Share News

మునిసిపోల్స్‌ ఎప్పుడో ?

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:11 AM

మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈనెల 16తో ముగియనుంది. ప్రత్యేక అధికారుల పాలన రానుంది. జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీకే గతంలో ఎన్నికలు నిర్వహించారు.

మునిసిపోల్స్‌ ఎప్పుడో ?

మార్చి 16తో ముగియనున్న పాలకవర్గాల గడువు

జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీలోనే కౌన్సిల్‌

నాలుగు పురపాలక సంఘాల్లో ఐదేళ్లుగా ప్రత్యేక అధికారులే ..

ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈనెల 16తో ముగియనుంది. ప్రత్యేక అధికారుల పాలన రానుంది. జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీకే గతంలో ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గం ఏర్పాటైంది. ఈ నెల 16తో గడువు ముగియడంతో తాజాగా నర్సాపురం మున్సిపాలిటీకి భీమవరం ఆర్డీవోను ప్రత్యేక అఽధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విలీన గ్రామాల సమస్యతో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీలు ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటిదాకా ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగింది.

ఎన్నికలకు ఎదురుచూపులు

మున్సిపల్‌ ఎన్నికలకు ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్‌పైనే ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి మార్చి తొమ్మిదో తేదీన మున్సిపాలిటీల ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఆ మేరకు ఆదేశాలు జారీచేసింది. రిజర్వేషన్‌ల ఖరారులో జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతో ఓటర్ల జాబితా ప్రచురణ ఉత్తర్వులను రద్దు చేశారు. నిజానికి గతంలో వార్డుల సరిహద్దులను ఎన్నికల సంఘం కోరింది. విలీన గ్రామాలను మినహాయించి పాత వార్డుల ఆధారంగానే హద్దులను నిర్ధారించి ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అదే తరహాలో నివేదిక వెళ్లింది. ఓటర్ల జాబితాను కూడా పాత వార్డుల ప్రకారమే ప్రకటించాలని మున్సిపల్‌ అధికారులు సన్నాహాలు చేసుకున్నారు. అంతలో ఎన్నికల సంఘం తమ ఆదేశాలను వెనక్కు తీసుకోవడంతో ఓటర్ల జాబితా ప్రకటన వాయిదా పడింది. మరోవైపు విలీన గ్రామాలకు ప్రత్యేకంగా మార్చి 18న జాబితా ప్రకటించడానికి సంబంధిత పంచాయతీల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సి పాలిటీలు సైతం విలీన గ్రామాలను మినహాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా పంచాయతీలే ఆస్తిపన్ను వసూలు చేసుకున్నాయి. కేవలం డ్వాక్రా సంఘాలు మాత్రమే మున్సిపాలిటీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి విలీన సమస్య ఒక కొలిక్కి రానుంది. తాజాగా అన్ని కోణాల్లోనూ కూటమి శ్రేణుల్లో చర్చ సాగుతోంది. పొత్తులో ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ ఖాతాలో చేరనుందోనని అందరిలోనూ ఒకింత ఉత్సుకత నెలకొంది. వైసీపీ మాత్రం సంస్థాగతంగా ఇబ్బందులు పడుతోంది. నియోజకవర్గ నాయకత్వ మార్పులు, చేర్పులతో మల్లగుల్లాలు పడుతోంది.

నరసాపురం ప్రత్యేకాధికారిగా ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి

నరసాపురం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): నరసాపురం మునిసిపల్‌ ప్రత్యేకాధికారిగా భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌ కుమార్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్‌ పాలకవర్గం గడువు ఈనెల 16తో ముగియనుంది. దీంతో పురపాలక సంఘాలకు ప్రభుత్వం కమిషనర్‌తో పాటు స్పెషల్‌ అధికారులను నియమించనుంది. జిల్లాలో ఒక్క నరసాపురం పురపాలక సంఘం మాత్రమే పాలకవర్గం కలిగి ఉంది. ఆకివీడు పాలకవర్గ సమయం ఇంకా ముగియలేదు.

Updated Date - Mar 11 , 2026 | 12:11 AM