది నిర్ణయం
పాలకొల్లులో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక మంత్రి నిమ్మల రామానాయుడు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో రెబల్స్ బెడద పొంచి ఉంది. ఇప్పటికే రోజారమణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. పరిషత్ పోరులో భారీ పరాజయం మూటగట్టుకున్న వైసీపీ.. ఇక్కడ కనీసం అభ్యర్థులను సైతం ఎంపిక చేయలేని కష్టకాలంలో ఉంది.