మున్సిపల్ ఎన్నికలపై ముందుకే..
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:05 AM
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చింది. విలీన గ్రామాల సమస్య వున్న మున్సిపాలి టీలకు సైతం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణ యించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించడంతో ఆశావహుల్లో జోష్ నింపింది.
రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ
నూజివీడు, జంగారెడ్డిగూడెంలలో నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు
బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు
ఏలూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చింది. విలీన గ్రామాల సమస్య వున్న మున్సిపాలి టీలకు సైతం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణ యించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించడంతో ఆశావహుల్లో జోష్ నింపింది. మరోవైపు పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధం కావాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ బుధవారం జీవో జారీచేశారు.
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సి పాల్టీలతోపాటు చింతలపూడి నగర పంచాయతీ ఉన్నాయి. గత నెలాఖరునే ఏలూరు పాలకవర్గం గడువు ముగిసింది. చింతలపూడి నగర పంచాయతీ ఎన్నిక విషయంపై కోర్టులో స్టే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నగర పంచాయతీల్లో స్టే వెకేట్ చేశాక ఇక్కడ ఎన్నికలకు జీవో జారీ కానుంది. తాజాగా 87 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి నూజివీడు, జంగారెడ్డిగూడెంల్లో పాలక వర్గాల గడువు ముగిసిన విషయం విదితమే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితాల నిర్వహణ, కేబినెట్ ఆమోదించిన బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్ల అమలు, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయడం తదితర ఏర్పాట్లతో అధికారులు సన్నద్ధం కానున్నారు. ఇప్పటికే సెప్టెంబరు 3న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. డోర్ నంబర్ల వారీగా ఓటర్ల జాబితాల విభజన జరుగుతోంది. నూజివీడులో 36, జంగారెడ్డిగూడెంలో 32 వార్డులకు పెరగనున్న నేప థ్యంలో సరిహద్దుల విభజన, వార్డుల మార్పు ప్రకారం ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే పనిలో కమిషనర్లు వున్నారు. మరోవైపు కొన్ని రోజుల్లో పురపాలక సంఘాల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు అమలుచేసే అవ కాశం వుంది. కాగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం మరో జీవో విడుదల చేయనుంది. ఓవరాల్‌గా కాల పరిమితి ముగిసిన కార్పొరేషన్లను అధికారులు నోటిఫై చేస్తున్నారు. అక్టోబరులో ఎన్నికలు నిర్వహణ వుంటుందని తేల్చి చెప్పడంతో కార్పొరేషన్లకు విడిగా జీవో విడుదల చేయనున్నారు. ఇక్కడ కూడా ఓటర్ల జాబితాల ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికలక కమిషనర్‌కు కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టీకీరణ
ఏలూరు సిటీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి బుఽధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి సమీకరణ, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లపై పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 541 పంచాయతీల్లోని 5,664 వార్డులలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.