ప్లీజ్.. పేదలకు న్యాయం చేయండి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:59 AM
‘మొదటి సమావేశం నుంచి చూస్తున్నాను.. నేను అభివృద్ధికి పంపిన సిఫార్సు లెటర్లకు, రిమైండర్లకు అధికారుల నుంచి సమాధానం ఉండదు.. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాల్లో 90 శాతం నిరక్ష్యరాస్యులైన పేదలకు ఎటువంటి సేవలందు తాయి.. ఇలా ఉంటే ప్రజలకు అధికారులుగా మీరు , ప్రజాప్రతినిధులుగా మేము ఏం న్యాయం చేస్తాం.. ప్లీజ్ నిరుపేదలకు న్యాయం చేయడానికి ఇప్పటికైనా సరైన పంథాలో నడవండి’ అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హితవు పలికారు.
ఆర్వోబీలు, బైపాస్‌లు కొలిక్కి రావాలి
సిఫార్సు లెటర్లకు సమాధానం ఉండదా?
దిశ సమావేశంలో ఎంపీ మహేశ్ ఆగ్రహం
ఏలూరు,జూన్ 24(ఆంధ్రజ్యోతి): ‘మొదటి సమావేశం నుంచి చూస్తున్నాను.. నేను అభివృద్ధికి పంపిన సిఫార్సు లెటర్లకు, రిమైండర్లకు అధికారుల నుంచి సమాధానం ఉండదు.. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాల్లో 90 శాతం నిరక్ష్యరాస్యులైన పేదలకు ఎటువంటి సేవలందు తాయి.. ఇలా ఉంటే ప్రజలకు అధికారులుగా మీరు , ప్రజాప్రతినిధులుగా మేము ఏం న్యాయం చేస్తాం.. ప్లీజ్ నిరుపేదలకు న్యాయం చేయడానికి ఇప్పటికైనా సరైన పంథాలో నడవండి’ అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హితవు పలికారు. కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం బుధవారం ఎంపీ అధ్యక్షతన జరిగింది. జడ్పీ సీఈవో జగదాంబ గత సమావేశంలో ప్రగతి నివేదికలపై తీసుకున్న చర్యలను వివరించారు. రైల్వేశాఖ, నేషనల్ హైవేస్, పరిశ్రమలు, ఆర్‌అండ్‌బీ, పుష్కరాల పనులు, డ్వామా, ఆర్‌డబ్ల్యుఎస్, వ్యవసాయశాఖ తదితర అంశాలపై చర్చ సాగింది. ఎంపీ మాట్లాడుతూ రెవెన్యూ అర్జీలు మీకు వచ్చినవి కూడా నా దగ్గరకు వస్తున్నాయి. వాటిలో పరిష్కరిం చదగ్గవి చేయండి.. లేకపోతే చేయలేమని చెప్పండంటూ జేసీ అభిషేక్ గౌడ్‌కు సూచించారు. పోలవరం, జంగా రెడ్డిగూడెం మండలాల్లో పల్లెల్లో డ్రంకెన్‌డ్రైవ్ కింద ఎక్కు వమందిపై కేసులు నమోదు చేస్తున్నారని పలువురు ఫోన్లు చేస్తున్నారని ఈ విషయాన్ని పరిశీలించాలని ఎస్పీ కిశోర్‌ను కోరగా అక్కడ అవేర్‌నెస్ కార్యక్రమాలను చేపడ తామని బదులిచ్చారు.
స్టేషన్ ఆధునికీకరణ సరిచేస్తే సరి.. లేకపోతే విజిలెన్స్‌కు ఫిర్యాదు..
నగరంలో అమృత్ పథకం కింద రూ.12 కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ఏ మాత్రం నాణ్యంగా లేవని ఫిబ్రవరి పరిశీలనలో తాను హెచ్చరిం చినా.. ఏ మార్పు లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులాగా ఆధునీకరిస్తామని చూపించిన త్రీడీ చిత్రాలకు ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధం లేకుండా ఉందన్నారు. ఇది ఒక గెస్ట్‌హౌస్‌లాగా ఉంది. బుకింగ్ కౌంటర్లు, వసతి, ప్రయాణికుల విశ్రాంతి గదు లు, టాయిలెట్లు వంటి వాటిని లేకుండా 10 వేల చద రపు అడుగులపైనే పార్కింగ్‌కు కేటాయిస్తారా? అసలేమి బాగాలేదు. పాత వాటిని తూతూమంత్రంగా మెరుగులద్ది కొనసాగిస్తు న్నారు. టాయిలెట్లు పూర్తిగా తీసేసి సరిచేయాల్సిందే. లేకపోతే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తా? మంత్రి ద్వారా విజిలెన్స్ విచారణ చేయిస్తానంటూ హెచ్చరిం చారు. టైల్స్ నాసిరకమైనవి వాడారు. కనీసం అడుగు రూ.40 విలువ చేయదు. ప్రజల కోసం మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.
అక్టోబరుకు ఆర్వోబీల పనులు
జిల్లాలో పెద్దఎత్తున ఆర్వోబీలు మంజూరు చేయిస్తే వాటిల్లో ఇప్పటికీ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదని.. రైల్వేశాఖ, రెవెన్యూశాఖలు సమన్వయం చేసుకుని ఎలైన్‌మెంట్, భూసేకరణలు పూర్తి చేయాలి. గత నవంబరు సమీక్షలో ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉన్నాయంటూ రైల్వే అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అక్టోబరు నెలాఖరు నాటికి కొన్నింటినైనా పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లక్ష్మిప్రసన్న, రైల్వే అధికారులను ఆదేశించారు. కైకలూరు బైపాస్‌ను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు.
త్వరలో మీ శాఖల్లో సమీక్షిస్తా..
వివిధ శాఖల అంశాలపై ప్రస్తావన సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డీఆర్‌డీఏ, ఏలూరు కార్పొరేషన్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర శాఖలతో స్వయంగా మీ వద్ద సమీక్షలను త్వరలో చేపడతానని తెలిపారు. ఉపాధి నిధులతో శ్మశాన వాటికలు పనులు మెరుగ్గా సాగుతున్నాయి. ఇక ముందు వీబీ రామ్ జి కింద మరిన్ని శ్మశానాలు అభివృద్ధి చేద్దామన్నారు. ఏలూరు ఆసుపత్రిలోని ల్యాబ్‌ను జంగా రెడ్డిగూడెంకు తరలించకుండా చూడండి.. కొత్తగా అక్కడ మంజూరుకు చర్యలు తీసుకుంటానని డీఎంహెచ్‌వో శోభ, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్యామలకు సూచించారు. ఎంపీ ల్యాడ్స్ కింద 2025–26లో ఇంకా 15 పనులు క్లారిటీ ఇవ్వలేదని, దీనిపై నిరంతరం సమీక్షించాలని ముఖ్య ప్రణాళికశాఖాధికారులకు సూచించారు.
ఏలూరు బీసీ వసతిగృహం, లైబ్రరీ అభివృద్ధికి హామీ
ఏలూరులో బీసీ వసతిగృహం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు విడుదల చర్యలు తీసుకుంటాననని ఎంపీ హామీ ఇచ్చారు. అదే విధంగా ఏలూరులో శిథిలావస్థలో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని రూ.రెండు కోట్లకు పైబడి నిధులతో నూతన భవనాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కైకలూరు, ఉంగుటూరుల్లో మంచినీటికి ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.. అక్కడ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. అంగన్‌వాడీల్లో ఇంకా సౌకర్యాలు మెరుగుదలకు, ప్రహారీలకు వీబీ రామ్ జీ ద్వారా చర్యలు తీసుకుంటానన్నారు. పుష్కరాల పనుల్లో భాగంగా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడుల్లో నిర్మించాల్సిన రోడ్ల నిర్మాణ పనులకు త్వరితగతిన మంజూరు తీసుకుని పనులు ప్రారంభించాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజానిధుల నుంచి అందిన ప్రతిపాదనలను ప్రాధాన్యం ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, ఇన్‌చార్జి డీఆర్వో దేవకిదేవి, డీపీవో మల్లికార్జునరావులు పాల్గొన్నారు.