Share News

అధ్యక్షా.. ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయాం..

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:48 AM

మునిసిపల్‌ పాలకవర్గం గడువు ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఎన్నికైన 31 మంది కౌన్సిలర్ల ఐదేళ్ల కాల పరిమితి పూర్తికానుంది.

అధ్యక్షా.. ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయాం..

కొద్ది గంటల్లో ముగియనున్న

మునిసిపల్‌ పాలకవర్గం కాలపరిమితి

జిల్లాలో నరసాపురంలోనే పాలకవర్గం

అభివృద్ధిపై కౌన్సిలర్ల అసంతృప్తి

18 నుంచి ప్రత్యేకాధికారి పాలన

మునిసిపల్‌ పాలకవర్గం గడువు ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఎన్నికైన 31 మంది కౌన్సిలర్ల ఐదేళ్ల కాల పరిమితి పూర్తికానుంది. జిల్లాలో ఒక్క నరసాపురం పురపాలక సంఘానికి మాత్రమే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరిగాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలు ప్రత్యేకాధికారి పాలనలో ఉన్నాయి. ఆకివీడు నగర పాలక సంస్థ పాలకవర్గం గడువు ఇంకా ఉంది.

నరసాపురం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పాలకవర్గం గడువు ఈ నెల 16న ముగియనుంది. కొద్ది గంటల్లో అందరూ మాజీలు కానున్నారు. 18న ప్రత్యేకాధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో పట్టణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చాలా మంది కౌన్సిలర్లు పూర్తిస్థాయిలో పనులు చేయలేకపోయామన్న అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ కౌన్సిలర్ల వార్డుల్లోనే పనులు జరిగాయి. ప్రతిపక్ష సభ్యుల వార్డుల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వార్డుల్లో కొన్ని పనులు చేపట్టింది. గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లకు కొంత సంతృప్తి మిగిలింది. మొత్తంగా పాలకవర్గం చేపట్టిన పనులన్ని అసంతృప్తిగానే మిగిలాయని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా కంపోస్టుయార్డు సమస్య పెండింగ్‌ పడింది. సుమారు రూ 3.70 కోట్లతో స్థలం కొనుగోలు చేసినా నిరుపయోగమైంది. దీంతో నిధులు వృదా అయ్యాయి. ప్రస్తుతం పురపాలక సంఘానికి చెత్త వేసుకునేందుకు కంపోస్టుయార్డు లేకుండా పోయింది.

పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కారానికి అమృత్‌ స్కీమ్‌లో భాగంగా రూ.80 కోట్లు మంజూరు చేశారు. 8లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు ఓహెచ్‌ఆర్‌లకు రెండు పూరి కాగా మరొకటి పెండింగ్‌. పూర్తయిన రెండింటికి పైప్‌లైన్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయలేదు.

పట్టణ ప్రజలకు ఒక ఒపెన్‌ ధియేటర్‌ ఉండాలన్న ఉద్దేశంతో సుమారు రూ.2.50 కోట్లతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కార్యాలయానికి సమీపంలో విలువైన స్థలంలో చేపట్టిన ఈ పనులు మూడేళ్లు గడిచినా పూర్తి కాలేదు.

పట్టణంలోని సుమారు 4వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి నాలుగేళ్లు గడిచింది. నేటికి స్థల పూడిక పనులు పూర్తికాలేదు. కొన్ని స్థలాలు మాత్రమే పూడ్చి చేతులు దులుపుకున్నారు.

ఐదుగురు కమిషనర్లు..

ఐదేళ్లలో మునిసిపాల్టీలో ఐదుగురు కమిషనర్లు మారారు. ఇక ఇంజనీర్‌ విభాగంలో బదిలీల లెక్క ఎక్కువే. ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒక్కొక్క వార్డులో రూ 20లక్షల పనులు

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయంటే గడపగడపకు పర్యటనల్లో భాగంగా వార్డుల్లో రూ.20లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో సీసీ రహదార్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఇవి కాకుండా వార్డు సచివాలయాలకు భవనాలు నిర్మించారు. నాడు నేడు స్కీమ్‌లో పాఠశాల భవనాలు అభివృద్ధి చెందాయి.

విపక్షాలను తొక్కేశారు

గత ప్రభుత్వ హయాంలో విపక్షాలపై పక్షపాత ధోరణితో వ్యవహరించారు. సమస్యలను పరిష్కరించలేదు. తాగునీటి సమస్య కోసం రూ 2.50 కోట్లతో ఒక ఓహెచ్‌ఆర్‌ పనులు పూర్తికాలేదు. అయితే కూటమి వచ్చిన తరువాత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి సుమారు రూ 50లక్షలు ఖర్చు పెట్టాం. ఇందులో ఎంపీ నిధులు కూడా ఉన్నాయి. వార్డులో ప్రధాన సమస్య అయిన రైల్వే ఫుట్‌ ఓవర్‌ వంతెన మంజూరు చేయించాం. దీనికి రూ 6.70 కోట్లు కేంద్రం ఇచ్చింది.

పాలూరి బాబ్జీ, టీడీపీ కౌన్సిలర్‌

కొవిడ్‌ వల్ల పనులు చేయలేకపోయాం

వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కొవిడ్‌ వల్ల రెండేళ్లు వృథా అయింది. ఐదేళ్లలో కాలనీలో సుమారు రూ 1.60 కోట్ల విలువైన పనులు చేశాం. ఆదర్శనగర్‌లో డ్రెయినేజీలు, రోడ్లు, వైఎస్సాఆర్‌ కాలనీలో సీసీ రహదార్లు నిర్మించాం. ఇది కాకుండా మా హయాంలో ఏరియా ఆస్పత్రి 100 పడకల స్థాయికి పెరగడం సంతృప్తినిచ్చింది.

యర్రా ఉమా శ్రీనివాస్‌, 26వార్డు కౌన్సిలర్‌

Updated Date - Mar 16 , 2026 | 12:48 AM