పుర ఎన్నికలకు లైన్ క్లియర్
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:46 AM
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు, రాజకీయపక్షాల్లో వేడి రాజు కోనుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికలకు మొగ్గుచూపడంతో పోటీపడే అభ్యర్థుల సంఖ్య పురాల్లో పెరిగింది.
వార్డులు, డివిజన్ల పెంపునకు పచ్చజెండా
ఆశావహుల్లో నెలకొన్న జోష్
ఇక రిజర్వేషన్ల్లు, నోటిఫికేషన్ల విడుద లే తరువాయి
పురపోరు..ఆషామాషీ కాదు.!
ప్రత్యక్ష విధానంలో చైర్మన్ ఎన్నిక.. రాజకీయ పార్టీలకు సరికొత్త సవాల్
మారనున్న లెక్కలు.. ఓటరుకు రెండు ఓట్లు.. క్రాస్ ఓటింగ్ ముప్పు..
(ఏలూరు/టూటౌన్/జంగారెడ్డిగూడెం రూరల్–ఆంధ్రజ్యోతి)
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు, రాజకీయపక్షాల్లో వేడి రాజు కోనుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికలకు మొగ్గుచూపడంతో పోటీపడే అభ్యర్థుల సంఖ్య పురాల్లో పెరిగింది. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఉంటుంది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో, నగరపంచా యతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను హైకోర్టులో సవాల్ చేయగా, దీనిపై దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పుర ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కానున్నారు. ఇదిలా ఉండగా పురాల రిజర్వేషన్లు త్వరలో ఖరారయ్యే అవ కాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగర పంచా యతీ ల్లో ఎన్నికల విషయంలో ముందుకెళ్లేది.. లేనిదీ? ఈ నెల 15వ తేదీలోగా నగర పంచాయతీల్లో ఎన్నికలపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉందని సమాచారం. దీంతో చింతలపూడికి లైన్‌క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
వార్డులు, డివిజన్ల పెంపు కసరత్తు
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌లో 50వ డివిజన్ల స్థానంలో 62 డివిజన్లు, నూజివీడులో 32 నుంచి 36, జంగారెడ్డిగూడెంలో 29 నుంచి 32 వార్డులకు పెంపు జరగనున్నాయి. ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధ చేస్తున్నారు. రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తయితే పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేయనున్నారు. ప్రతి మున్సిపాల్టీల్లోను ఎన్నికల నిర్వహణకు అధికారులు, రిటర్నింగ్ అధికారుల నియామకాలు జరగనున్నాయి. ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏలూరు నగరపాలక ఎన్నికలకు సన్నద్దం
ఏలూరు నగరపాలక సంస్థ పాలక మండలి ఎన్నిలకు రంగం సిద్ధమైంది. 2005లో ఏలూరు మున్సిపాల్టీ నగరపాలక సంస్థగా అవతరించింది. జనాభా ప్రతిపాదికన నగరాన్ని 50 డివిజన్లుగా విభ జించారు. 2021 సమీప ఏడు గ్రామాలు నగరంలో విలీనం కావడతో జనాభా పెరిగిన కారణంగా డివి జన్ల పెంపు అనివార్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏలూరు నగరంలో 2లక్షల 17వేల మంది ఉండగా విలీన గ్రామాలతో కలిసి ప్రస్తుత జనాభా 2లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఓటర్లు 2లక్షల 35వేల మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జనాభా దామాషా ప్రకారం వార్డుల పునఃవిభజన చేయాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 50 డివిజన్లుగా ఉన్న
నగరాన్ని 62 డివిజన్లుగా విభజిం చారు. డివిజన్ల పునఃవిభజన హేతుబద్ధంగా జరగలే దంటూ కొందరు వైసీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు. వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వి 50 కేసులు వేశారు. ఈ కేసులన్నిటిని ఈనెల మూడోతేదీన హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్రవ్యాప్తం గా మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వార్డుల పునఃవిభజన వివరాలను మున్సిప ల్ డైరెక్టర్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. 4వ తేదీ నుంచి డివిజన్ల పునఃవిభజన వివరాలను ప్రదర్శించి 11వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. 12న సవరించిన వార్డుల పునఃవిభజన వివరాలు పురపాలక శాఖ డైరెక్టర్‌కు సమర్పించాలి. 13న డీలిమిటెషన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. 14న ఏపీ గేజిట్‌లో ప్రభుత్వం ప్రచురణ చేస్తుంది.
పురపోరు..ఆషామాషీ కాదు.!
స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముంచు కొస్తున్న కొద్దీ జంగారెడ్డిగూడెంతో పాటు మిగిలిన మునిసిపాలిటీల్లో రాజకీయం వేడెక్కుతోంది. మున్సి పల్ ఎన్నికలు ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పుడు మరోఎత్తు అన్న రీతిలో పరిస్థితి వుంది. గతంలో వార్డు కౌన్సిలర్ల గెలుపోటములపై చైర్మన్ పీఠం ఆధారపడేది. కానీ ఇప్పుడు చైర్మన్‌ను ఓటర్లే నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష విధానం అమలు చేయనుం డడంతో పురపోరు ఆసక్తికరంగా, సవాల్‌గా మార బోతోంది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీదే పైచేయి అనే నానుడిని ఈ నూతన విధానం కొన సాగిస్తుందా..? లేక తిరగ రాస్తుందా.. అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.
గతంలో కౌన్సిలర్లదే కీలక పాత్ర
గత ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తే మున్సిపల్ పరిధిలో ప్రతి ఓటరుకు ఒక ఓటే ఉండేది. ఓటరు తమ వార్డు పరిధిలో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థికి మాత్రమే ఓటు వేసేవారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే ఆ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కేది. గెలిచిన కౌన్సిలర్లు తమ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు చైర్మన్‌ను ఎన్నుకునే వారు. రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కేవలం వార్డుల వారీగా బలమైన కౌన్సిలర్ అభ్యర్థులను నిలబెట్టడం, వారిని గెలిపించుకోవడం చుట్టూనే తిరిగేవి. వార్డు స్థాయిలో అభ్యర్థికి ఉన్న బలం, స్థానిక సమీకరణాలే చైర్మన్ పీఠాన్ని నిర్ణయించేవి. అయితే ఇప్పుడు లెక్క లు మారాయి. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునేలా నూతన విధానం అమలు చేయనుండడంతో సమీ కరణాలు మారనున్నాయి. ప్రతి ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు తమ వార్డులో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థికి, రెండవ ఓటు మున్సిపాలిటీకి చైర్మన్‌గా పోటీ చేసే అభ్యర్థికి వేయాల్సి ఉంది. ఈ ‘రెండు ఓట్ల విధానం’ రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థి కేవలం తన వార్డు పరిధిలో 1,500 నుంచి 2,000 మంది ఓటర్లపై దృష్టి సారిస్తే సరిపోతుంది. కానీ చైర్మన్‌గా పోటీ చేసే అభ్యర్థి పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు ప్రతి వార్డులో ప్రచారం, ఓటర్లను కలుసు కోవడం వారికి ఆర్థికంగా, శారీరకంగా భారంగా మారనుంది.
క్రాస్ ఓటింగ్ గండం
ఒకే ఓటరు కౌన్సిలర్‌గా తమ వార్డులోని ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేసి, చైర్మన్ విషయానికి వచ్చేసరికి వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేసే (క్రాస్ ఓటింగ్) అవకాశాలు లేకపోలేదు. ఇది ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయనుంది. జంగారెడ్డిగూడెంతో పాటు మిగిలిన పురాల్లో పీఠాన్ని దక్కించుకోవడానికి రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలం, పార్టీల వ్యూహాలు అత్యంత కీలకం కానున్నాయి. నూతన రాజకీయ సమీకరణాల మధ్య ఏ పార్టీ జెండా ఎగురవేస్తుంది? ఓటర్లు క్రాస్ ఓటింగ్ వైపు మొగ్గు చూపి అధికార పక్షానికి షాక్ ఇస్తారా.. లేక అధికార కూటమికే ఏకపక్ష విజయాన్ని కట్టబెడతారా అనేది వేచి చూడాల్సిందే.