దుర్గారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:18 AM
‘పేరంపేట గ్రామంలో మంగళవారం హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, హత్యకు కారకులైన దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం’ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ అన్నారు
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్
ఏరియా ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం
జంగారెడ్డిగూడెం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘పేరంపేట గ్రామంలో మంగళవారం హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, హత్యకు కారకులైన దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం’ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రి మార్చురీ గదిలో ఉన్న దుర్గారెడ్డి మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. ఎంపీ మహేశ్ ఏరియా ఆసపత్రికి వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, మృతుడి కుటుంబ సభ్యులు భారీస్థాయిలో చేరుకోవడంతో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, పేరంపేట టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోలి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, అఽధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని మృతుడు దుర్గారెడ్డి పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, భూ తగాదా విషయంలో పోలీసులు, అధికారులు పక్షపాతం వహించారని ఎంపీ మహేశ్‌కు పిర్యాదు చేశారు. నిందితుడి వెనుక వైసీపీ నేతల ప్రోద్భలం ఉందని టీడీపీ నాయకులు ఆరోపించారు. దీంతో వారిని ఆయన సముదాయించి, విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతమైన చింతలపూడి నియోజకవర్గంలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. హత్యకు కారణం కుటుంబ తగాదాలే అని చెబుతున్నా నిందితుడికి వైసీపీతో అనుబంధం ఉండడం, పోలీసులు వైఫల్యంపై సమగ్ర విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, పట్టణ, మండల టీడీపీ అఽధ్యక్షులు కొండ్రెడ్డి కిశోర్, కుక్కల మాధవరావు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.