Share News

విలీన గ్రామాలతోనే మున్సిపోల్స్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:13 AM

జిల్లాలో నాలుగు మునిసిపాలిటీల్లో విలీన గ్రామాల సమస్యతో ఎన్నికలు నిర్వహించ లేదు. ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.

విలీన గ్రామాలతోనే మున్సిపోల్స్‌

జిల్లాలో నాలుగు మునిసిపాలిటీల్లో విలీన గ్రామాల సమస్యతో ఎన్నికలు నిర్వహించ లేదు. ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గత ప్రభుత్వం చేపట్టిన విలీన ప్రక్రయ సక్రమంగా లేదంటూ కొందరు కోర్టుకు వెళ్లడతంతో స్టే విధించంది. విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..

నాలుగు మున్సిపాలిటీల్లో విలీన సమస్య

ఎన్నికలు లేక ప్రత్యేక పాలన

ఈసారి ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు

ఇప్పటికే నరసాపురం,

ఆకివీడుల్లో వార్డుల పెంపు

గ్రామాలను మినహాయిస్తే

ఎన్నికలు మరింత జాప్యం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురించారు. దాంతోనే ఎన్నికలు నిర్వహించ నున్నారు.అదేక్రమంలో మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది, ప్రస్తుతమున్న వార్డులను పెంచింది. జిల్లాలో నర్సాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలకు మాత్రమే వార్డులను పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. విలీన గ్రామాల సమస్య ఉండడంతో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో వార్డుల పెంపును వాయిదా వేసింది. ఫలితంగా ఎన్నికలపై అందరిలో సందిగ్ధత ఏర్పడింది. గతంలో ఎన్నికల సంఘం వార్డుల సరిహద్దులను పంపాలని ఆదేశించడంతో విలీన గ్రామా లను మినహాయించి నివేదిక ఇచ్చారు. ఎన్నికలు సైతం గ్రామాలను మినహాయించి నిర్వహిస్తారని అంతా ఆశించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ సైతం జిల్లా పర్యటనకు విచ్చేసినప్పుడు విలీన గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిస్తామని పలుమార్లు ప్రకటన చేశారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నాయని ప్రభుత్వం గ్రహించింది. గ్రామాలను మినహాయిస్తే 2027 వరకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలులేదని అధికారులు చెపుతున్నారు. ఈ ఏడాది ఎన్ని కలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. విలీన గ్రామాల గెజిట్‌ నోటిఫికేషన్‌పై హైకోర్టులో ఉన్న స్టేను తొలగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడే అన్ని మున్సిపాలిటీల తోనూ, విలీన సమస్య ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే వచ్చే ఏడాది నిర్వహించాలి. అప్పటిదాకా వాయిదా పడితే మున్సిపాలిటీ లకు నష్టం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండాపోతాయి

విలీనమైతే మేలే

గ్రామాలను విలీనం చేస్తే పట్టణ జనాభా పెరగనుంది. భీమవరం వంటి పురపాలక సంఘాలు కార్పొరేషన్‌ స్థాయికి వెళతాయి. గత ప్రభుత్వంలో గ్రామాల విలీనంలో ఏక పక్షధోరణికి పోయాయి. తమకు అనుకూల మైన విధంగా విలీనం చేశారు. తాడేపల్లిగూడెంలో పెంటపాడు, పెదతాడేపల్లి వంటి గ్రామాలు విలీనం కావాలి. వాటిని మినహాయించారు. ఇతర పంచాయతీలను విలీనం చేశారు. భీమవరంలో విస్సాకోడేరు. గొల్లల కోడేరు,పెద అమిరం పంచాయతీలు కూడా విలీనానికి అనుకూలం. కానీ అవి ఉండి నియోజకవర్గంలో ఉండడంతో వాటిని తప్పించారు. ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే అత్యధికంగా ఏడు గ్రామాలు విలీనమయ్యాయి. వాటిని కలుపుకొని కొత్త వార్డులను ప్రకటించారు. ఎన్నికల కోసం రిజర్వేషన్‌లను ఖరారు చేశారు.ఆ తరుణంలోనే విలీన గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. దాంతో ఎన్నికలు ఆగిపోయాయి. అప్పటినుంచి స్టే కొనసాగుతోంది. దానిని తొలగించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. పాలకవర్గాలు లేకుండానే ఐదేళ్లు గడచిపోయాయి. ప్రత్యేక అధికారుల పాలనతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటోంది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే పాలన గాడి తప్పనుంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అధికారులు ఏకపక్ష ధోరణకి పోతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. కనీసం మన్నన కూడా ఉండడం లేదంటూ వాపోతున్నారు. నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తున్నారు. మున్సిపాలిటీల్లో నిధులు ఎంత మేర సద్వినియోగం జరుగుతు న్నాయన్న విషయమై పారదర్శకత లేకుండా పోయింది. గతంలో అవతవకలపై ఇప్పుడు భీమవరం పురపాలక సంఘంలో విచారణ జరుగుతోంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే పాలనతో పాటు, అభివృద్ధి సవ్యంగా సాగనుంది.

విలీన గ్రామాలు ఇవే :

భీమవరం : రాయలం, చినఅమిరం, అనాకోడేరు, కొవ్వాడ అన్నవరం

తాడేపల్లిగూడెం : ప్రత్తిపాడు, ఎల్‌.అగ్రహారం, కుంచనపల్లి, బి.కొండేపాడు, పడాల

తణుకు : వీరభద్రపురం, వెంకటరాయపురం, పైడిపర్రు

పాలకొల్లు : పూలపల్లి, ఉల్లంపర్రు, పాలకొల్లు రూరల్‌, అడవిపాలెం, వర్ధనం, కొత్తపేట, భగ్గేశ్వరం, కొంతేరు

Updated Date - Apr 29 , 2026 | 12:13 AM