పనుల నాణ్యతపై విజిలెన్స్ విచారణ జరిపిస్తాం..
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:13 AM
ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో జరు గుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడబోమని, అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తామంటూ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు.
ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ హెచ్చరిక
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) :ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో జరు గుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడబోమని, అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తామంటూ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన శనివారం తనిఖీ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.21.30 కోట్లతో పనులు చేపట్టారు. గతంలోను ఎంపీ ఈ పనులను తనిఖీ చేశారు. శనివారం మరోసారి పరిశీలించి పనుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లోరింగ్ పనులు, వెయిటింగ్ హాలు, టాయిలెట్స్ సహా జరుగుతున్న, పూర్తయిన పనుల్లో నాసిరకం సామగ్రి వాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టరు ఎంపీ తనిఖీ సమయంలో రాలేదు. అనంతరం విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ పనుల తీరుపై ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. వచ్చే నెలలో మరోసారి తనిఖీ చేసి అప్పటికే మార్పు లేకుంటే విజిలెన్స్ విచారణ కోరి, కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.