కౌంట్‌డౌన్..
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:20 AM
మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నరసాపురం మునిసిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
నరసాపురంలో వైఎన్ కాలేజీ, ఆకివీడు
జడ్పీబాలురున్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
ముందుగా కౌన్సిలర్లు, తరువాత చైర్‌పర్సన్
రెండు రౌండ్లలో కౌన్సిలర్లు, ఒక రౌండ్‌లో చైర్‌పర్సన్ ఫలితాలు
అభ్యర్థితో పాటు ఏజెంట్‌కు మాత్రమే అనుమతి
రెండు పట్టణాల్లో 30 సెక్షన్ అమలు
నరసాపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నరసాపురం మునిసిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రెండు రౌండ్లలో కౌన్సిలర్, సింగిల్ రౌండ్‌లో చైర్‌పర్సన్ ఫలితాలు ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నాటికి విజేతలెవరో తేలిపోనున్నది.నరసాపురం వైఎన్ కళాశాలలో రెండు రూమ్‌ల్లో 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్‌లో 18 మంది కౌన్సిలర్లను ప్రకటిస్తారు. వారికి పత్రాలను అందించిన తరువాత, మరో 18 వార్డులు ఫలితాలు లెక్కిస్తారు. వీరికి కూడా పత్రాలు అందించిన తరువాత చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్లు లెక్కించే విఽఽధంగా ఏర్పాటు చేశారు. ఈ ఫలితాలకు ముందు పోస్టల్ బ్యాలెట్‌ల ఓటింగ్ కౌంట్ చేశారు. కౌంటింగ్ జరిగే కాలేజీలో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ బాక్స్‌లన్నీ స్టాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి మంగళవారం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా బందోబస్తు మధ్య కౌంటింగ్ రూమ్‌లకు చేరుకుంటాయి. కౌంటింగ్‌కు మొత్తం రెండు రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక హాల్‌లో 13, మరో హాల్‌లో 5 వార్డుల ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ హాల్‌లోకి అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్‌లను అనుమతించరు. ఇప్పటికే సిబ్బందికి అదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌కు మొత్తం 115 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి వార్డుకు ఒక సూపర్‌వైజర్‌తో పాటు నలుగురు సహాయకులు విధులు నిర్వహించనున్నారు. పరిశీలనకు నలుగురు మైక్రో ఆడ్వజర్లును నియమించారు. మొత్తం 150 మంది పోలీస్‌ల్ని కౌంటింగ్ కేంద్రం వద్ద, పట్టణ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే కేంద్రాలను సోమ వారం ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ సుధాకర్‌రావు, సీఐ రఘు, కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఆర్వో మురళీలు పరిశీలించారు.
ఆకివీడులో ఇలా..
ఆకివీడు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఆకివీడు జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండు రూమ్‌లు, 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో 8 చైర్మన్‌కు, మరో 8 కౌన్సిలర్ల అభ్యర్థుల ఓటింగ్ లెక్కింపు జరుగుతుంది. ఎనిమిది వార్డుల అనంతరం మిగిలిన వార్డులు లెక్కిస్తారు. గెలుపొందిన వారికి పత్రాలు అందిస్తారు. కౌంటింగ్ జరిగే పాఠశాలలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతించరు. ప్రతీ వార్డుకు ఒక సూపర్‌వైజర్‌తో పాటు సహాయకులు విధులు నిర్వహించనున్నారు. మొత్తం 70 పోలీసులను నియమించారు. కౌంటింగ్ కేంద్రాన్ని కమిషనర్ కృష్ణమోహన్, తహసీల్దార్ వంశీ, పోలీసు అధికారులు పరిశీలించారు. సీఐ జి.కాళీచరణ్ సోమవారం స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్ దగ్గర 24 గంటలూ సాయుధ పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశామన్నారు.
సెక్షన్ 30 అమలు
ఎన్నికల నిబంధనల ప్రకారం నరసాపురం, ఆకివీడు పట్టణాల్లో సెక్షన్ 30ను అమలు చేస్తున్నారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి ఉండదు. డీజేలు, మైక్‌లకు కూడా అనుమతించరు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ సుధాకర్‌రావు హెచ్చరించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల అందరికీ ఈ సెక్షన్ గురించి ముందుగానే తెలియజేశారు.