Share News

ఎంపీపీ పీఠం ఎవరికో ?

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:26 AM

నామినేషన్లు ముగిశాయి. అభ్యర్థులుగా ఉన్న కొందరికి ఇంకా బీ–ఫారాలు అందకపోవడంతో పార్టీ తరపున అధికారికంగా బరిలో నిలిచేది ఎవరన్నది తేల లేదు. నాయకత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అభ్యర్థులు ప్రకటించిన చోట ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానా లకు సంబంధించి అభ్యర్థులు తేలగా కొన్నిచోట్ల ఎదురుచూపులు తప్పలేదు.

ఎంపీపీ పీఠం ఎవరికో ?

అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు

కొన్ని మండలాల్లో కూటమి వ్యూహాత్మకం

ఎన్నికల తర్వాత ప్రకటించాలని నిర్ణయం

ఒకటి రెండు చోట్ల ఎంపీపీ అభ్యర్థులకు రెబల్స్‌ బెడద

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : నామినేషన్లు ముగిశాయి. అభ్యర్థులుగా ఉన్న కొందరికి ఇంకా బీ–ఫారాలు అందకపోవడంతో పార్టీ తరపున అధికారికంగా బరిలో నిలిచేది ఎవరన్నది తేల లేదు. నాయకత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అభ్యర్థులు ప్రకటించిన చోట ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానా లకు సంబంధించి అభ్యర్థులు తేలగా కొన్నిచోట్ల ఎదురుచూపులు తప్పలేదు.

మండల పరిషత్‌ అధ్యక్ష పీఠం వరిస్తుందంటూ అభ్యర్థుల్లో ముందుగానే జోష్‌ నెలకొంది. కూటమి అభ్యర్థుల్లో మరింత సందడి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ఆశీస్సులు ఉండడంతో గెలుపు నల్లేరుపై నడకగానే భావి స్తున్నారు. రిజర్వేషన్‌లు కొందరు అభ్యర్థులకు రెండోసారి ఎంపీపీగా అయ్యే అవకాశాలు కల్పించాయి. ఇంకొందరికి కొత్త అవకాశం ఏర్పడింది. ఎంపీపీ రిజర్వేషన్‌లకు అనుగుణంగా అభ్యర్థులకు స్థానిక ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు. ఎంపీపీ అభ్యర్థులు తాము నివాసం ఉండే, పట్టున్న స్థానాలు వేరే కేటగిరీకి రిజర్వ్‌ అయ్యాయి. దాంతో వేరే ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నారు. నామినేషన్‌లు దాఖలు చేశారు. జిల్లాలో ఒకటి రెండు చోట్ల కూటమి నిర్ణయించిన ఎంపీపీ అభ్యర్థులకు రెబల్స్‌ బెడద నెలకొంది. ఉద్దేశ పూర్వకంగానే నామినేషన్‌లు వేశారంటూ అభ్యర్థులు భావిస్తు న్నారు. ఈ విషయమై కూటమి అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆకివీడు ఎంపీపీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. అక్కడ ఎంపీపీ స్థానం జనసేనకు కేటా యించారు. ఆశావహు లంతా ఇప్పుడు దుంపగడపలో జనరల్‌ మహిళకు కేటాయించిన స్థానంలో నామినేషన్‌లు వేశారు.జనసేనలో సంప్రదింపులు జరిగాక ఒక్కరు మాత్రమే అక్కడ బరిలో ఉంటారు. మిగిలిన వారంతా నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు.

తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతోంది..?

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూరల్‌ మండలం, పెంటపాడు మండలాల పరిధిలో కూటమి మధ్య అభ్యర్థుల సర్దుబాటు జరిగింది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండల ఎంపీపీ, జడ్పీటీసీలను తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. పెంటపాడు మండల ఎంపీపీ, జడ్పీటీసీలను జనసేనకు వెళ్లాయి. తాడేపల్లిగూడెం రూరల్‌ ఎంపీపీ అభ్యర్థిగా పరిమి రవికుమార్‌ను ఎంపిక చేయగా మోదుగ్గుంట ఎంపీటీసీగా నామినేషన్‌ వేశారు. అదేస్థానం నుంచి ఈపూరి సత్యనా రాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ విషయమై పరిమి రవికుమార్‌ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. నామినేషన్ల ఉపసంహరణలోగానే అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని ఆశిస్తున్నారు. ఆకివీడు వంటి మండలాల్లో ఆశావహుల మధ్య పోటీ ఉంది. నాయకుల సఖ్యతతో గడువులోగా ఉపసంహరించుకునేలా చర ్చలు జరుపుతున్నారు. తాడేపల్లిగూడెంలో మాత్రం సంప్రదింపులు జరగడం లేదు. సీట్ల సర్దుబాటు కూడా అధినాయకత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. ఇప్పుడు ఉపసంహరణల పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇలాంటి ఒకటి రెండు చోట్ల మినహా కూటమిలో సర్దుబాటు అంతా సవ్యంగా సాగింది.

తణుకులో వ్యూహాత్మకం

తణుకు నియోకవర్గ పరిధిలో ఎంపీపీ అభ్యర్థుల ప్రకట నపై అక్కడ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తణుకు రూరల్‌,అత్తిలి ఎంపీపీలను తెలుగుదేశానికి కేటాయించారు. ఇరగవరం ఎంపీపీని జనసేనకు ఇచ్చారు. అయినా సరే మూడుచోట్ల ఎన్నికల తర్వాతే ఎంపీపీ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తొలుత అభ్యర్థులను ఖరారు చేయాలని భావించారు. కానీ స్థానికంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల తర్వాతే అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొగల్తూరు మండలంలో జనసేనకు ఇచ్చారు. అక్కడ కూడా పోటీ ఉంది. దాంతో ప్రస్తుతం అభ్యర్థి అంశాన్ని వాయిదా వేశారు.యలమంచిలి మండలంలో ఇద్దరిని ఎంపీపీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇద్దరికి చెరి సగం కాలం వంతున చేయాలని మంత్రి నిమ్మల నిర్ణయించారు. పెను మంట్రలో ఎన్నికల తర్వాత ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు.

కూటమి ఎంపీపీ అభ్యర్థులు ..

భీమవరం రూరల్‌ బసవని లక్ష్మీ నరసమ్మ (టీడీపీ)

వీరవాసరం భోగిరెడ్డి శ్రీనివాసరావు (జనసేన)

తాడేపల్లిగూడెం రూరల్‌ పరిమి రవికుమార్‌ (టీడీపీ)

పెంటపాడు పుల్లా రామలక్ష్మి (జనసేన)

ఉండి ఇర్రింకి లావణ్య (టీడీపీ)

కాళ్ల బూడి వెంకట పర్రాలు (టీడీపీ)

పాలకోడేరు పాలా సత్యవతి (టీడీపీ)

పాలకొల్లు రూరల్‌ అంగర వీరభద్రరావు (టీడీపీ)

యలమంచిలి పీతల శ్రీను/తాళ్ల నాగరాజు

ఆచంట బోళ్ల వెంకటసత్యనారాయణ(టీడీపీ)

పోడూరు దొంగ సూర్యప్రసాద్‌ ( టీడీపీ)

పెనుగొండ రొక్కాల సురేష్‌బాబు (టీడీపీ)

పెనుమంట్ర (ఎన్నికల తరువాత) (టీడీపీ)

నర్సాపురం రూరల్‌ వాతాడి ఉమా (టీడీపీ)

తణుకు ఎన్నికల తర్వాత (టీడీపీ)

ఇరగవరం ఎన్నికల తర్వాత (జనసేన)

అత్తిలి ఎన్నికల తర్వాత (టీడీపీ)

మొగల్తూరు తేలాల్సి ఉంది జనసేన

ఆకివీడు రూరల్‌ తేలాల్సి ఉంది జనసేన

గణపవరం తేలాల్సి ఉంది తేలాల్సి ఉంది

Updated Date - Oct 25 , 2026 | 12:26 AM