Share News

శరవేగంగా..

ABN , Publish Date - May 03 , 2026 | 12:35 AM

రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో పట్టాయిగూడెం గ్రామాన్ని ఎంపిక చేసి 69.5 ఎకరాలు సేకరించారు.

శరవేగంగా..
పట్టాయిగూడెం వద్ద ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్‌ పార్కుకు సిద్ధం చేసిన రోడ్లు

ఇండస్ట్రియల్‌ పార్కుకు స్థలం సిద్ధం

పట్టాయిగూడెంలో 69.5 ఎకరాల సేకరణ

70 శాతం మౌలిక సదుపాయాలు కల్పన

భూమి విలువతోనే పరిశ్రమల రాకకు జాప్యం

చింతలపూడి, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో పట్టాయిగూడెం గ్రామాన్ని ఎంపిక చేసి 69.5 ఎకరాలు సేకరించారు. ఈ గ్రామం రాష్ట్ర సరిహద్దులో ఉంది. దీనికి దగ్గరలోనే జాతీయ రహదారి, హైదరా బాదు, విశాఖకు వెళ్లే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఉన్నాయి. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాక్చర్‌ కార్పొరేషన్‌ ద్వారా సుమారు రూ.13.5 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాల్లో ప్రధానంగా పారిశ్రామిక వాడలో రోడ్లు, డ్రెయిన్‌, విద్యుత్‌, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పటికే జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి రోడ్ల నిర్మాణం జరిపారు. ఇందులో పరిశ్రమల స్థాపన కోసం ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ ఎన్‌ఆర్‌ఐలతో, హెటిరోడ్రగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతు న్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీల్లో మ్యాగీతో పాటు బయోమాస్‌డ్రిగ్స్‌, మెటల్‌కు సంబంధించిన పారిశ్రామిక వేత్తలు పరిశీలించారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్కులు అభివృద్ధి జరిగితే పరిశ్రమ లన్నీ పట్టణాల వైపు ఆధారపడకుండా పారిశ్రామిక వికేంద్రీకరణకు దోహదపడుతుందని, దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణ సౌకర్యాలు, ఆదాయ వనరులు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. అయితే జనవరి నాటికే మౌలిక సదుపాయాలు 70 శాతం పూర్తయ్యాయి. పారిశ్రామికవేత్తలు పరిశీలించి వెళ్తున్నప్ప టికీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాక పోవడం ఈ భూమి రికార్డుల్లో ఎక్కువగా ఉండడమే కారణమని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు ప్రోత్సాహ రూపంలో చర్యలు తీసుకుంటే పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయగలిగితే నిరుద్యోగ ఉపాధికి భారీగానే ఉద్యోగాలు లభిస్తాయని స్థానికులు భావిస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:35 AM