మునిసిపోల్స్‌కు సై
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:53 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉత్కంఠకు తెర దించింది. విలీన గ్రామాల సమస్యతో సతమతం అవుతూ వస్తున్న మునిసిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయింది. వార్డుల పునర్విభజనకు ఆదేశాలు జారీ చేసింది.
ఉత్కంఠకు తెరదించిన ప్రభుత్వం
వార్డుల పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్
ఈనెల 16న తుది నోటిఫికేషన్
( భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ఉత్కంఠకు తెర దించింది. విలీన గ్రామాల సమస్యతో సతమతం అవుతూ వస్తున్న మునిసిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయింది. వార్డుల పునర్విభజనకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మునిసిపాల్టీలల్లో వార్డులను విభజించనున్నారు. మిగిలిన గ్రామాలను కలుపుకుని వార్డులను పెంచనున్నారు. ఇదివరకే 2011 జనాభా ప్రాతిపదికన జిల్లాలోని నరసాపురంతో పాటు ఆకివీడు నగర పంచాయతీలో వార్డులను విభజించారు. మిగిలిన నాలుగు మునిసిపాల్టీల్లో న్యాయపరమైన చిక్కులతో విభజన పక్రియ చేపట్టలేకపోయారు. ఇటీవల హైకోర్టులో కేసులు కొట్టివెయ్యటంతో జిల్లాలోని నాలుగు మునిసిపాల్టీలకు మార్గం సుగమం అయింది. స్వల్ప వ్యవధిలోనే వార్డుల పునర్విభజన హద్దులతో సహా నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని ప్రభుత్వం దిశా నిర్ధేశం చేసింది. అందుకోసం కొన్ని ప్రామాణికాలను సూచించింది. వార్డుల మద్య జనాభా వ్యత్యాసం అధికంగా ఉండ కూడదని స్పష్టం చేసింది. ఓటర్ల వత్యాసం 10 శాతం మించి ఉండరాదని తేల్చి చెప్పింది. ఆ దిశగానే జిల్లాలోని నాలుగు మునిసిపాల్టీల్లో బుధవారం వార్డుల విభజన చేపట్టారు. వారం రోజులపాటు ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. వాటితో కలిపి మునిసిపాల్టీ వార్డుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు, మునిసిపల్ డైరెక్టర్‌కు పంపనున్నారు. ఈ నెల 15న కలెక్టర్ డీఎంఏ నుంచి విభజించిన వార్డుల వివరాలు అందనుంది. ఆ మరుసటి రోజే అంటే అక్టోబరు 16న పెరిగిన వార్డులతో నోటిఫికేషన్ జారీ చెయ్యనున్నారు. అదే ఫైనల్ జాబితా. గతంలో వార్డుల విభజనకు దాదాపు 50 రోజుల సమయం ఇచ్చారు.ప్రస్తుతం విలీన గ్రామాలతో ఉన్న మునిసిపాల్టీలకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. మునిసిపాల్టీల్లో వార్డుల సంఖ్యను కూడా ప్రభుత్వమే నిర్ధారించింది. ఆ మేరకు మునిసిపల్ కమిషనర్లు చర్యలు తీసుకున్నారు.
ఆశావహుల్లో జోష్
వార్డుల పునర్విభజన కోసం ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూసారు.మునిసిపల్ చైర్మన్‌మొదలకుని, కౌన్సిలర్ల వరకు ఆశలు పెట్టుకున్న నాయకుల పునర్విభజనపై ఉత్కంఠతో ఉన్నారు. పోటీ చేసేందుకు తమ ప్రయాత్నాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గ నేతల నుంచి రాష్ట్ర నేతల వరకు కలుసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మునిసిపల్ ఎన్నికల వేడి అందుకుంది.
వార్డుల పెంపుతో అవకాశాలు
మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరిగితే కౌన్సిలర్‌ల సంఖ్య పెరుగుతుంది. ఆశా వహులకు ఎన్నికల్లో అవకాశాలు మెరుగు పడనున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సి పాలిటీల్లోనూ ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్య పెరగడంతో పాటు, సరిహద్దులు మారను న్నాయి. వార్డుల విభజన అనం తరం ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను ప్రచురించనున్నారు. అనంతరం రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.
మున్సిపాలిటీ ప్రస్తుత వార్డులు పెరిగిన తర్వాత
భీమవరం 39 52
తాడేపల్లిగూడెం 35 48
తణుకు 34 44
పాలకొల్లు 31 44