Share News

వార్డుల్లో సర్దు'పోట్లు'

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:04 AM

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసినా.. జిల్లాలోని కూటమి పక్షాల మధ్య వార్డుల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు.

వార్డుల్లో సర్దు'పోట్లు'
భీమవరంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల క్యూ

మునిసిపాలిటీల్లో పోటాపోటీగా ఆశావహుల నామినేషన్లు

చైర్మన్ల అభ్యర్థులపై ఏకాభిప్రాయం.. కౌన్సిలర్‌ సీట్లపైనే చిక్కుముడి

భీమవరం, తాడేపల్లిగూడెంలో వీడని ఉత్కంఠ..

తణుకులో బీ ఫారం వారికే ఛాన్స్‌

ఉపసంహరణ నాటికి కొలిక్కి వస్తుందని ఆశిస్తున్న నాయకత్వం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసినా.. జిల్లాలోని కూటమి పక్షాల మధ్య వార్డుల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణు కు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో కూటమి అధిష్ఠానం నిర్ణయించిన చైర్మన్‌, చైర్‌పర్సన్‌ అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. కానీ, కౌన్సిలర్‌ వార్డుల్లో మాత్రం సయోధ్య రాలేదు. ఆశావహులు పార్టీ నిర్ణయాలను పక్కనబెట్టి తమకు తోచిన చోటల్లా పోటా పోటీగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి పరిస్థితి సద్దుమణు గుతుందన్న భావనలో నేతలు ఉన్నారు.

భీమవరంలో కేంద్ర మంత్రి అసంతృప్తి

భీమవరంలో వార్డుల సర్దుబాటు అంతా సయోధ్యగానే జరిగిందని భావించినా చివర్లో బెడిసికొట్టింది. ఇక్కడ తెలుగుదేశం 24, జనసేన 23, బీజేపీ ఐదు వార్డుల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే రెండు వార్డుల విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య సర్దుబాటు కుదరలేదు. టీడీపీ ఇన్‌ఛార్జి తోట సీతారామలక్ష్మి స్థానికంగా ఉంటున్న వార్డును బీజేపీ కోరుతుండగా.. అక్కడ టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ వేశారు. దీంతో అధికారికంగా కేటాయించిన వార్డులను కాదని బీజేపీ అత్యధిక చోట్ల నామినేషన్లు వేయగా, ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థు లు బరిలోకి దిగారు. బీజేపీకి ఇచ్చిన వార్డు లపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఒంట రిగా గెలుపొందే సత్తా తమకు ఉందని ప్రకటించారు. టీడీపీ, జనసేన మాత్రం ముందుగా నిర్ణయించుకున్న స్థానాల్లోనే నామినేషన్లు వేసుకున్నాయి. ఉపసంహరణ నాటికి అంతా సర్దుమణుగుతుందని పార్టీల కేడర్‌ భావిస్తోంది.

తాడేపల్లిగూడెంలో వీడని ఉత్కంఠ

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో సీట్ల పంపకం మొదటి నుంచి ఉత్కంఠగానే సాగుతోంది. నామినేషన్లకు ఒక్కరోజు ముందు టీడీపీ 22, జనసేన 22, బీజేపీ నాలుగు వార్డుల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. కానీ, సోమవారం నాటికి పరి స్థితి మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీకి కేటా యించిన 22వ వార్డును మార్చాలని ప్రతి పాదన తెచ్చారు. స్థానిక 16 వార్డును టీడీపీ, జనసేన కోరుతుండటంతో ఇరు పార్టీల మధ్య పీటముడి పడింది. సీటు లభించని ఆశావహులు ఎవరికి తోచినచో ట వారు ఆయా పార్టీల తరపున నామినేష న్లు వేసేశారు. ఉపసంహరణ నాటికి లెక్క లు తేలకపోతే ప్రతిపక్షానికి లాభిస్తుం దన్న ఆందోళన కేడర్‌లో ఉంది. చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక సజావుగానే జరిగినా, కౌన్సిలర్ల విషయంలోనే ఇబ్బందులు వస్తున్నాయి.

తణుకులో.. బీ ఫారం ఎవరికిస్తే వారికే!

తణుకు మున్సిపాలిటీకి సంబంధించి కూటమి అధిష్ఠానం నిర్ణయించిన బసవా రామకృష్ణ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. వార్డుల్లో మాత్రం స్పష్టత లేదు. ఇక్కడ అన్ని పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. స్థానిక నేతలు పరిషత్‌, పంచాయతీ ఎన్నికల హడావుడి నుంచి తేరుకోకముందే మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. కౌన్సిలర్‌ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు పడ్డాయి. ఉపసంహరణ సమయానికి పార్టీ బీ ఫారం ఎవరికి ఇస్తే వారినే అధికారిక అభ్యర్థిగా పరిగణించాలని నాయకత్వం నిర్ణయించింది.

పాలకొల్లులో ఒక్క వార్డులోనే పేచీ

పాలకొల్లులో మొత్తం 44 వార్డులు ఉండగా.. దాదాపు అన్నిచోట్లా కూటమిలో సయోధ్య కుదిరింది. టీడీపీ 33, జనసేన ఏడు, బీజేపీ మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేశాయి. అయితే 34వ వార్డులో మాత్రం ఒకే అభ్యర్థి టీడీపీ, జనసేన పార్టీల నుంచి నామినేషన్‌ వేశారు. కూటమి నిర్ణయం మేరకు ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేది తేలనుంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అధిష్ఠానం ఉషారాణి పేరును ఖరారు చేసింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఇక్కడి 34వ వార్డు వివాదం కూడా కొలిక్కి రానుంది.

పురాల్లో ముగిసిన నామినేషన్లు

భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మునిసిపాలిటీల్లోని నాలుగు చైర్మన్‌, 190 వార్డు కౌన్సిలర్లకు గాను నా మినేషన్ల గడువు సోమవారం ముగియ డంతో అభ్యర్థులు పోటెత్తారు. నాలుగు చైర్మన్లకు 56 మంది, 190 వార్డులకు 1192 మంది నామినేషన్లు దాఖలు చేశా రు. మంగళవారం వీటిని పరిశీలిస్తారు. ఉపసంహరణ గడువు గురువారం వరకు ఉంది. అప్పటికి భారీగానే వైదొలగవచ్చు.

Updated Date - Nov 17 , 2026 | 12:04 AM